అల్లరోణ్ని అల్లరిపాలు చేస్తున్నారు

Update: 2015-05-26 01:30 GMT
తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం. అందుకే పరభాషా చిత్రాల్ని బాగా ఆదరిస్తుంటారు. ముఖ్యంగా తమిళ సినిమాల మీద మనోళ్లకు మంచి అభిప్రాయం. అక్కడి నుంచి వచ్చిన మంచి సినిమాల్ని బాగా ఆదరిస్తుంటారు. ఐతే దీన్ని బలహీనతగా భావించి కొందరు టూమచ్‌గా వ్యవహరిస్తుంటారు. తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్‌ అయిన సినిమాల్ని మళ్లీ తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేయడం చాలాసార్లు చూశాం. ఇప్పుడీ వ్యవహారం శ్రుతి మించింది.

అల్లరి నరేష్‌ నటించిన తమిళ సినిమా 'కురుంబు'ను 'నా అల్లరి' పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఐతే ఈ 'కురుంబు' సినిమా వెనుక కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నరేష్‌ తొలి సినిమా 'అల్లరి'కి ఇది రీమేక్‌. తెలుగులో 'పంజా'.. తమిళంలో బిల్లా, ఆరంభం లాంటి భారీ సినిమాలు తీసిన విష్ణువర్ధన్‌ దర్శకుడిగా పరిచయమైంది ఈ సినిమాతోనే. నరేష్‌ సరసన నిఖిత, దియా హీరోయిన్లు నటించిన ఈ సినిమా తమిళంలో ఫ్లాప్‌ అయింది.

అలాంటి సినిమాను తమిళంలో వచ్చిన పదేళ్లకు డబ్‌ చేసి తెలుగులో రిలీజ్‌ చేయడమంటే వెర్రితనం కాక మరేంటి? పైగా పోస్టర్లలో సినిమాకు సంబంధించిన ముఖాలేవీ పెట్టలేదు. అల్లరోడిని.. నిఖితను.. మిగతా నటీనటుల్ని లేటెస్ట్‌ గెటప్స్‌లో చూపిస్తున్నారు. అసలే అల్లరోడి కెరీర్‌ ఇప్పుడు అయోమయంలో ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాను విడుదల చేయడమంటే.. మన కామెడీ హీరోని అల్లరిపాలు చేయడం తప్ప ఇంకేంటి?



Tags:    

Similar News