బిగ్ డైరెక్ట‌ర్స్‌ని ఓవ‌ర్ టేక్ చేసేస్తున్నాడుగా!

టాలీవుడ్‌లో స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూస‌ర్ నోట విన్నా వినిపిస్తున్న ఒకే ఒక మాట హిట్ మెషీన్ అనిల్ రావిపూడి.;

Update: 2026-01-17 11:30 GMT

టాలీవుడ్‌లో స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూస‌ర్ నోట విన్నా వినిపిస్తున్న ఒకే ఒక మాట హిట్ మెషీన్ అనిల్ రావిపూడి. ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టుగా ఈ యంగ్ డైరెక్ట‌ర్ టాలీవుడ్ ప్ర‌స్థానం సాగుతోంది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, అసోసియేట్‌గా, రైట‌ర్‌గా అంచ‌లంచెలుగా ఎదుగుతూ డైరెక్ట‌ర్‌గా మారిన అనిల్ రావిపూడి `ప‌టాస్‌` నుంచి నేటి `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` వ‌ర‌కు అప‌జ‌య‌మెరుగ‌ని డైరెక్ట‌ర్ అనిపించుకుంటున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో కెరీర్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటూ స్టార్ డైరెక్ట‌ర్ల‌కు సాధ్యం కానీ ఫీట్‌ల‌ని సుసాధ్యం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు.

కెరీర్ ప్రారంభం నుంచి జంధ్యాల మార్కు కామెడీ అంశాల‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని జోడించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకుంటున్నాడు. త‌న‌దైన మార్కు జోన‌ర్‌ని క్రియేట్ చేసుకుని దాని ద‌రిదాపుల్లోకి కూడా ఏ డైరెక్ట‌రూ రాకుండా.. అస‌లు ఏ డైరెక్ట‌ర్ ట‌చ్ చేయ‌లేని హిట్ ఫార్ములాని ఫాలో అవుతూ దాంతో వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. హిట్ మెషీన్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకుంటూ క్రేజీ స్టార్ డైరెక్ట‌ర్ల‌కు సాధ్యం కానీ బాక్సాఫీస్ లెక్క‌ల్ని సాధిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

`ఎఫ్ 2`తో సంక్రాంతి సెంటిమెంట్‌ని బాగా వంట‌బ‌ట్టించుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఫ‌స్ట్ టైమ్ రూ.100 కోట్ల మార్కుని చాలా అవ‌లీల‌గా క్రాస్ చేశాడు. ఆ మ్యాజిక్‌ని `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో డ‌బుల్ చేసి మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. 2020 సంక్రాంతికి విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.200 కోట్ల మార్కుని దాటి మ‌హేష్ సినిమాల్లో స‌రికొత్త రికార్డుని సృష్టించింది. ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ 2025లో వెంకీ మామ‌తో చేసిన `సంక్రాంతికి వ‌స్తున్నాం` రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఓ మోస్తారు అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ అనిల్ రావిపూడి మార్కు వినోదంతో బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేసింది. ఏకంగా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.260 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురి చేసింది. త‌న‌కంటే పేరున్న డైరెక్ట‌ర్లు బాక్సాఫీస్ వ‌ద్ద రూ.200 కోట్ల మార్కుని దాటే సినిమాల‌ని అందించ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతుంటే అనిల్ రావిపూడి మాత్రం చాలా సింపుల్‌గా రూ.200 కోట్ల మార్కుని దాటేసి అప‌జ‌య‌మెరుగ‌ని డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇండ‌స్ట్రీలో `హిట్ గ్యారంటీ` అనే ట్రేడ్ మార్కుని ద‌క్కించుకుంటూ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు.

ఈ సంక్రాంతికి మెగాస్టార్‌తో చేసిన `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` ఐదు రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.226 కోట్ల‌కు పైగా గ్రాస్‌ని సాధించ‌డంతో అనిల్ రావిపూడి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారాడు. రూ.200 కోట్ల మార్కుని దాట‌లేని డైరెక్ట‌ర్లు రూ.30 నుంచి రూ.35 కోట్లు పారితోషికం తీసుకుంటుంటే అనిల్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో సినిమాకు రూ.18 కోట్లు మాత్ర‌మే పారితోషికం తీసుకుంటూ వ‌చ్చాడు. అయితే `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` త‌రువాత పారితోషికంని భారీగా పెంచే అవ‌కాశం ఉంద‌ని, దాదాపు రూ.30 కోట్లు డిమాండ్ చేస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే స్టార్ డైరెక్ట‌ర్లుగా చెప్పుకుంటున్న వారిని అనిల్ కూల్‌గా ఓవ‌ర్ టేక్ చేయ‌డం లాంఛ‌న‌మే.

Tags:    

Similar News