గ్రీన్ కు 25.20 కోట్లు..ఐపీఎల్ లో విదేశీ ప్లేయ‌ర్ కు రికార్డు రేటు

చివ‌ర‌కు కోల్ క‌తా రూ.25.20కోట్లు పెట్టి ద‌క్కించుకుంది. నిరుడు ఆల్ రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ ను రూ.23.75 కోట్ల రికార్డు ధ‌ర‌కు తీసుకున్న కోల్ క‌తా అత‌డి వైఫ‌ల్యంతో భారీ మూల్య‌మే చెల్లించుకుంది.;

Update: 2025-12-16 09:46 GMT

రికార్డు బ‌ద్ద‌లైంది.. 26 ఏళ్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో భారీ ధ‌ర ద‌క్కింది. మంగ‌ళ‌వారం అబుధాబిలో మొద‌లైన ఈ వేలంలో గ్రీన్ రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌కు వ‌చ్చాడు. ఇత‌డి కోసం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్), చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) తీవ్రంగా పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు కోల్ క‌తా రూ.25.20 కోట్లు పెట్టి ద‌క్కించుకుంది. వేలంలో ఈ రెండు ఫ్రాంచైజీల వ‌ద్ద‌నే అత్య‌ధిక డ‌బ్బులు ఉన్నాయి. కేకేఆర్ ద‌గ్గ‌ర‌ రూ.64.30 కోట్లు, చెన్నై వ‌ద్ద‌ రూ.43.40 కోట్లు ఉండ‌గా ఈ రెండు యాజ‌మాన్యాలు గ‌ట్టిగా త‌ల‌ప‌డ్డాయి. అంత‌కంత‌కూ రేటు పెంచుకుంటూ పోయాయి.

 

చివ‌ర‌కు కోల్ క‌తా రూ.25.20కోట్లు పెట్టి ద‌క్కించుకుంది. నిరుడు ఆల్ రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ ను రూ.23.75 కోట్ల రికార్డు ధ‌ర‌కు తీసుకున్న కోల్ క‌తా అత‌డి వైఫ‌ల్యంతో భారీ మూల్య‌మే చెల్లించుకుంది. ఇప్పుడు అంత‌కుమించిన ధ‌ర‌ను గ్రీన్ పై పెట్టింది. అయితే, ఇందులో రూ.18 కోట్లు మాత్ర‌మే గ్రీన్ కు ద‌క్కుతాయి. మినీ వేలంలో విదేశీ ప్లేయ‌ర్ గ‌రిష్ఠ ఫీజు.. అత్య‌ధిక రిటెన్ష‌న్ స్లాబ్ రూ.18 కోట్లు, మెగా వేలం అత్య‌ధిక ధ‌ర రిష‌భ్ పంత్ రూ.27 కోట్లులో త‌క్కువగా ఉన్న మొత్తాన్ని మించ‌కూడదు. ఈ మేర‌కు రూ.18 కోట్లు ఫ్రాంచైజీ ప‌ర్స్ నుంచి క‌ట్ అయినా.. ఆట‌గాడికి మాత్రం చేర‌వు.

ఆస్ట్రేలియ‌న్ రికార్డు బ‌ద్ద‌లు

గ‌తంలో అత్య‌ధిక రేటు ప‌లికిన‌ విదేశీ ప్లేయ‌ర్ రికార్డు ఆస్ట్రేలియా మేటి పేస‌ర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. స్టార్క్ ను రూ.24.75 కోట్లు పెట్టి 2024లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇదే అత్య‌ధిక ధ‌ర కాగా.. తాజాగా దానిని స్టార్క్ అధిగ‌మించాడు. అయితే, రూ.64 కోట్ల‌కు పైగా ఉన్న కోల్ క‌తా ప‌ర్స్ ను త‌గ్గించే ఉద్దేశంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది అనే విశ్లేష‌ణ వ్య‌క్తం అవుతోంది. గ్రీన్ కు రూ.25 కోట్ల‌కు పైగా పెట్టాక కోల్ క‌తా వ‌ద్ద మిగిలింది ఇక 39 కోట్లు. అంటే.. చెన్నై కంటే తక్కువ మొత్త‌మే.

ఇండియ‌న్ కుర్రాళ్ల‌కు నిరాశే

రూ.75 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వ‌చ్చిన భార‌త బ్యాట‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ప్ర‌థ్వీ షాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయ‌లేదు. వీరే కాదు విధ్వంస‌క ప్లేయ‌ర్ ఇంగ్లండ్ కు చెందిన లివింగ్ స్టోన్ ను కూడా ఎవ‌రూ తీసుకోలేదు. ఆస్ట్రేలియా హిట్ట‌ర్ జాక్ ఫ్రేజ‌ర్ మెక్ గ‌ర్క్ (రూ.2కోట్లు)తో వేలం మొద‌లైనా అత‌డిని ఎవ‌రూ ఎంచుకోలేదు. భార‌త సంత‌తికి చెందిన న్యూజిలాండ్ బ్యాట‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌కూ ఇదే అనుభ‌వం ఎదురైంది.

Tags:    

Similar News