ఆదిత్య ధర్ కు కుదిరింది.. వీళ్లెవరికి కుదర్లేదెందుకు?

సీక్వెల్ సినిమాల జాబితాను చూసినప్పుడు.. అవెప్పుడు విడుదల అవుతాయన్నది పక్కన పెడితే.. రెగ్యులర్ షూట్ ఎప్పుడు? ఎక్కడ? అన్నది ఇంకా స్పష్టత రాని దుస్థితి.;

Update: 2026-03-24 05:59 GMT

ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ మూవీ గురించి మాటలన్ని. ఈ సినిమా కథ.. కథనం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా రేపిన చర్చ అంతా ఇంతా కాదు. చివరకు ఈ సినిమా దెబ్బకు పొరుగున ఉన్న పాకిస్థాన్ లో పలువురిని భారత స్పై ఏజెంట్లుగా అనుమానిస్తున్న పరిస్థితి. అంతటి ప్రభావాన్ని చూపిన ఈ మూవీ.. భారత సినిమాకు మరో పాఠాన్ని నేర్పిందని చెబుతున్నారు. దర్శకుడు ఆదిత్యధర్ తీసింది మూడు సినిమాలు. అందులో రెండు ధురంధర్ ప్రాంఛైజీనే. కేవలం.. మూడు సినిమాలతో అతను క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు.

గడిచిన కొన్నేళ్లుగా బాలీవుడ్ కు పట్టిన విజయదాహాన్ని తన రెండు సినిమాలతో పూర్తిగా తీర్చేయటమే కాదు.. బాలీవుడ్ మొత్తం సగర్వంగా కాలర్ ఎగరేసేలా చేశాడు. అయినప్పటికీ.. బాలీవుడ్ దిగ్గజాలు మాత్రం ఈ విజయాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనిపించటం లేదన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ధురంధర్ మూవీ మేకింగ్ విషయంలో ఆదిత్యధర్ పుణ్యమా అని ఇప్పుడు పలువురు అగ్ర దర్శకులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ధురంధర్ మొదటి పార్టుకు రెండో పార్టీకి మధ్య గ్యాప్ కేవలం మూడు నెలలు.. మరింత పక్కాగా చెప్పాలంటే 105 రోజులు మాత్రమే. మొదటి సినిమా చివర్లోనే.. రెండో పార్టు విడుదల తేదీని ప్రకటించటం.. అందుకు తగ్గట్లే రెండో పార్టును విడుదల విషయంలో కచ్ఛితత్వాన్ని ప్రదర్శించటం.. ఒక్క రోజు ఆలస్యం కాకుండా చెప్పిన తేదీకి చెప్పినట్లే పూర్తి చేశారు. ఒక్క తెలుగులో డబ్బింగ్ కారణంగా రెండు.. మూడు రోజుల ఆలస్యంగా విడుదలైంది.

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. ధురంధర్ 2 తర్వాత తెలుగులో విడుదలైన భారీ చిత్రాల కొనసాగింపు పరిస్థితి చూస్తే.. ఒకలాంటి కోపం.. అంతకు మించిన ఆవేశం వచ్చే పరిస్థితి. ఒక సినిమాను రెండు భాగాలుగా తీయాలని భావిస్తే.. అందుకు తగ్గ ప్లానింగ్ మొదటి సినిమా నిర్మాణం మొదలు నుంచే షురూ చేయాలి కదా? అలా చేశారు కాబట్టే.. ధురంధర్ 2ను వంద రోజుల వ్యవధిలో విడుదల చేయగలిగారు. అదే సమయంలో గతంలో విడుదలై.. మంచి విజయాన్ని మూటగట్టుకొన్నప్పటికీ.. ఇప్పటికి విడుదల సంగతి తర్వాత.. షూట్ కూడా మొదలుకాని సినిమా లిస్టు పెద్దదే.

డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి.. సాలార్ రెండు సినిమాల కొనసాగింపు కోసం వెయిటింగ్. ఒక అగ్రహీరో రెండో భాగం కోసం ఒక సినిమా కాదు. ఏకంగా రెండు సినిమాలు ఎదురుచూడాల్సి రావటం ప్రభాస్ కే చెల్లుతుంది. అదే సమయంలో.. ఎప్పుడు విడుదల అవుతాయన్న ప్రాథమిక సమాచారం కూడా లేని వైనాన్ని ఏమనాలి? ఎలా చెప్పాలి? తెలుగు విషయానికే వస్తే.. ప్రభాస్ కు చెందిన రెండు సినిమాలు.. తారక్ కు చెందిన దేవర2 తో పాటు రణబీర్ కపూర్ - సందీప్ వంగా కలయికలో రావాల్సిన యానిమల్ మూవీతో పాటు పవన్ కు చెందిన ఓజీ, హరిహర వీరమల్లు తదితర సినిమాలు ఉన్నాయి.

