శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ భారీ ప్లానింగ్
ఏ సినిమాకైనా ప్రమోషన్స్ అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమోషన్స్ ఎంత భారీగా చేస్తే సినిమాకు అంత మంచి ఓపెనింగ్స్ వస్తాయి.;
ఏ సినిమాకైనా ప్రమోషన్స్ అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమోషన్స్ ఎంత భారీగా చేస్తే సినిమాకు అంత మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే మేకర్స్ తమ సినిమా ప్రమోషన్ల కోసం ఎక్కడా వెనుకాడకుండా ఖర్చు చేస్తూ ఉంటారు. సినిమాను కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లడం మరో ఎత్తు.
ప్రమోషన్స్ కోసం డైరెక్టర్ల స్పెషల్ ప్లాన్లు
అందుకే సినిమా షూటింగ్, మేకింగ్ విషయంలో మేకర్స్ ఎంత జాగ్రత్తగా ఉంటారో మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ ప్రమోషన్స్ కోసం స్పెషల్ గా పబ్లిసిటీ డిజైనర్లు ఉండేవారు కానీ ఇప్పుడా బరువు బాధ్యతల్ని పూర్తిగా డైరెక్టర్లే తీసుకుని తాము తీసిన సినిమాను వాళ్లే ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు.
పబ్లిసిటీ విషయంలో రాజమౌళి తర్వాత అనిల్..
మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే వారి వారి స్టైల్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ లిస్ట్ లో టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్, ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి తర్వాత ఎవరు టాప్ లో ఉంటారంటే అందరూ అనిల్ పేరే చెప్తారు.
సంక్రాంతికి వస్తున్నాంకు డిఫరెంట్ స్ట్రాటజీ
సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అనిల్ చేసిన ప్రమోషన్స్ అంతా ఇంతా కాదు. ఆ మూవీతో తనదైన ప్రమోషనల్ స్ట్రాటజీని మొదలుపెట్టిన అనిల్, ఇప్పుడదే ఫార్ములాని చిరూ సినిమా కోసం కూడా రిపీట్ చేయనున్నారు. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తుండగా, సంక్రాంతి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం కంటే కాస్త అడ్వాన్సుగానే అనిల్ ఈ మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశాడు. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో నుంచే ప్రతీ అప్డేట్ ను ప్రమోషన్ గానే చేసుకుంటూ వచ్చిన అనిల్ ఇప్పుడు ఈ మూవీకి నెక్ట్స్ లెవెల్ ప్రమోషన్స్ చేసి మూవీపై హైప్ ను పెంచాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు రెండు మేజర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ను చేయాలని డిసైడ్ అయ్యారట. అందులో ఒకటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాగా, మరొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానుందని, ఈ రెండింటిలో ఒక ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో, మరో ఈవెంట్ ను తెలంగాణలో చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై హైప్ ను పెంచాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.