జాన్వీ.. టాలీవుడ్ లో ఇలా..
టాలీవుడ్ లో అతిలోక సుందరిగా చిరస్థాయిగా నిలిచిన శ్రీదేవి రేంజ్ కు ఆమె కుమార్తె, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేరుకుంటుందా? అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.;
టాలీవుడ్ లో అతిలోక సుందరిగా చిరస్థాయిగా నిలిచిన శ్రీదేవి రేంజ్ కు ఆమె కుమార్తె, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేరుకుంటుందా? అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తెలుగు సహా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన అందం, అభినయంతో శాసించిన శ్రీదేవి వారసత్వాన్ని జాన్వీ కపూర్ కొనసాగించగలదా అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
శ్రీదేవి 1970లో మా నాన్న నిర్దోషి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, 1978లో వచ్చిన పదహారేళ్ల వయసుతో స్టార్ డమ్ అందుకున్నారు. అనంతరం ఆమె వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస విజయాలతో టాప్ ప్లేస్ లో నిలిచారు. తెలుగులో దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాల సరసన సందడి చేశారు.
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సహా పలువురు సీనియర్ స్టార్ హీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, వేటగాడు, ప్రేమాభిషేకం, కార్తీక దీపం, క్షణం క్షణం వంటి చిత్రాలు ఆమెను టాప్ ప్లేస్ కు చేర్చాయి. ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ తన కెరీర్‌ను అదే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ లో ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్ పై పూర్తి దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. తెలుగులో ఆమె తొలి చిత్రం దేవర కాగా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మంచి గుర్తింపు అందుకుంది. డెబ్యూతో హిట్ కూడా సాధించారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో కూడా జాన్వీ హీరోయిన్ గా ఎంపిక కావడం విశేషం. దేవర షూటింగ్ లోనే ఆఫర్ రావడం గమనార్హం.
పెద్ది మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండగా, టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే జాన్వీ కపూర్ భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా స్టార్ హీరోలతో పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించాలని ఆమె ఆసక్తి చూపుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ పై చర్చలు జరుగుతున్నాయని, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో జాన్వీ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తన ప్లేస్ ను స్ట్రాంగ్ గా మార్చుకోవాలని జాన్వీ కపూర్ కృషి చేస్తోంది. అయితే శ్రీదేవి రేంజ్ కు చేరుకోవడం అంత సులభం కాదని చెప్పాలి. అయినప్పటికీ సరైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగితే జాన్వీ కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉందని చెప్పొచ్చు.