తెలుగు మార్కెట్ ను లైట్ తీసుకుంటే ఇక అంతే!

ఒకప్పుడు తమిళ సినిమాలకు తెలుగు మార్కెట్ ఎక్స్‌ట్రా బోనస్‌గా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.

Update: 2026-08-08 18:03 GMT

ఒకప్పుడు తమిళ సినిమాలకు తెలుగు మార్కెట్ ఎక్స్‌ట్రా బోనస్‌గా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారత సినిమాల రెవెన్యూ మ్యాప్‌లో కీలకమైన మార్కెట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లైన వెంకీ అట్లూరి, నాగ‌వంశీ ఇద్ద‌రూ తెలుగు వారే అయినా, వారు రూపొందించిన విశ్వ‌నాథ్& స‌న్స్‌ను మెయిన్ స్ట్రెయిట్ తమిళ్ మూవీగా పొజిషన్ చేసి, తెలుగు వెర్షన్‌ను కేవలం డబ్బింగ్ రిలీజ్ గా చూడటం బిజినెస్ పరంగా సరైన వ్యూహమా అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ప్రస్తుతం బాక్సాఫీస్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ట్రెండ్ ఏమిటంటే, సినిమా కేవలం కంటెంట్‌పై ఆధార‌ప‌డితే స‌రిపోదు. ప్రేక్షకుల దృష్టిలో సినిమా కనిపించాలి కూడా. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా సరైన ప్ర‌మోష‌న్స్ లేకపోతే ఓపెనింగ్ క‌లెక్ష‌న్ల‌ను కోల్పోతున్నాయి. మరోవైపు, భారీ విజిబిలిటీ సాధించిన సినిమాలు మొదటి వీకెండ్‌లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటున్నాయి.

తెలుగు మార్కెట్‌ను ఇప్పటికీ చాలా మంది నిర్మాతలు డబ్బింగ్ మార్కెట్‌గా చూస్తున్నారు. కానీ వాస్తవానికి ఇది స్టార్ ఓరియెంటెడ్ మార్కెట్ మాత్రమే కాదు.. ఎమోష‌న్, ఫ్యామిలీ స్టోరీస్, కామెడీ, మ్యూజిక్, డైరెక్ట‌ర్ బ్రాండ్ వంటి అంశాలకు రెస్పాండ్ అయ్యే మార్కెట్. ముఖ్యంగా డైరెక్ట‌ర్, నిర్మాతకు తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఉన్నప్పుడు, ఆ అనుబంధాన్ని మార్కెటింగ్‌లో ఉపయోగించకపోవడం ఒక మిస్ యూజ్ అనే చెప్పాలి.

డిస్ట్రిబ్యూటర్ల ప‌రంగా చూస్తే మరో సమస్య ఉంది. ప్రమోషన్స్ లేకుండా రిలీజ‌య్యే డబ్బింగ్ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ స‌హ‌జంగానే మందగిస్తాయి. ఓపెనింగ్స్ క‌లెక్ష‌న్లు వీక్ గా ఉంటే థియేటర్లలో షోలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో కంటెంట్ బాగున్నా, సినిమా ఆడియ‌న్స్ వరకు చేరుకునే లోపే రన్ దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. ఈ కారణంగానే ఇప్పుడు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్‌కు ముందు ప్రమోషన్ కమిట్‌మెంట్‌ను కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

పాన్ ఇండియా యుగంలో ప్రాంతీయ గుర్తింపులు మార్కెటింగ్ సాధనాలుగా మారాయి. తెలుగు మూలాలున్న డైరెక్ట‌ర్, నిర్మాత, టెక్నీషియన్లు, నటీనటులు ఉంటే, ఆ అంశాన్ని స్థానిక మార్కెట్‌లో బలంగా కమ్యూనికేట్ చేయడం సినిమాకు అద‌న‌పు ప్రయోజనం తీసుకురావచ్చు. అయితే అంద‌రినీ వెంటాడుతున్న ప్ర‌శ్న మాత్రం ఒక‌టే. తెలుగు ప్రేక్షకులతో సహజమైన అనుబంధం ఉన్న ప్రాజెక్ట్‌ను స్ట్రెయిట్ తమిళ్ సినిమాగా మాత్రమే చూపించడం బ్రాండింగ్ పరంగా సరైన నిర్ణయమా? లేక రెండు మార్కెట్లను సమానంగా టార్గెట్ చేసే ద్విభాషా వ్యూహమే ఈరోజు బాక్సాఫీస్ వాస్తవాలకు దగ్గరగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రిలీజుల రిజ‌ల్ట్స్‌లో కనిపించే అవకాశం ఉంది.

Tags:    

Similar News