ట్రెండ్ మారుస్తున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ లో కొంత కాలంగా పాన్-ఇండియా సినిమాల జోరు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో కొంత కాలంగా పాన్-ఇండియా సినిమాల జోరు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రేజ్ కారణంగా తెలుగు హీరోలంతా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటూ.. ఒక్కో సినిమా పూర్తి కావడానికి సంవత్సరాల తరబడి సమయం తీసుకుంటున్నారు. సినిమా క్వాలిటీ తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ కూడా సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తుండటంతో అభిమానులు తమ హీరోల సినిమాల కోసం సుదీర్ఘకాలం పాటు వేచి చూడాల్సి వస్తోంది. అయితే ఈ ట్రెండ్‌కు భిన్నంగా కొందరు ప్రముఖ హీరోలు సరికొత్త వ్యూహంతో ముందు కొస్తున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా టాలీవుడ్ స్టార్స్ పణాళికలు రచిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద తమ హవాన్ని తగ్గకుండా చూసుకోవడంతో పాటు, ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని పంచాలనే లక్ష్యంతో స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ రాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి హీరోలు షార్ట్ గ్యాప్ ట్రెండ్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోరును మరింత పెంచేశారు. ఒకవైపు `విశ్వంభర` వంటి భారీ ఫాంటసీ ప్రాజెక్ట్‌తో పాటు, మరోవైపు బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తూ ఏడాది తిరిగేలోపే బ్యాక్-టూ-బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే బాటలో సీనియర్ హీరో వెంకటేష్ కూడా తనదైన శైలిలో వేగంగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ సీజన్‌లను టార్గెట్ చేస్తూ వీరు చేస్తున్న ప్లానింగ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సినిమాల మధ్య గ్యాప్‌ను గణనీయంగా తగ్గించే పనిలో పడ్డారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న డార్లింగ్ షెడ్యూల్స్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటూ తక్కువ వ్యవధిలోనే తదుపరి సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. `ఫౌజీ`, `స్పిరిట్` పెద్ద గ్యాప్ లేకుండానే రిలీజ్ అవుతాయి.
అలాగే విజయ్ దేవరకొండ, రవితేజ , నాని వంటి మాస్ హీరోలు కూడా ఏడాదికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
హీరోలు ఇలా స్పీడ్ పెంచడం వల్ల నిర్మాతలకు పెట్టుబడుల రొటేషన్ సులభం కావడంతో పాటు ఇండస్ట్రీలో నిరంతరం సందడి వాతావరణం నెలకొంటుంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తర్వాతి సినిమాతో వెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటం వలన హీరోల మార్కెట్ స్థిరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులకు కూడా తమ హీరోల నుంచి పండగ ప్రతిసారీ కొత్త సినిమా రూపంలో అందు తుండటంతో సరికొత్త ట్రెండ్‌ను ఎంతో ఆనందంగా స్వాగతిస్తారు.