నిర్మాతలకు రిలీఫ్.. ప్రేక్షకులకు భారమా?

ఒకప్పుడు సినిమా టికెట్ అంటే కుటుంబమంతా కలిసి థియేటర్‌ కు వెళ్లి చూడగలిగే ఖర్చు. కానీ ఇప్పుడు స్టార్ హీరో సినిమా వస్తే టికెట్ రేట్లే చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Update: 2026-07-16 08:21 GMT

ఒకప్పుడు సినిమా టికెట్ అంటే కుటుంబమంతా కలిసి థియేటర్‌ కు వెళ్లి చూడగలిగే ఖర్చు. కానీ ఇప్పుడు స్టార్ హీరో సినిమా వస్తే టికెట్ రేట్లే చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల నిర్ణయంలో నిర్మాతలకు మరింత ఫ్రీడమ్ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు రావడంతో కొత్త చర్చ మొదలైంది. ఇది నిర్మాతలకు పెద్ద ఊరటగా మారుతుందా? లేక ప్రేక్షకుల జేబుపై మరో భారం పడుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీంతో నిర్మాతలు ప్రత్యేక అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే మాత్రం ప్రభుత్వం నిర్ణయించే రేట్ లిమిట్స్ లోనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే టికెట్ ధరలను ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో రిలీజ్ సమయాల్లో ఉండే అనుమతుల వ్యవహారం తగ్గిపోతుంది.

ఇది నిర్మాతల కోణంలో చూస్తే పెద్ద ప్రయోజనమే. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి వారం కలెక్షన్లు చాలా కీలకం. టికెట్ ధరలను మార్కెట్ డిమాండ్‌ కు అనుగుణంగా నిర్ణయించుకునే అవకాశం వస్తే బడ్జెట్ ను వేగంగా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ప్రేక్షకుల యాంగిల్ లో చూస్తే పరిస్థితి మరోలా కనిపిస్తోంది.

ఇప్పటికే మల్టీప్లెక్సులలో ఒక సినిమా చూడాలంటే టికెట్, ఫుడ్, పార్కింగ్ కలిపి భారీ ఖర్చే అవుతోంది. కొత్త విధానంతో నిర్మాతలకు మరింత ఫ్రీడమ్ లభిస్తే పెద్ద సినిమాల టికెట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. ఒక కుటుంబం నలుగురు కలిసి సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి వస్తే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఓటీటీలు అందుబాటులో ఉండటంతో చాలా మంది థియేటర్ కంటే డిజిటల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. అలాంటి సమయంలో అధిక టికెట్ ధరలు ప్రేక్షకులను మరింత దూరం చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇండస్ట్రీ వర్గాలు మాత్రం భిన్నంగా వాదిస్తున్నాయి. ప్రతి సినిమాకు ఒకే ధర ఉండదని, భారీ బడ్జెట్ చిత్రాలు, చిన్న సినిమాల అవసరాలు వేరని చెబుతున్నాయి. నిర్మాతలకు కొంత ఫ్రీడం ఇవ్వడం వల్ల పరిశ్రమకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నాయి.

అయితే అసలు విషయం ప్రభుత్వం తీసుకొచ్చే విధానంలోనే ఉంది. నిర్మాతలకు ఫ్రీడమ్ ఇస్తూనే ప్రేక్షకులకు భారం పడకుండా లిమిట్ ను ఎలా నిర్ణయిస్తుందనేదే కీలకం. ఎందుకంటే ఆ నిర్ణయం కేవలం టికెట్ రేట్ల గురించే కాదు.. థియేటర్‌ కు వచ్చే ప్రేక్షకుడి జేబు, సినిమా పరిశ్రమ ఫ్యూచర్ రెండింటిపైనా ప్రభావం చూపించే అంశంగా మారబోతోంది. అందుకే కొత్త జీవోలో ఉండే రూల్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News