16 ఏళ్ల తర్వాత.. మళ్లీ బన్నీ కాంపౌండ్‌లో క్రిష్!
‘వేదం’ వచ్చి ఈ ఏడాదితో 16 ఏళ్లు. అప్పట్లో క్రిష్ రెండో సినిమా మాత్రమే. మొదటి సినిమా ‘గమ్యం’ చూసిన తర్వాత ఆయన కథలపై అల్లు అర్జున్‌కు మంచి ఇష్టం ఏర్పడింది
‘వేదం’ వచ్చి ఈ ఏడాదితో 16 ఏళ్లు. అప్పట్లో క్రిష్ రెండో సినిమా మాత్రమే. మొదటి సినిమా ‘గమ్యం’ చూసిన తర్వాత ఆయన కథలపై అల్లు అర్జున్‌కు మంచి ఇష్టం ఏర్పడింది. ‘వేదం’ను మొదట చిన్న హీరోలతో చేయాలని క్రిష్ అనుకుంటున్న టైమ్‌లో బన్నీ స్వయంగా ముందుకొచ్చి కేబుల్ రాజు పాత్ర చేశాడు. అప్పటికే కమర్షియల్ హీరోగా మంచి స్థాయిలో ఉన్నా, మల్టీస్టారర్‌లో ఒక పాత్ర చేయడానికి వెనకాడలేదు.
‘వేదం’ బాక్సాఫీస్ దగ్గర బన్నీ రెగ్యులర్ సినిమాల రేంజ్‌లో ఆడలేదు. కానీ కేబుల్ రాజు మాత్రం నటుడిగా ఆయనకు స్పెషల్ సోల్ ఉన్న పాత్రగా మిగిలిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్, డబ్బు కోసం తిరిగే కుర్రాడి నుంచి చివరకు మారిపోయే తీరు బన్నీ కెరీర్‌లో ఇప్పటికీ చెప్పుకునే ట్రాక్. క్రిష్ పెన్ మీద ఆయనకు అప్పట్లో ఉన్న నమ్మకం వల్లే ఆ సినిమా చేశాడనే విషయం ఇండస్ట్రీలో చాలాసార్లు వినిపించింది.
ఇద్దరి మధ్య బాండింగ్ కూడా అక్కడితో ఆగిపోలేదనే టాక్ ఉంది. బన్నీ, క్రిష్ ఇప్పటికీ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారని చెబుతుంటారు. క్రిష్ కథలు, ఆయన ఆలోచించే విధానం బన్నీకి నచ్చుతుందనే మాట కూడా చాలా కాలంగా ఉంది. ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో క్రిష్‌కు సినిమా సెట్ అవుతుండటంతో, బన్నీ వైపు నుంచి కూడా మంచి మాట వెళ్లి ఉండొచ్చనే ప్రచారం మొదలైంది.
క్రిష్‌కు ఈ ఛాన్స్ సరైన టైమ్ లోనే వస్తోంది. ‘హరిహర వీరమల్లు’ కోసం కెరీర్‌లో చాలా సమయం వెళ్లిపోయింది. ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుష్కతో చేసిన ఘాటీ కూడా కావాల్సిన రిజల్ట్ ఇవ్వలేదు. అయినా గమ్యం, వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దర్శకుడిగా ఆయన కథలపై ఇండస్ట్రీలో ఇప్పటికీ మంచి గౌరవమే ఉంది.
ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో క్రిష్ ఓ యానిమేషన్ సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘మహిషాసురమర్దిని’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. దేవి కథను యానిమేషన్ ఫార్మాట్‌లో తీసుకెళ్లే ప్లాన్ ఉంటే క్రిష్‌కు ఇది పూర్తిగా కొత్త ట్రాక్. చారిత్రక, పీరియడ్ కథలను పెద్ద కాన్వాస్‌లో చేసిన అనుభవం మాత్రం ఆయనకు ఇప్పటికే ఉంది.
పైగా ‘మహావతార్ నరసింహ’ తర్వాత మైథాలజీ యానిమేషన్‌కు థియేటర్లలో మంచి మార్కెట్ ఉందని నిర్మాతలకు అర్థమైంది. భారీ స్టార్ కాస్ట్ లేకుండానే పురాణ కథను పెద్ద తెరపై హిట్ అయ్యేలా చూపించవచ్చని ఆ సినిమా చూపించింది. అలాంటి టైమ్‌లో క్రిష్ లాంటి దర్శకుడు గీతా ఆర్ట్స్‌తో దేవి కథ పట్టుకుంటే ప్రాజెక్ట్‌పై సహజంగానే క్యూరియాసిటీ ఉంటుంది. ఇక ఈ చాన్స్ ను క్రిష్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.