2,750 కోట్ల వసూళ్లతో ఐమాక్స్ చరిత్రలోనే ఆల్-టైమ్ నంబర్-1 చిత్రం
హాలీవుడ్ ప్రముఖ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా దృశ్యకావ్యం 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
హాలీవుడ్ ప్రముఖ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా దృశ్యకావ్యం 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ వీకెండ్‌లో ఈ చిత్రం ఏకంగా రెండు భారీ మైలురాళ్లను అధిగమించి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ డాలర్ల (రూ. 9,000 కోట్లకు పైగా) గ్రాస్ వసూళ్లను సాధించి.. నోలన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'ది డార్క్ నైట్ రైజెస్' రికార్డును ఇది అధిగమించింది. చైనా, జపాన్ వంటి కీలక మార్కెట్లలో ఇంకా విడుదల కాకుండానే ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం.
వసూళ్లలోనే కాకుండా ఒక ప్రత్యేక విభాగంలో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆల్-టైమ్ రికార్డును నోలన్ అధిగమించారు. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన జేమ్స్ కేమరూన్ 'అవతార్' రికార్డును 'ది ఒడిస్సీ' తిరగరాసింది. 'అవతార్' చిత్రం తన లైఫ్‌టైమ్‌లో ఐమాక్స్ వెర్షన్ ద్వారా 271 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 'ది ఒడిస్సీ' చిత్రం ఏకంగా 289 మిలియన్ డాలర్ల (2,749 కోట్లు) వసూళ్లతో ఐమాక్స్ చరిత్రలోనే ఆల్-టైమ్ నంబర్ 1 చిత్రంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ చారిత్రాత్మక విజయం వెనుక దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ హార్డ్ వర్క్- టెక్నికల్ ప్రయోగాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతోనే రూపుదిద్దుకున్న తొలి చిత్రంగా `ది ఒడిస్సీ` రికార్డు సృష్టించింది. విజువల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ప్రేక్షకులకు అందించిన ఈ సరికొత్త అనుభూతికి ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. నోలన్ పడ్డ కష్టానికి ఐమాక్స్ బాక్సాఫీస్ వద్ద లభించిన ఈ అపూర్వ ఆదరణే నిదర్శనంగా నిలిచింది.
ఐమాక్స్ మార్కెట్ వసూళ్లను పరిశీలిస్తే... కేవలం అమెరికా (డొమెస్టిక్) మార్కెట్ నుంచే ఈ చిత్రం ఐమాక్స్ వెర్షన్ ద్వారా 147.3 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మరొక 141.8 మిలియన్ డాలర్లను ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ 70ఎంఎం స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శనలు ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులతో నడుస్తున్నాయి. వచ్చే సెప్టెంబర్ నెల వరకు ఈ స్క్రీన్ల టిక్కెట్లు అన్నీ ముందస్తుగానే అమ్ముడైపోవడం ఈ చిత్రంపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తెలియజేస్తోంది.
బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రికార్డుల వర్షం కురిపిస్తున్న 'ది ఒడిస్సీ' మునుముందు రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. చైనా దేశ వ్యాప్తంగా వచ్చే శుక్రవారం రోజున ఏకంగా 800 ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అతిపెద్ద మార్కెట్లయిన చైనా- జపాన్ దేశాలలో కూడా విడుదలైతే.. ఈ సినిమా వసూళ్లు మరిన్ని వందల మిలియన్ డాలర్లను దాటి హాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.