స్టార్ హీరోను తిట్టిన తమ్ముడు.. మారిపోయాడు
పెద్దగా వివాదాల జోలికి వెళ్లని, ఎంతో మంచి వాడిగా పేరున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆ మధ్య ఒక కుటుంబ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఫిలిం సెలబ్రెటీలకు సంబంధించి కుటుంబ వివాదాలు కొన్నిసార్లు పెద్ద వార్తలు అవుతుంటాయి. పెద్దగా వివాదాల జోలికి వెళ్లని, ఎంతో మంచి వాడిగా పేరున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆ మధ్య ఒక కుటుంబ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమిర్ మీద, మిగతా కుటుంబ సభ్యుల మీద తన సోదరుడు ఫైసల్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశాడు.
తనను ఆమిర్ ఏడాది పాటు గదిలో బంధించాడని.. తాను ఆరోగ్యం ఉన్నప్పటికీ మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడని అతను ఆరోపించడం సంచలనం రేపింది. దీనిపై ఆమిర్ మౌనం వహించగా.. మిగతా కుటుంబ సభ్యులు మాత్రం అతడికే అండగా నిలిచారు. ఫైసల్‌నే తప్పుబట్టారు. కొన్ని రోజుల పాటు మీడియాలో నలిగిన ఈ విషయం తర్వాత మరుగున పడింది. ఐతే ఇప్పుడు ఫైసల్.. ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు.
రెండుసార్లు విడాకులు తీసుకున్న ఆమిర్.. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న గౌరీ స్ప్రాట్ అనే బిజినెస్ ఉమన్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి కొన్ని రోజుల ముందు ఫైసల్ కుటుంబ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆమిర్‌తో పాటు మిగతా కుటుంబ సభ్యులపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడుతున్నట్లు ఫైసల్ చెప్పాడు. కుటుంబ బంధాలను తిరిగి నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమన్నాడు. ముందుగా తన తల్లికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని అన్న ఫైసల్.. తన అన్న ఆమిర్‌తో పాటు మిగతా కుటుంబ సభ్యులకు కూడా సారీ చెప్పాడు.
కోపం, బాధలో వాళ్లందరినీ ఎన్నో మాటలు అన్నానని.. ఈ వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని నిరూపించే సమయం ఇది కాదని అన్నాడు. ఆధ్యాత్మిక ఆలోచనల వల్ల తనలో మార్పు వచ్చిందని, కుటుంబ బంధాల విలువ తెలిసిందని... ఇప్పుడు తన ప్రాధాన్యం కుటంబ బంధాలను నిలబెట్టుకోవడం మీదేనని అతను స్పష్టం చేశాడు. ఆమిర్, గౌరీ ఈ ఆదివారమే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ పెళ్లికి ఆమిర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు హాజరు కానుండడం విశేషం.