ధురంధర్ ఎప్పటికి గుర్తుండాలంటే.. ఇక్కడితో ఆగాల్సిందే

భావోద్వేగాలు భాష.. ప్రాంతం అనే పరిమితులకు అతీతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది ధురంధర్ 2.;

Update: 2026-03-24 05:59 GMT

భావోద్వేగాలు భాష.. ప్రాంతం అనే పరిమితులకు అతీతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది ధురంధర్ 2. బాలీవుడ్ లో డ్రామా ఎక్కువని.. టాలీవుడ్ లో హడావుడి ఎక్కువని.. కోలీవుడ్ లో అతి ఎక్కువని.. ఇలా దేశంలోని ప్రతి వుడ్ కు ఏదో ఒక భావాన్ని అపాదించటం మామూలే. అయితే.. ఇలాంటి మాటలకు భిన్నంగా కొన్ని సినిమాలు మాత్రం ప్రాంతాల పరిమితులని బద్ధలు కొట్టేస్తుంటాయి. ధురంధర్ సిరీస్ ఆ కోవకు చెందిందే. భారతీయుడు ఎవరైనా.. ఎక్కడివాడైనా ఈ సినిమాకు ఇట్టే కనెక్టు అయిపోతారంతే.

రెండు భాగాల్లో వచ్చిన ఈ ఫ్రాంఛైజ్ దగ్గర దగ్గర ఎనిమిది గంటల పాటు కథను చెప్పేసినా.. ప్రేక్షకుడు బోర్ కొట్టని పరిస్థితి. ఒక సినిమాలు నాలుగు గంటల పాటు ఏకధాటిగా చూశాక.. స్క్రీన్ మీద క్రెడిట్స్ పడుతున్న వేళలోనూ కుర్చీలో నుంచి కదలని విచిత్రమైన అనుభవాన్ని.. అనుభూతిని ఈ సినిమా పరిచయం చేస్తుంది. మార్నింగ్ షో మొదలు కొని అర్థరాత్రి మొదలయ్యే ఆఖరి షో వరకు ఒకేలాంటి ఉద్విగ్నతకు ప్రేక్షకుడ్ని గురి చేసే మేజిక్ ఈ సినిమా సొంతం. బాక్సాఫీస్ రికార్డుల గురించి.. ఈ సినిమా కలెక్షన్ల సునామీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ వివరాలతో బోలెడన్ని వార్తలు వచ్చాయి.. వస్తున్నాయి.. వస్తాయి కూడా. ఇలాంటి వేళే.. ఈ సినిమాకు కొనసాగింపుగా మరో భాగం ఉంటుందా? అన్నది పెద్ద చర్చ మొదలైంది.

ధురంధర్ 2 పార్టు చివర్లో.. మరో భాగం ఉంటుందన్న హింట్ ఇచ్చింది లేదు. మూవీ టీం ఎవరూ తదుపరి భాగం గురించి మాట్లాడింది లేదు. అయితే.. సగటు ప్రేక్షకుడు మాత్రం మరో భాగం ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళే.. మరో వాదన కూడా వినిపిస్తోంది. తినగ తినగ గారెలు సైతం చేదు అన్న సామెతకు తగ్గట్లే.. ఇప్పటికి వచ్చిన రెండు భాగాల ధురంధర్ ఎప్పటికి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రగా నిలిచిపోవాలంటే ఈ సినిమాను ఇక్కడితో ఆపేస్తేనే మంచిదన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఒక దర్శకుడు తలుచుకోవాలే కానీ.. సినిమా ఏదైనా.. కొనసాగించే సత్తా ఉంటుంది.అందులోనూ ధురంధర్ దర్శకుడు ఆదిత్యధర్ లాంటి వారికి ఇదో పెద్ద విషయం కాదు. కానీ.. ఇలాంటి సినిమాలు ఎప్పటికి నిలిచిపోవాలంటే మాత్రం.. ఇక్కడితో ఆగితేనే బెటర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఎనిమిది గంటల పాటు ఒక కథను ప్రేక్షకుడు సీటు కదలకుండా చేయటం చిన్న విషయం.

ఆ మేజిక్ ఎప్పటికి అలానే నిలిచిపోవాలంటే., ధురంధర్ రెండు భాగాలకు పరిమితం కావాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే ఫీల్ ప్రేక్షకుడ్ని పట్టేసిందో.. అది అలానే కొనసాగాలన్నా.. అదెప్పటికి అలానే నిలిచిపోవాలంటే మాత్రం రెండు భాగాలకే ధురంధర్ ను పరిమితం చేస్తేనే మంచిదని చెప్పక తప్పదు. ఈ తరహా సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చినవి అలానే ఒక తీపి గురుతుగా నిలిచిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు తగ్గట్లే ఆదిత్యధర్ ఆలోచనలు కూడా ఇలానే ఉన్నట్లు చెబుతున్నారు. అతని మనసులో వేరే ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటి మీద ఆయన ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News