'ఆల్ఫా' ఫేక్‌ కలెక్షన్లు -YRF సెల్ఫ్ బుకింగ్స్ ఆరోపణలు మ‌ళ్లీ మ‌ళ్లీ!

నెటిజన్లు ఆరోపిస్తున్నట్లుగా... సినిమాకు క్రేజ్ లేకపోయినా కొంద‌రు ఫిలిం మేకర్స్ కలెక్షన్లను ఫేక్‌గా చూపిస్తున్నారనే చర్చ సినీ వర్గాల్లో గట్టిగానే నడుస్తోంది.

Update: 2026-07-05 02:12 GMT

నెటిజన్లు ఆరోపిస్తున్నట్లుగా... సినిమాకు క్రేజ్ లేకపోయినా కొంద‌రు ఫిలిం మేకర్స్ కలెక్షన్లను ఫేక్‌గా చూపిస్తున్నారనే చర్చ సినీ వర్గాల్లో గట్టిగానే నడుస్తోంది.సెల్ఫ్-బుకింగ్స్ , కార్పొరేట్ బుకింగ్స్ అంటూ వెబ్‌లో ఒక‌టే ర‌చ్చ‌వుతోంది.

సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయని కలరింగ్ ఇవ్వడానికి నిర్మాణ సంస్థలే స్వయంగా బల్క్ బుకింగ్స్ (టిక్కెట్లను తామే కొనుగోలు చేయడం) చేసుకుని థియేటర్లు నిండినట్లు చూపిస్తున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆలియా న‌టించిన `ఆల్ఫా` కోసం ఇలాంటి ప్ర‌య‌త్నం చేసార‌ని ఆరోపిస్తున్నారు. ఆల్ఫా మేకర్స్ మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ 10 కోట్లు అని ప్రచారం చేయాలని చూసినా.. అధికారిక‌ ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం ఇండియాలో సుమారు 4.48 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్‌లో మాత్రమే నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రమోషన్స్ అండ్ హైప్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఓపెనింగ్ చాలా యావరేజ్‌గా నమోదైంది. ఈ సినిమా కోసం ఆలియా భట్ ఏకంగా 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంది. సినిమా బడ్జెట్ 100 కోట్ల‌ నుండి 125 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే వైఆర్ఎఫ్ త‌ప్పుడు ప్ర‌చారంపైనే నెటిజ‌నులు దుమ్మెత్తిపోస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

బాలీవుడ్ చలనచిత్ర రంగాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రస్తుతం ఒక సరికొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆలియా భట్, శర్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన మొద‌టి లేడీ స్పై యాక్షన్ చిత్రం `ఆల్ఫా` థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే తీవ్రమైన ప్రతికూల విమర్శలను మూటగట్టుకుంది. నెటిజన్లు.. ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమా కంటెంట్‌ను తిరస్కరించడమే కాకుండా.. కలెక్షన్లను ఫేక్‌గా చూపిస్తూ మేకర్స్ దిగజారారని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్ వంటి సోషల్ మీడియా వేదికలపై వైఆర్ఎఫ్ సంస్థ థియేటర్లను `సెల్ఫ్-బుకింగ్స్` లేదా `కార్పొరేట్ బుకింగ్స్` ద్వారా తామే షోల‌ను నింపుకుంటూ ఆర్టిఫిషియల్ హైప్‌ను క్రియేట్ చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

