మీకు 'రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్' ఉందా?.. ఎందుకు ఉందంటే..?

ఎప్పుడైనా దూరం ప్రయాణాలు చేసిన సమయంలో వెళ్లినప్పుడు స్లోగా.. వచ్చేటప్పుడు ఫాస్ట్ గా ప్రయాణం జరిగిందనే భావననే రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ అంటారు.;

Update: 2025-07-17 11:30 GMT

ఎక్కడికైనా ప్రయాణించిన సమయాల్లో.. వెళ్లినప్పుడు మాత్రం చాలా దూరం ప్రయాణించినట్లు అనిపిస్తూ, వచ్చేటప్పుడు మాత్రం 'త్వరగా వచ్చేశామూ అనే అనుభూతి చాలా మందికి చాలా సందర్భాల్లో కలిగి ఉంటుంది. దీనినే 'రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్' అంటారు. అయితే, ఈ భావన కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్పష్టంగా అనిపిస్తుందని అంటున్నారు.

ఆవును... రోజూ ప్రయాణాలు చేసే ఆఫీసు వంటి తెలిసిన చోట్లకు చేసే ప్రయాణాల సంగతి అలా ఉంచితే... ఎప్పుడైనా దూరం ప్రయాణాలు చేసిన సమయంలో వెళ్లినప్పుడు స్లోగా.. వచ్చేటప్పుడు ఫాస్ట్ గా ప్రయాణం జరిగిందనే భావననే రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ అంటారు. ఈ భావన ఏర్పడటానికి గల కారణాలను వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఇందులో భాగంగా... ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం కొత్తది అయితే ప్రతీ విషయాన్ని చూసుకుంటూ, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ వెళ్తుంటామని.. అందుకే సమయం ఎక్కువ పట్టినట్లు అనిపిస్తుందని.. అయితే, తిరిగి వస్తున్నప్పుడు ఆ మార్గం తెలిసిందే కాబట్టి అంతగా పట్టించుకోమని.. అందుకే మెదడుకు కాస్త రిలాక్స్ ఇవ్వడంతో త్వరగా వచ్చేసినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు.

ఒక చోటుకి వెళ్లేటప్పుడు ఆ ప్రదేశంపై ఆసక్తి, అంచనాలు ఎక్కువగా ఉంటాయని.. దీంతో మెదడుపై పని పెరుగుతుందని.. అదే, తిరుగు ప్రయాణంలో ఇవేవీ ఉండవని.. దీంతో ఆ సమయంలో సంతోషానికి కారణమయ్యే డోపమైన్ లెవెల్స్ మెదడులో పెరుగుతాయని.. అందుకే ఆ తిరుగు ప్రయాణం చిన్నదిగా, షార్ట్ కట్‌ లో వచ్చేసినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు.

ఈ క్రమంలో... 2011లో 'రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్'కు సంబంధించి నెదర్లాండ్స్‌ కు చెందిన శాస్త్రవేత్తలు వాన్ డీ వెన్, రిజ్స్విక్, రాయ్‌ ఒక కాగ్నిటివ్ స్టడీ చేశారు. ఈ పరిశోధన కోసం కొంతమందితో.. బస్సు, సైకిల్, నడక ద్వారా ప్రయాణాలు చేయించారు. వీరికి అన్ని సందర్భాల్లోనూ తిరుగు ప్రయాణానికి తక్కువ సమయం పట్టిన అనుభూతి పొందినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే... వెళ్తున్నప్పుడు కొత్త రహదారులు, ట్రాఫిక్, పరిసరాలను మెదడు గ్రహిస్తూ కాగ్నిటివ్ లోడ్‌ ను ఎక్కువగా అనుభవిస్తుందని తెలిపారు. అయితే... తిరుగు ప్రయాణంలో అప్పటికే ఆ పరిసరాలతో ఏర్పడిన పరిచయం వల్ల కాగ్నిటివ్ లోడ్‌ తగ్గుతుందని తేలిందని వెల్లడించారు.

అయితే... ఇది అప్పుడప్పుడూ వెళ్లే దూర ప్రాంతాల విషయంలోనే కాదు.. రెగ్యులర్ గా వెళ్లే ప్రదేశాల విషయంలోనూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు... రోజూ ఆఫీస్‌ కు వెళ్లేటప్పుడు.. సమయానికి చేరుకుంటానా? ట్రాఫిక్ అవాంతరం ఏర్పడుతుందా? వంటి అనేక ఆలోచనలు ఉంటాయని అంటున్నారు.

అయితే... తిరిగి వచ్చేటప్పుడు ఆ టెన్షన్ ఉండకపోవడం వల్ల.. తిరుగు ప్రయాణాల్లో ఆందోళనలు, ఆలోచనలు తక్కువగా ఉండటంవల్ల.. సమయం తక్కువ పట్టినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News