టాలీవుడ్ 'థియేటర్ వార్' క్లైమాక్స్ ఎప్పుడు? డెడ్‌లైన్ ముగిసినా కానీ!

టాలీవుడ్‌లో ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్సెస్ నిర్మాత‌ల వార్ గురించి తెలిసిందే. ప‌ర్సంలేజీ విధాన‌మా? రెంట‌ల్ విధాన‌మా? అన్న‌ది తేలాల్సి ఉంది.

Update: 2026-07-01 17:22 GMT

టాలీవుడ్‌లో ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్సెస్ నిర్మాత‌ల వార్ గురించి తెలిసిందే. ప‌ర్సంలేజీ విధాన‌మా? రెంట‌ల్ విధాన‌మా? అన్న‌ది తేలాల్సి ఉంది. అయితే ఛాంబ‌ర్ కమిటీ డెడ్‌లైన్ ఇప్ప‌టికే ముగిసి కొత్త‌ తేదీ రావడంతో టాలీవుడ్ మొత్తం ఈ అసలు విషయం ఎప్పుడు బయటపడుతుందా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఫిలిం ఛాంబర్ పెద్దలు నేడు లేదా రేపటిలోగా ఈ నూతన విధానాన్ని అధికారికంగా మీడియా ముందుకు తీసుకు వ‌స్తున్నారా?! అన్న‌ది స‌స్పెన్స్. పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో నిర్మాత‌లు వ‌ర్సెస్ ఎగ్జిబిట‌ర్ల (థియేట‌ర్ య‌జ‌మానులు) మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధం గురించి చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అద్దె (రెంట‌ల్) విధానం కొనసాగించాలని కొందరు, లేదు లాభనష్టాల్లో భాగం చేస్తూ ప‌ర్సంటేజీ విధాన‌మే కావాల‌ని మరికొందరు.. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఈ వివాదం సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రతను గమనించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనిపై ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. సుదీర్ఘ స‌మ‌యం అడిగి తీసుకున్న ఈ క‌మిటీ... క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ఇబ్బందులను కూలంకషంగా అధ్యయనం చేసి జూన్ 30 నాటికి తమ తుది నివేదికను సిద్ధం చేయాల్సి ఉంది.

ఫిలిం ఛాంబర్ తరపున ఏర్పాటైన ఈ కమిటీ జూన్ 30 నాటికి తన అధ్యయనాన్ని పూర్తి చేసి, రిపోర్ట్‌లో కీలక అంశాలను పొందుపరిచే ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఎదుర్కొంటున్న మెయింటెనెన్స్ ఖర్చులు, వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్‌) భారం, పెద్ద సినిమాల వల్ల వచ్చే నష్టాలను ఈ రిపోర్టులో స్పష్టంగా ప్రస్తావించారు. కేవలం ఒకరికే లాభం చేకూరేలా కాకుండా.. అటు నిర్మాత‌ల‌కు, ఇటు ఎగ్జిబిట‌ర్ల‌కు ఇద్ద‌రికీ విన్-విన్ సిట్యుయేషన్ ఉండేలా ఒక మధ్యేమార్గ ప్లాన్‌ను కమిటీ రూపొందించాల్సి ఉంది. ఎగ్జిబిట‌ర్ల స‌మ‌స్య‌ను శాశ్వతంగా ప‌రిష్క‌రించేలా సరికొత్త ఎగ్జిబిషన్ పాల‌సీకి ఈ నివేదిక ద్వారా శ్రీకారం చుట్టాల్ని ఉంది.

ఈ మొత్తం వ్యవహారంలో టాలీవుడ్ పెద్ద దిక్కు, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎగ్జిబిటర్లకు ఒక కీలకమైన ప్రామిస్ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడకుండా.. ప్రదర్శన రంగం నిలదొక్కుకునేలా తానే స్వయంగా చొరవ తీసుకుని న్యాయం చేస్తానని ఆయన నెల‌రోజుల కింద‌టి భేటీలో హామీ ఇచ్చారు. మెగాస్టార్ ఇచ్చిన మాట ప్రకారం.. ఇప్పుడు కమిటీ రిపోర్ట్‌లో పర్సంటేజీ విధానానికి, అద్దె విధానానికి మధ్య ఎలాంటి సమతుల్యతను తీసుకురాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా బడ్జెట్ - వసూళ్ల శాతాన్ని బట్టి (స్లైడింగ్ స్కేల్ పద్ధతిలో) ఇరువర్గాలకు నష్టం రాని విధంగా కొత్త రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారా? అన్న‌ది ఇండస్ట్రీలో చ‌ర్చ‌గా మారింది.

కమిటీ డెడ్‌లైన్ జూన్ 30 ముగిసి జూలైలో ప్ర‌వేశించాక‌.. టాలీవుడ్ మొత్తం ఈ అసలు విషయం ఎప్పుడు బయటపడుతుందా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఫిలిం ఛాంబర్ పెద్దలు నేడు లేదా రేపటిలోగా ఈ నూతన విధానాన్ని అధికారికంగా మీడియా ముందుకు తీసుకు వ‌స్తారా? అన్న‌ది వేచి చూడాలి. అయితే ఈ ఇష్యూలో సుదీర్ఘంగా కసరత్తు చేసిన కమిటీ సభ్యులు.. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం, అదే సమయంలో థియేటర్ యజమానులకు కనీస గ్యారెంటీ ఆదాయం లభించడం వంటి అంశాలపై ఒక తిరుగులేని ఫార్ములాను కనుగొన్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త పాలసీ అమలులోకి వస్తే.. ఇక‌పై ఎగ్జిబిట‌ర్ల‌కు, ముఖ్యంగా ఔత్సాహిక యువ నిర్మాత‌ల‌కు మ‌ధ్య థియేటర్ల కేటాయింపులు, కలెక్షన్ల షేరింగ్ విషయంలో ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా సమస్యకు శాశ్వత ప‌రిష్కారం దొరికిన‌ట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ ప్రదర్శన రంగ పునరుజ్జీవనానికి ఈ జూలై లో వెలువడబోయే నూతన నియమావళి ఒక మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి. త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్న ప్ర‌క‌ట‌న‌లో ఇరువ‌ర్గాల‌కు మేలు జ‌ర‌గాల‌ని ఆకాంక్షిద్దాం.

Tags:    

Similar News