చంపేస్తామని హీరోకి బెదిరింపులు...!

బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి వచ్చిన బెదిరింపులను అభినవ్‌ శుక్లా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు.;

Update: 2025-04-21 07:44 GMT

బాలీవుడ్‌ సెలబ్రిటీలను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ భయపెడుతోంది. స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్‌ను పలు సార్లు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు చంపేస్తామంటూ హెచ్చరించిన విషయం తెల్సిందే. ఒకసారి ఏకంగా సల్మాన్‌ ఖాన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దాంతో ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌కి ప్రభుత్వం హై సెక్యూరిటీని కల్పించింది. అంతే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సైతం బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ యంగ్‌ హీరో అభినవ్ శుక్లా సైతం బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియా ద్వారా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడు అభినవ్ శుక్లాను హెచ్చరిస్తూ పోస్ట్‌ చేశాడు.

బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి వచ్చిన బెదిరింపులను అభినవ్‌ శుక్లా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. సదరు వ్యక్తి తనను తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడిగా చెప్పుకున్నాడు. అంతే కాకుండా అసిమ్‌ను గౌరవించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించాడు. సదరు వ్యక్తి బెదిరింపులను సోషల్‌ మీడియా ద్వారా పోలీసు శాఖకు అభినవ్ తెలియజేశాడు. తన కుటుంబ సభ్యులకు సైతం ప్రమాదం పొంచి ఉందని అభినవ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన బెదిరింపులను ఆయన లైట్‌ తీసుకోకుండా పోలీసులకు సమాచారం అందించడం మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో అభినవ్‌ శుక్లాకు.. నేను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కి చెందిన వాడిని. మీరు ఉండే అడ్రస్‌తో పాటు, మీకు సంబంధించిన అన్ని విషయాలు మాకు తెలుసు. సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిపినట్లుగానే మీ మీద కూడా కాల్పులు జరిపేందుకు వెనకాడబోం. ఇదే మా నుంచి మీకు చివరి హెచ్చరిక. ఆసిమ్‌(బిగ్‌బాస్ కంటెస్టెంట్‌) గురించి అగౌరవంగా మాట్లాడితే బిష్ణోయ్ గ్యాంగ్‌ హిట్ లిస్ట్‌లో మీరు చేరుతారు అంటూ ఒక వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. కేవలం అభినవ్ శుక్లాకు మాత్రమే కాకుండా అతడి కుటుంబ సభ్యులకు కూడా కాస్త అటు ఇటుగా ఇలాంటి బెదిరింపు మెసేజ్‌లు సోషల్ మీడియా ద్వారా వచ్చాయట. దాంతో పోలీసులు వెంటనే ఈ విషయమై స్పందించారు.

అభినవ్‌ శుక్లాను బెదిరించిన వారు ఎవరు అనే విషయమై విచారణ మొదలు పెట్టారు. గత కొన్ని రోజులుగా అభినవ్‌ శుక్లా భార్య రుబీనా, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అసిమ్ రియాజ్ మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఆ వివాదం ముదరడంతో అభినవ్ శుక్లా కూడా ఇటీవల అసిమ్‌ పై విమర్శలు గుప్పించాడు. కాస్త ఘాటుగానే ఆ వ్యాఖ్యలు ఉండటంతో అసిమ్‌ రియాజ్ అభిమానులు పలువురు అభినవ్‌ శుక్లా, అతడి భార్య రుబీనాను సోషల్‌ మీడియా ద్వారా బెదిరిస్తూ వస్తున్నారు. అందులో ఒక అసిమ్ అభిమాని అడుగు ముందుకు వేసి తాను బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడిని అంటూ చెప్పుకుని అభినవ్‌ శుక్లాను బెదిరించి ఉంటాడేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ విషయమై విచారణ జరుపుతున్నారు. కనుక ఏం జరగబోతుంది అనేది చూడాలి.

Tags:    

Similar News