హీరోతో సంబంధమేంటి? కంటెంట్ ఉంటేనే కదా!
ఏపీ ఎన్నికలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత సమయం కేటాయించి తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశారు.;
సినిమా విజయానికి స్టార్ హీరో, హీరోయిన్ల కంటే కంటెంట్ కే ప్రాధాన్యం ఎక్కువ అన్న విషయం మరోసారి చర్చకు వస్తోంది. ఎంత పెద్ద హీరో నటించినా, ఎంత క్రేజ్ ఉన్న హీరోయిన్ ఉన్నా.. చివరికి సినిమా ఫలితం మాత్రం కథ, స్క్రీన్ ప్లే మీదే ఆధారపడుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. అదే వీక్ గా ఉంటే భారీ అంచనాల ఉన్న సినిమాలు కూడా నిరాశపరుస్తాయి.
ఇటీవల టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పలు సినిమాల రిజల్ట్ ల నేపథ్యంలో ఆ అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. పవన్ సినిమాల్లో నటించిన హీరోయిన్లకు పెద్దగా హిట్స్ రావడం లేదని టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే దీనికి అసలు కారణం హీరో కాదని, కంటెంట్ లోపమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఏపీ ఎన్నికలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత సమయం కేటాయించి తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశారు. ముందుగా హరిహర వీరమల్లు విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆమె కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
తర్వాత వచ్చిన ఓజీ అభిమానులను ఆకట్టుకున్నా, ఓవరాల్ గా చూస్తే కొన్ని నష్టాలు తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ చిత్రంలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ మంచి బ్రేక్ వస్తుందని ఆశించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
ఇందులో హీరోయిన్లుగా నటించిన శ్రీలీల, రాశీ ఖన్నాలకు కూడా పెద్దగా లాభం చేకూరలేదనే అంతా చెబుతున్నారు. దీంతో పవన్ సినిమాల్లో నటిస్తే హీరోయిన్లకు హిట్స్ రావడం లేదు అన్న ప్రచారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఊపందుకుంది. అయితే సినీ ప్రియులు మాత్రం ఆ వాదనను పూర్తిగా ఖండిస్తున్నారు. సినిమా ఫలితం ఒక వ్యక్తిపై ఆధారపడదని, మొత్తం టీమ్ కృషి, ముఖ్యంగా కంటెట్ కీలకమని చెబుతున్నారు.
మంచి కథ, సరైన స్క్రీన్‌ప్లే ఉంటే ఎవరు నటించినా సినిమా విజయం సాధిస్తుందనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిందని అంటున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. వారు కూడా కథను పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. కేవలం స్టార్ హీరో ఉన్నాడనే కారణంతో సినిమాను ఓకే చేస్తే, తర్వాత ఫలితం నిరాశ కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి, సినిమా విజయానికి ప్రధాన కారణం కంటెంట్ మాత్రమేనని మరోసారి స్పష్టమవుతోంది. హీరో హిట్ ఇచ్చారా లేదా అన్నదానికంటే, కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్నది అసలు ప్రశ్నగా నిలుస్తోంది.