AI మార్ఫింగ్ కి చెక్?.. స్పెషల్ ప్లాన్ తో స్టార్ హీరోయిన్స్!

రీసెంట్ గా కొందరు స్టార్ హీరోయిన్ల ఫోటోలు ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ట్రెండ్ చేయడం చర్చనీయాంశమైంది.;

Update: 2026-02-11 11:30 GMT

టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా యూజ్ చేస్తున్న వేళ.. పలువురు యాక్రెస్ట్ లు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎక్స్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ సహాయంతో పిక్స్ ను మార్ఫ్ చేసి వైరల్ చేయడం వారిలో ఆందోళన కలిగిస్తోంది.

రీసెంట్ గా కొందరు స్టార్ హీరోయిన్ల ఫోటోలు ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ట్రెండ్ చేయడం చర్చనీయాంశమైంది. యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ కు సంబంధించిన బికినీ పిక్స్ తోపాటు రష్మిక మందన్న పుష్ప 2 సినిమాలోని సాంగ్స్ స్టిల్స్‌ ను ఏఐ ద్వారా మార్ఫ్ చేసి కొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు. ఫేస్ మాత్రం అదే ఉంచి.. మిగతా పార్ట్స్ కు సంబంధించి మార్పులు చేసి ఫేక్ ఫోటోస్ ను వైరల్ చేయడం.. హీరోయిన్లకు అసౌకర్యానికి గురి చేస్తోంది.

దీంతో ఇలాంటి ఘటనలపై పలువురు హీరోయిన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పర్సనల్ రెస్పెక్ట్, ప్రైవసీకి భంగం కలిగేలా మార్ఫింగ్‌ లు జరుగుతుండటంతో.. అంతా కలిసి రెస్పాండ్ అవ్వాలని భావిస్తున్నారట. అందుకే త్వరలో కొందరు స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి, తదుపరి చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో కేవలం పర్సనల్ గా రెస్పాండ్ అవ్వడం కన్నా.. ఒక టీమ్ గా ఏర్పడి అఫీషియల్ గా ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఏఐ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టపరమైన రక్షణ కల్పించాలని.. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లకు నిబంధనలు పెంచాలని కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలో సైబర్ రూల్స్ ఉన్నప్పటికీ.. అవి మార్ఫింగ్ పిక్స్ ను అడ్డుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే సెలబ్రిటీలే కాకుండా సాధారణ మహిళలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆ అంశంపై పెద్ద ఎత్తున చర్యలు అవసరమని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్లు ముందుకు వచ్చి పోరాటం చేస్తే... ఇతరులకు కూడా రక్షణ కలిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారట. ఏదేమైనా ఇప్పుడు ఆ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

ప్రస్తుతం అన్ని రంగాలను ఏలుతున్న ఏఐ టెక్నాలజీ అభివృద్ధి ఎంత ఉపయోగకరమో.. దాని దుర్వినియోగం అంత డేంజర్ అని ఇప్పటికే పలు ఘటనలు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు పర్సనల్ రెస్పెక్ట్ ను కాపాడుకునేందుకు పలువురు హీరోయిన్లు తీసుకునే చర్యలపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఆ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News