విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్
| నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సదస్సును ప్రారంభించనుండగా, సీఎం చంద్రబాబు వివిధ దేశాల మంత్రులు, రాయబారులు, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
విశాఖ ఈ రోజున ఏపీలో అతి పెద్ద నగరం. కాస్మోపాలిటన్ సిటీ. విశాఖ ఏపీకి జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించేందుకు కలసి వచ్చిన అసలైన వేదిక. అందుకే ఏపీలో అతి పెద్ద పెట్టుబడుల పండుగకు విశాఖ ముస్తాబు అయింది. ఈ నెల 12, 13వ తేదీలలో విశాఖ సాగర తీరాన 31వ సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్-2026 ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరగనుంది. దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
ప్రపంచ దిగ్గజాల రాక :
విశాఖలో నిర్వహించే సీఐఐ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు తరలి వస్తున్నారు. సింగపూర్, యూఏఈ, జపాన్, రష్యా, స్లోవేకియా, గ్వాటెమాల ప్రతినిధులతో విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రతిష్టాత్మకం కానుంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ సదస్సుని గట్టి సంకల్పంతో నిర్వహిస్తోంది. గత ఏడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు భిన్నంగా 2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహణతో 86 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వచ్చాయి. అలాగే వివిధ రంగాలపై ప్రాంతీయ సదస్సుల్లో చర్చలు జరిగాయి. దీంతో ఈ భారీ పెట్టుబడుల సదస్సు మీద అందరిలో ఆశలు ఆసక్తి వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి చర్చలు జరుగుతాయన్న దాని మీద నిశిత పరిశీలన చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, బహుళజాతి సంస్థల అధినేతలు హాజరుకానున్నారు.
వీవీఐపీలతో :
ఇక విశాఖలో జరగనున్న రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామిక సంస్థల అధినేతలతో వరుస భేటీలు వేయనున్నారు. నవంబర్ 12వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సు ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సదస్సు ప్రారంభం కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఆ తర్వాత జరగనున్న వివిధ సెషన్లలతో పాటు కీలక చర్చలు సమావేశాలలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు భాగస్వాములు పాల్తొంటారు. అలాగే పలు కీలక సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనడమే కాకుండా ఆయా అంశాలపై చర్చించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాలు, తయారీ, సాంకేతిక రంగాల్లోని అవకాశాలను పారిశ్రామిక వర్గాలకు సీఎం వివరిస్తారు.
అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీలు :
ఇదిలా ఉంటే 31వ సీఐఐ సమ్మిట్‌లో భాగంగా చంద్రబాబు పలు దేశాల మంత్రులు, రాయబారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్వాటెమాలా, స్లోవేకియా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయి చర్చిస్తారు. జపాన్, రష్యా రాయబారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డారెన్ టాంగ్‌తో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, తయారీ రంగాలలో రాష్ట్రంలో పెట్టుబడులు అవకాశాలను విస్తరించే లక్ష్యంతో ప్రముఖ భారతీయ ప్రైవేటు అంతరిక్ష సంస్థల ప్రతినిధులతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో హాథోర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, స్కైరూట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారు. జపాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ చైర్మన్‌తో చంద్రబాబు భేటీ అవుతారు. ఈదే విధంగా వివిధ శాఖలకు చెందిన కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ప్రహ్లాద్ జోషి, సర్బానంద సోనోవాల్ తదితరులు సీఐఐ సదస్సుకు విశాఖ రానున్నారు.