నిజానికి వైఆర్ఎఫ్ సంస్థ బాక్సాఫీస్ నంబర్లను తారుమారు చేస్తోందనే విమర్శలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో షారూఖ్ ఖాన్ నటించిన `పఠాన్`, సల్మాన్ ఖాన్ `టైగర్ 3`, హృతిక్ రోషన్ `వార్ 2` వంటి భారీ బడ్జెట్ స్పై యూనివర్స్ సినిమాలు విడుదలైనప్పుడు కూడా ఇదే విధమైన `కార్పొరేట్ బుకింగ్స్` వివాదం తెరపైకి వచ్చింది. సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోయినా..థియేటర్ల యజమానులకు ముందే డబ్బులు చెల్లించి లేదా కార్పొరేట్ సంస్థల ద్వారా బల్క్ టిక్కెట్లు కొనుగోలు చేయించి.. మొదటి వీకెండ్‌లో వందల కోట్ల వసూళ్లు సాధించినట్లు నకిలీ పోస్టర్లను వైఆర్ఎఫ్ విడుదల చేసిందనే ఆరోపణలు అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ సంస్థ కేవలం నంబర్ల మ్యాజిక్కే కాకుండా ప్రమోషన్స్ కోసం తీవ్రమైన నెగటివ్ మార్కెటింగ్ స్టంట్లకు పాల్పడుతోందనేది నెటిజనుల ప్రధాన ఆరోపణ. ఇటీవల రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో న‌టించిన `మార్దానీ 3` సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై, బెంగళూరు నగరాల్లో `గర్ల్స్ కిడ్నాప్` అవుతున్నారంటూ సోషల్ మీడియాలో భయాందోళనలు సృష్టించేలా కొన్ని ఫేక్ వీడియోలను ప్లాంట్ చేశారు. చివరకు శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగి అది కేవలం సినిమా ప్రమోషన్ స్టంట్ అని క్లారిఫై చేయాల్సి వచ్చింది. ఇలాంటి చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ కారణంగానే వైఆర్ఎఫ్ సంస్థ వ్యవస్థాపకుడు యష్ చోప్రా సంపాదించిన దశాబ్దాల క్రెడిబిలిటీ.. ప్రస్తుత అధినేత ఆదిత్య చోప్రా హయాంలో పూర్తిగా మంటగలిసిపోతోందని సినిమా లవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం విడుదలైన `ఆల్ఫా` సినిమా విషయానికి వస్తే.. నెగటివ్ పీఆర్ ఒకవైపు.. సినిమా వీక్ కంటెంట్ మరోవైపు ఈ చిత్రాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఆలియా భట్‌ను ఒక సూపర్ స్పై లాగా చూపించడానికి మేకర్స్ చేసిన ప్రయత్నం వ‌ర్క‌వుట‌వ్వ‌లేదు. ఒక హాలీవుడ్ బ్లాక్ విడో సినిమాను కాపీ కొట్టినట్లుగా ఉన్న యాక్షన్ సీక్వెన్స్.. బలహీనమైన స్క్రీన్‌ప్లే.. బాబీ డియోల్ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాయని క్రిటిక్స్ విమ‌ర్శించారు. సినిమాకు క్రేజ్ లేకపోవడంతో మొదటి రోజు కేవలం 4.48 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్‌లోనే ఓపెనింగ్స్ రావడం వైఆర్.ఎఫ్ ప్ర‌తిష్టకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

సినీ ఆడియన్స్ ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారు. కేవలం సోషల్ మీడియాలో ఖాళీ థియేటర్ల ఫోటోలను పెట్టడమే కాకుండా.. ఏయే నగరాల్లో మేకర్స్ ఫేక్ బుకింగ్స్ చేస్తున్నారో లైవ్ లొకేషన్ల స్క్రీన్‌షాట్లతో సహా బయటపెడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో లేదా హీరోయిన్ ఉన్నా.. కేవలం ప్ర‌చార‌ స్టంట్లు .. కార్పొరేట్ మనీ లాండరింగ్ బుకింగ్స్ ద్వారా ఒక అట్టర్ ప్లాప్ సినిమాను హిట్ గా మ‌ల‌చ‌లేరని `ఆల్ఫా` సినిమా కలెక్షన్ల రియాలిటీ మరోసారి నిరూపించింది. ఇప్పటికైనా ఆదిత్య చోప్రా తన క్రియేటివ్- మార్కెటింగ్ టీమ్‌లను మార్చి.. నకిలీ నంబర్ల వేటను ఆపి.. మంచి కంటెంట్‌పై దృష్టి పెట్టకపోతే వైఆర్ఎఫ్ అనే ఐకానిక్ బ్రాండ్ చరిత్ర పుటల్లో కలిసిపోవడం ఖాయమ‌ని ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు.

Tags:    

Similar News