విదేశీ పర్యటనకు వెళ్లేవారంతా జాగ్రత్త..!

ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక దేశాలు తమ నిబంధనలను కఠినతరం చేశాయి.;

Update: 2025-08-25 20:30 GMT

ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక దేశాలు తమ నిబంధనలను కఠినతరం చేశాయి. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పర్యాటకుల వల్ల స్థానికుల జీవనశైలి, సంస్కృతి దెబ్బతింటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దేశాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించాయి.

- ఇటలీ - వెనీస్‌లో కొత్త నిబంధనలు

ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన వెనీస్‌లో పర్యాటకుల ప్రవర్తనపై ఆంక్షలు విధించారు. నగర పరిశుభ్రత, స్థానికుల మనోభావాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు.

జరిమానాల వివరాలు

బహిరంగ ప్రదేశాల్లో నేలపై కూర్చొని తినడం లేదా తాగడం చేస్తే 100-200 యూరోలు (సుమారు రూ.10,000-రూ.20,000) జరిమానా విధిస్తారు. నగరంలోని కాలువల్లో ఈత కొట్టడం, స్విమ్మింగ్‌ లేదా డైవింగ్‌ చేస్తే 350 యూరోలు (సుమారు రూ.35,000)... బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం లేదా ఉమ్మివేయడం లాంటి చర్యలకు 350 యూరోలు (సుమారు రూ.35,000)... షర్ట్‌/టాప్‌ లేకుండా తిరగడం లేదా స్విమ్‌సూట్‌లో బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే 250 యూరోలు (సుమారు రూ.25,000) జరిమానా విధిస్తారు.

-పోర్చుగల్‌ - అల్బుఫీరా బీచ్‌లో జరిమానాలు

పోర్చుగల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అల్బుఫీరాలో బీచ్‌కు బయట స్విమ్‌సూట్‌లో తిరిగితే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక్కడి స్థానిక సంస్కృతిని, నియమాలను గౌరవించని పర్యాటకులపై రూ.1.5 లక్షలకుపైగా జరిమానా విధించనున్నారు.

-స్పెయిన్‌ - బలియరిక్‌ ఐలాండ్స్‌లో ఆంక్షలు

స్పెయిన్‌లోని బలియరిక్‌ ఐలాండ్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. స్థానిక ప్రజల భద్రత, ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మద్యం సేవిస్తే రూ.3 లక్షలకుపైగా భారీ జరిమానా విధించనున్నారు.

-సందేశం స్పష్టం: విహార యాత్ర అంటే బాధ్యతతో కూడుకున్నది

పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, పర్యాటక దేశాలు తమ సంస్కృతి, పరిశుభ్రత, శాంతిభద్రతలను కాపాడటం కోసం కఠినమైన నియమాలను అమలు చేస్తున్నాయి. కాబట్టి పర్యటనకు వెళ్ళే పర్యాటకులు కేవలం ఆనందం మాత్రమే కాకుండా, తాము వెళ్ళే ప్రదేశంలోని సంస్కృతి, జీవన విధానాన్ని గౌరవించడం తమ బాధ్యతగా గుర్తుంచుకోవాలి

Tags:    

Similar News