బుద్దిలేని మాటలు కట్టిపెట్టు..!
సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ వస్తున్నప్పటికీ అభినవ్ కి దర్శకత్వం చేసే అవకాశాలు రావడం లేదు.;
సల్మాన్ ఖాన్‌కి నటనపై ఆసక్తి ఉండదు, ఆయన గత పాతిక సంవత్సరాలుగా నటనపై ఆసక్తి లేకుండానే సినిమాలు చేస్తూ, కేవలం తన స్టార్‌డం కారణంగా సక్సెస్‌లు దక్కించుకుంటున్నాడు అంటూ దర్శకుడు అభినవ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. సల్మాన్ ఖాన్ గూండా మాదిరిగా ప్రవర్తిస్తాడు, తోటి నటీనటులను గౌరవించడు, సాంకేతిక నిపుణుల విషయంలో ఆయనకు మినిమం గౌరవం ఉండదు అని అభినవ్ కశ్యప్ ఆరోపించాడు. 2010లో సల్మాన్ ఖాన్‌తో ఈ దర్శకుడు దబాంగ్ సినిమాను తీశాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్‌తో పాటు దర్శకుడు అభినవ్ కశ్యప్‌కి కూడా ఆ సినిమా చాలా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అభినవ్ కశ్యప్ ఎక్కువ సినిమాలు చేయలేదు. అందుకు కారణం ఏంటి అనేది తెలియదు.
దర్శకుడు అభినవ్ తీవ్ర వ్యాఖ్యలు..
సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ వస్తున్నప్పటికీ అభినవ్ కి దర్శకత్వం చేసే అవకాశాలు రావడం లేదు. ఏదో ఒక సినిమాకు టెక్నికల్ సపోర్ట్ లేదా, ఇతర సహాయ సహకారాలు అందించే పనిలో ఉంటున్నాడు. కానీ దబాంగ్ రేంజ్ సినిమాను మాత్రం చేయలేక పోయాడు, చేయాలి అనుకున్న ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ముందుకు రాలేదు అని తెలుస్తోంది. దబాంగ్ సినిమా కేవలం సల్మాన్ స్టార్‌డం, ఇతర సాంకేతిక పరిజ్ఞానం వల్ల హిట్ అయిందే తప్ప అభినవ్ వల్ల కాదు అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ పై దర్శకుడు అభినవ్ మనసులో ద్వేషం పెంచుకుంటూ వచ్చాడు అంటూ చాలా మంది సల్మాన్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా స్పందిస్తూ దర్శకుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ పెద్ద గూండా..
దర్శకుడు అభినవ్ వ్యాఖ్యలను సల్మాన్ ఖాన్ అభిమానులు గట్టిగా ఎదుర్కొంటున్నారు. వేలాది మంది సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అభినవ్ తీరును తప్పుబడుతూ ఉన్నారు. బుద్దిలేని మాటలు మాట్లాడుతున్నాడు అంటూ అభినవ్‌ను ట్రోల్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ ను అవమానించే విధంగా మాట్లాడటం చూస్తూ ఉంటే ఆయన పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడి ఉంటాడు అంటున్నారు. సల్మాన్ ఆయనకు గొప్ప సినిమాను ఇచ్చాడు, అయినా దాన్ని వినియోగించుకోవడంలో విఫలం అయ్యాడు. ఇప్పుడు సల్మాన్‌ను అనే స్థాయి ఆయనకు లేదు, ఆయన కనీసం సల్మాన్ ఖాన్ పేరు ఎత్తేందుకు కూడా ఇప్పుడు అర్హుడు కాదు అంటూ సోషల్ మీడియాలో భాయ్ ఫ్యాన్స్ తెగ కామెంట్ చేస్తూ అభినవ్ కశ్యప్ పై తీవ్రంగా మండి పడుతున్నారు.
సల్మాన్ పై అభినవ్ వ్యాఖ్యలకు ఫ్యాన్స్ రియాక్షన్
అభినవ్ కేవలం సల్మాన్ ఖాన్ విషయంలోనే కాకుండా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తోనూ గొడవలు పెట్టుకున్నాడు. స్వయంగా తన సోదరుడు అనురాగ్ కశ్యప్ తోనూ అభినవ్ కి సన్నిహిత సంబంధాలు లేవు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అభినవ్ ను సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ట్రోల్ చేస్తున్నారు. సల్మాన్ వంటి స్టార్ హీరోను నటనపై ఆసక్తి లేదు అంటూ కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది అంటూ చాలా మంది అంటున్నారు. పాతిక ఏళ్లుగా సల్మాన్ నటనపై ఆసక్తి లేకుండా నటించాడు అంటే ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదు. ఆయన సినిమా కోసం ఎంత చేస్తాడో.. ఏం చేస్తాడో అన్నీ మేము చూస్తూనే ఉన్నాం అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి సల్మాన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.