సీక్వెల్ సినిమాల జాబితాను చూసినప్పుడు.. అవెప్పుడు విడుదల అవుతాయన్నది పక్కన పెడితే.. రెగ్యులర్ షూట్ ఎప్పుడు? ఎక్కడ? అన్నది ఇంకా స్పష్టత రాని దుస్థితి. ఇదంతా చూసినప్పుడు మనసులోకి వచ్చే సందేహం ఒక్కటే. ఒక సినిమాను రెండు పార్టుగా తీయాల్సి వచ్చినప్పుడు.. ధురంధర్ 2 మూవీ నిర్మాణాన్ని యమా ఫాస్టుగా తీసినప్పుడు మిగిలిన వాళ్లకు ఎందుకు సాధ్యం కాలేదు? అన్నది ప్రశ్న. తాను తీస్తున్న సినిమా మీద ఆదిత్యధర్ కు ఎలాంటి నమ్మకం.. ఆత్వవిశ్వాసం ఉందో.. మిగిలిన దర్శకులకు లేదా? అన్నదిప్పుడు ప్రశ్న. ధురంధర్ మూవీ డైరెక్టర్ కు తన సినిమా మీద అతడికి పూర్తి విశ్వాసంతో పాటు.. సినిమాను వెనువెంటనే విడుదల చేయాలన్న టార్గెట్ కూడా ముఖ్యమన్న విషయాన్ని ఆదిత్యధర్ తన చేతలతో చెప్పేశారని చెప్పాలి.

క్రేజీ ప్రాజెక్టుల విడుదల విషయంపై మన తెలుగు దర్శకులు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదన్న విషయానికి వస్తే.. సినిమాను రెండు భాగాలుగా అనుకునే విషయంలో ఉన్న సందేహాలు కారణంగా చెబుతున్నారు. కొన్ని క్రేజీ కాంబినేషన్ల విషయానికి వస్తే.. ప్రేక్షకుల తీర్పు వెలువడిన తర్వాత.. అందుకు తగ్గట్లే బిజినెస్ ప్లాన్ చేద్దామన్న ఆలోచన ఇండస్ట్రీస్ లోని వారికి లోపించటమే మాటగా చెప్పాలి.

మొదటి భాగాన్ని సక్సెస్ ఫుల్ గా ఆడిన తర్వాత కూడా విడుదల మీద అస్పష్టత ఉన్న సినిమాల జాబితా కాస్త పెద్దదే. సాలార్.. కల్కి 2898ఏడీ పార్టు2, దేవర పార్టు 2, యానిమల్ పార్కు, ఓజీ ఇలా చెప్పుకుంటూ పోతే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అలాంటప్పుడు మొదటి పార్టు సూపర్ డూపర్ హిట్ అయ్యాక రెండో పార్టుకు ఏళ్లకు ఏళ్లుగా టైం తీసుకోవటం కనిపిస్తుంది.

నిజానికి.. తాము తీస్తున్న సినిమా గన్ షాట్ గా విజయం సాధిస్తుందన్న ధీమా ఉంటే.. రెండో భాగాన్ని మొదటి భాగంతోనే కలిసి చూసేవారన్న మాట వినిపిస్తోంది. మిగిలిన దర్శకులకు ఆదిత్యధర్ కు ఉన్న వ్యత్యాసం విషయానికి వస్తే.. సినిమా విడుదల వేళ.. ఎలాంటి అంచనాలు లేకుండా.. కేవలం ప్రేక్షకులను టార్గెట్ పెట్టి సినిమా తీయలేదని చెప్పాలి. తెలుగు, కన్నడ దర్శకుల విషయానికి వస్తే.. తాము విడుదల చేసిన మూవీ ఏళ్లకు ఏళ్ల క్రితం నాటి సినిమాలు కావటం చూస్తే.. సగటు ప్రేక్షకుడి మీద ఆయా దర్శకులకు ఉన్న గౌరవం ఏ పాటిదన్న సందేహం కలుగక మానదు.

ఆదిత్య ధర్ తన సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా పట్టించుకోరా? అన్న ప్రశ్న కంటే కూడా.. తాను తీసే సినిమా విషయంలో తన వరకే తనకే నమ్మకం ఉండటంతో.. రెండో భాగాన్ని సైతం మొదటి భాగంతో కలిసి తీయటం ఒక ఎత్తు అయితే.. మిగిలిన దర్శకుల మాదిరి గ్రాఫిక్స్.. ఇతర సాంకేతిక అంశాల మీద కంటే కూడా కథ.. కథనం.. సాంకేతికత ఉన్నా.. లేకున్నా ప్రేక్షకుడి ఎమోషన్ ను టచ్ చేసేలా మాత్రం ప్లాన్ చేశారని చెప్పాలి. ఈ పాఠాన్ని మిగిలిన దర్శకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News