రో.. కో.. వన్డేలకూ కష్టమే? టీమ్ ఇండియా జెర్సీలో మర్చిపోవాల్సిందే
అప్పటికికే రోహిత్ కు 40 ఏళ్లు వస్తాయి. కోహ్లి 39వ ఏటకు ప్రవేశిస్తాడు. మరి వీరిద్దరినీ ఎంపిక చేస్తారంటారా?;
సరిగ్గా గత ఏడాది జూన్ లో టి20 ప్రపంచ కప్ నెగ్గిన వెంటనే ఆ సీనియర్లు ఇద్దరూ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు.
సరిగ్గా ఇంగ్లండ్ టూర్ ముగింట ఆ ఇద్దరు సూపర్ స్టార్లు టెస్టు క్రికెట్ నుంచి వైదొలగారు.
..ఇక మిగిలింది వన్డే ఫార్మాట్ మాత్రమే. ఈ ఫార్మాట్ లో తిరుగులేని, చరిత్రలో నిలిచే ఆటగాళ్లయిన వారిద్దరినీ టీమ్ ఇండియాకు ఎంపిక చేస్తారా? అంటే, దీనికి సమాధానం చెప్పడం కష్టమే.
38 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన మొనగాడు. 36 ఏళ్లు దాటిన కోహ్లి వన్డేల్లో 50కి పైగా సెంచరీలు కొట్టినవాడు. మొన్నటికి మొన్న చాంపియన్స్ ట్రోఫీ కూడా అందించారు. అయితే, ఇక్కడ ప్రశ్న వీరిద్దరి స్టార్ డమ్, చరిత్ర గురించి కాదు.
అసలు వన్డేలు ఏవీ?
టి20లు వచ్చాక వన్డేలు ఆడడమే తక్కువైంది. 50+50 ఓవర్ల మ్యాచ్ ను చూసే ఓపిక ఈ తరం వారికి లేదు. ఇక టెస్టులు అంటే అవి ఎవర్ గ్రీనే. దీంతో వన్డేలు రానురాను తగ్గిపోతున్నాయి. ఈ ఫార్మాట్లో వరల్డ్ కప్ కూడా నాలుగేళ్లకు ఉంటోంది.
అసలే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు వన్డేలు చాలా తక్కువగా ఆడతాయి. టెస్టు క్రికెట్ కే వీరి ప్రాధాన్యం. వన్డేలు బాగా ఆడేది ఇండియానే. అయితే, అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాకముందు.
ఇక రో.. కో.. (రోహిత్-కోహ్లి) విషయానికి వస్తే వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అప్పటికికే రోహిత్ కు 40 ఏళ్లు వస్తాయి. కోహ్లి 39వ ఏటకు ప్రవేశిస్తాడు. మరి వీరిద్దరినీ ఎంపిక చేస్తారంటారా?
ఇక ఈ ఏడాది మాత్రమే వన్డేలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ తో మూడు, చాంపియన్స్ ట్రోఫీనే కాకుండా.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబరు మధ్యలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీమ్ ఇండియా మూడేసి వన్డేలు ఆడాల్సి ఉంది.
టెస్టుల నుంచి వైదొలగడంతోనే రోహిత్, కోహ్లిల ప్రాధాన్యం తగ్గిపోయింది. వచ్చే వన్డే ప్రపంచ కప్ ను ఆలోచనలో పెట్టుకుని కొత్త జట్టును నిర్మించాలనుకుంటే వీరికి వన్డేలలోనూ చోటు కష్టమే. లేదా ఈ ఏడాది ఆఖరుకు ఒకరి వెంట ఒకరు రిటైర్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.