మన డ్రైవింగ్ లైసెన్సును ఓకే దేశాలివే

రోటీన్ జీవితానికి కాస్త భిన్నంగా టూర్లకు వెళ్లటం ఒక చక్కటి అనుభూతిని ఇవ్వటంతో పాటు.. ఒత్తిడి జీవితం నుంచి రిలీఫ్ ను ఇస్తుంది.

Update: 2023-11-14 23:30 GMT

రోటీన్ జీవితానికి కాస్త భిన్నంగా టూర్లకు వెళ్లటం ఒక చక్కటి అనుభూతిని ఇవ్వటంతో పాటు.. ఒత్తిడి జీవితం నుంచి రిలీఫ్ ను ఇస్తుంది. అదే.. ఫారిన్ టూర్ కు వెళితే ఆ ఎక్సైట్ మెంట్ లెక్కనే వేరు ఉంటుంది. కొత్త ప్రపంచం కళ్ల ముందుకు వస్తుంది. కొత్త సంస్కృతి.. సంప్రదాయాలతో పాటు ఆచార వ్యవహారాలు.. ఆహార అలవాట్లు కొత్తగా ఉండటంతో పాటు..సరికొత్త అనుభూతిని కలిగించటం ఖాయం. విదేశాల్లో పర్యటించే వేళలో.. స్థానిక ప్రయాణ వసతుల్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి.

అలాంటి వేళలో.. అక్కడ అద్దెకు కార్లను తీసుకొని సొంతంగా డ్రైవ్ చేసుకుంటే కలిగే ఆనందం.. దాని ద్వారా వచ్చే ఆత్మవిశ్వాసం ఎన్ని మాటల్లో చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. విదేశాల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఆయా దేశాలు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సు ఉండాలని అనుకోవచ్చు. కానీ.. వాస్తవం కాస్త భిన్నంగా ఉంటుంది. మన దేశంలో మన రవాణా శాఖ అధికారులు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సుల్ని పలు దేశాలు తమ దేశాల్లో వాహనాల్ని నడిపేందుకు అనుమతులు ఇచ్చాయి. అంటే.. మన లైసెన్సులు అక్కడ కూడా చెల్లుబాటు అవుతాయన్న మాట.

తొలుత అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే.. ఆ దేశంలోని చాలా రాష్ట్రాల్లో భారత డ్రైవింగ్ లైసెన్సులు ఉన్న వారు కారును తీసుకొని నడిపే వీలుంది. అయితే.. లైసెన్సు మాత్రం ఇంగ్లిషులో ఉండటం తప్పనిసరి. మన దేశంలో జారీ చేసిన లైసెన్సుతో పాటు అమెరికాలోకి ఎప్పుడు ప్రవేశించామన్న వివరాలుండే ఐ94 ఫారంను వెంట ఉంచుకోవాల్సి ఉంది. మన దగ్గర లైసెన్సు ఉంటే అమెరికాలో ఏడాది పాటు డ్రైవింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది.

ఆస్ట్రేలియాలోనూ కొన్ని ప్రాంతాల్లో భారత డ్రైవింగ్ లైసెన్సు మీద వాహనాల్ని నడిపే సౌకర్యం ఉంది. న్యూ సౌత్ వేల్స్.. క్వీన్స్ లాండ్.. సౌత్ ఆస్ట్రేలియా.. ది క్యాపిటల్ రీజియన్.. నార్తర్న్ రీజియన్ లాంటి ప్రాంతాల్లో భారత లైసెన్సు మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఏడాది వరకు గడువు ఇస్తారు. అయితే.. మనతో పాటు ఉండే లైసెన్సు ఇంగ్లిషులోనే ఉండాలి. లేదంటే.. దాన్ని ట్రాన్స్ లేట్ చేసిన పత్రాన్ని తీసుకెళ్లొచ్చు.

జర్మనీలో భారత లైసెన్సును ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది. అయితే.. కార్డుపై ఉండే వివరాలు జర్మనీలో అనుమతించి ఉండాలి.. అయితే.. తప్పనిసరి అయితే కాదు. యూకేలో భారత లైసెన్సుకు ఏడాది పాటు డ్రైవింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది. కొన్ని రకాల కార్లు.. కేటగిరి వాహనాల్ని నడిపేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తుంది. న్యూజిలాండ్ లో ఏడాది పాటు భారత డ్రైవింగ్ లైసెన్సు తో వాహనాల్ని నడిపే వీలుంది. అయితే.. వాహనాలు నడిపే వారి వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలి. భూటాన్ లోనూ మన లైసెన్సుతో వాహనాలు నడపొచ్చు. కాకుంటే..పాస్ పోర్టు.. ఓటర్ ఐడీతో పాటు భూటాన్ లో వాహనాలు నడపటానికి చాలా అనుభవం అవసరం.

భారత డ్రైవింగ్ లైసెన్సుతో చిక్కుల్లేకుండా వాహనాల్ని నడిపే అవకాశం ప్రాన్స్.. మలేషియా.. సింగపూర్.. దక్షిణాఫ్రికా.. స్వీడన్.. స్విట్జర్లాండ్ లలో కూడా డ్రైవింగ్ చేసే వీలుంది. అయితే.. భారత డ్రైవింగ్ లైసెన్సుతో పాటు భారత ఆర్టీవో అధికారులు జారీ చేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నా సరిపోతుంది. అయితే.. వాహనం నడిపే సందర్భంలో మాత్రం తప్పనిసరిగా పాస్ పోర్టుతో సహా.. గుర్తింపు కార్డుల్ని వెంట ఉంచుకోవటం తప్పనిసరి అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News