'రాజా శివాజీ' మరాఠా సినిమాకు 'బాహుబలి' లాంటిది! తెలుగు వెర్షన్‌పై ఆస‌క్తి!

మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం `రాజా శివాజీ` సినిమా ఒక ప్రభంజనంలా దూసుకుపోతోంది.;

Update: 2026-05-04 03:59 GMT

మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం `రాజా శివాజీ` సినిమా ఒక ప్రభంజనంలా దూసుకుపోతోంది. రితేష్ దేశ్‌ముఖ్ టైటిల్ రోల్ పోషించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక వసూళ్లతో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 23.9 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా 2026 సంవత్సరంలో 30 కోట్ల క్లబ్‌లోకి చేరబోతున్న మొట్టమొదటి మరాఠీ చిత్రంగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. మొద‌టి వారంలో ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్ ను అధిగ‌మిస్తుంద‌నేది అంచ‌నా. ఈ వసూళ్ల జోరు చూస్తుంటే.. మరాఠీ పరిశ్రమకు ఇది ఒక `బాహుబలి` లాంటి సినిమా అని ట్రేడ్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఈ భారీ విజయం నేపథ్యంలో తెలుగు వెర్షన్ విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రకు తెలుగు రాష్ట్రాల్లో కూడా విశేషమైన ఆదరణ ఉంది. తెలుగు ప్రజలకు శివాజీ వీరత్వంపై ఉన్న గాఢమైన గౌరవం.. గతంలో `తానాజీ` వంటి హిందీ డబ్బింగ్ చిత్రాలకు ఇక్కడ లభించిన ఆదరణే అందుకు నిదర్శనం. చారిత్రాత్మక యోధుల కథలకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే `రాజా శివాజీ` తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయమేన‌నే విశ్లేష‌ణ సాగుతోంది.

`రాజా శివాజీ` కేవలం ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా కాకుండా పాన్-ఇండియా అప్పీల్‌తో రూపొందింది. బాహుబలి, RRR తర్వాత ప్రేక్షకులు గ్రాండియర్ (భారీతనం) .. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలను భాషా భేదం లేకుండా ఆదరిస్తున్నారు. రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన విజువల్స్ .. భావోద్వేగాలతో తీర్చిదిద్దారు. మేకింగ్ పరంగా ఉన్న ఈ భారీతనం దక్షిణాది ప్రేక్షకులను... ముఖ్యంగా యాక్షన్ డ్రామాలను ఇష్టపడే తెలుగు సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

మరోవైపు నిర్మాతగా జెనీలియా దేశ్‌ముఖ్ వేస్తున్న అడుగులు ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. జెనీలియాకు తెలుగులో ఉన్న స్టార్ ఇమేజ్ .. రితేష్ దేశ్‌ముఖ్ గత చిత్రాలైన `వేద్` వంటి వాటికి ఇక్కడ లభించిన గుర్తింపు ఈ సినిమాకు `లోకల్ కనెక్టివిటీ`ని కలిగిస్తున్నాయి. జ్యోతి దేశ్‌పాండే - జెనీలియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం చారిత్రాత్మక యోధుడి పోరాట పటిమను ఎంతటి ఎమోషనల్ డెప్త్‌తో ఆవిష్కరించిందంటే.. అది ప్రతి భారతీయుడి గుండెను హత్తుకునేలా ఉంది.

ప్రస్తుతం 50 కోట్ల మార్కు దిశగా సాగుతున్న ఈ సినిమా.. మరాఠీ పరిశ్రమలో మొట్టమొదటి 100 కోట్ల నెట్ గ్రాస్ చిత్రంగా నిలుస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ సంచలన విజయం కేవలం మహారాష్ట్రకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా సరైన ప్రమోషన్లతో విడుదలవ్వాల్సిన అవసరం ఉంది. చారిత్రాత్మక కథాంశం కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఉన్న పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే `రాజా శివాజీ` తెలుగు వెర్షన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.

Tags:    

Similar News