సంజూ చాన్సులు ముగిశాయి..? విధ్వంస‌క అభిషేక్ జోడీ ఇషాన్!

ల‌క్ష్యం స్వ‌ల్ప‌మే అయిన‌ప్ప‌టికీ టీమ్ఇండియా తొలి బంతికే సంజూ శాంస‌న్ (0) వికెట్ ను కోల్పోయింది.;

Update: 2026-01-26 03:15 GMT

న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో తేలిపోయి, వ‌న్డేల్లో ఓడిపోయిన టీమ్ఇండియా టి20 ఫార్మాట్లో మాత్రం దుమ్మురేపుతోంది. కుర్రాళ్ల‌కు తోడు అనుభ‌వం దండిగా ఉన్న కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. తాజాగా మ‌రో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండ‌గానే టి20 సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఇదే క్ర‌మంలో టి20 ప్ర‌పంచ‌క‌ప్ న‌కు ధీమాగా స‌న్న‌ద్ధం అయింది. ఆదివారం ఈశాన్య రాష్ట్రం అసోం రాజ‌ధాని గువాహ‌టిలో జ‌రిగిన మూడో మ్యాచ్ లోనూ జ‌య‌భేరి మోగించింది. ఈ మ్యాచ్ లో తొలుత మేటి పేస్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ధాటికి న్యూజిలాండ్ బ్యాట‌ర్లు తేలిపోయారు.

20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 153 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. ఒక మ్యాచ్ విరామం త‌ర్వాత వ‌చ్చిన బుమ్రా 4 ఓవ‌ర్ల కోటాలో 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 4 ఓవ‌ర్ల‌లో 35 ప‌రుగులు ఇచ్చినా.. యువ పేస్ బౌల‌ర్ హ‌ర్షిత్ రాణా.. మొద‌ట్లోనే కివీస్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వే (1) వికెట్ తీసి శుభారంభం ఇచ్చాడు. పేస్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా మూడు ఓవ‌ర్లు వేసి 23 ప‌రుగుల‌కు రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ 18 ప‌రుగుల‌కు రెండు వికెట్లు తీశాడు.

దీంతో కివీస్ రెక్క‌లు విరిచిన‌ట్లు అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రాకే ద‌క్కింది. అయితే, ఈ మ్యాచ్ లో భార‌త బౌల‌ర్ల‌కు దీటుగా బ్యాట్స్ మ‌న్ చెల‌రేగారు. కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే 155 ప‌రుగులు చేసి ల‌క్ష్యాన్ని అందుకున్నారు. ఓవ‌ర్ కు 15.5 ప‌రుగుల చొప్పున బాదారు. కాగా, యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కేవ‌లం 14 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ మార్క్ ను అందుకున్నాడు. టి20ల్లో భార‌త్ నుంచి రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఇది కావ‌డం విశేషం. 12 బంతుల్లో యువ‌రాజ్ సింగ్ (2007 టి20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఇంగ్లండ్ పై) చేసిన హాఫ్ సెంచ‌రీ ఇంకా రికార్డుగానే మిగిలి ఉంది.

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ జోరు

ల‌క్ష్యం స్వ‌ల్ప‌మే అయిన‌ప్ప‌టికీ టీమ్ఇండియా తొలి బంతికే సంజూ శాంస‌న్ (0) వికెట్ ను కోల్పోయింది. దీంతో అభిమానుల్లో కంగారు మొద‌లైంది. కానీ, వ‌న్ డౌన్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ (13 బంతుల్లో 28, 3 ఫోర్లు, 2 సిక్స్ లు) వ‌స్తూనే బ్యాట్ కు ప‌నిచెప్పాడు. మ‌రో భారీ షాట్ ఆడ‌బోయి వికెట్ ఇచ్చేసినా... త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ సూర్య (26 బంతుల్లో 57 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సులు) వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ చేసి జ‌ట్టు విజ‌యంలో భాగ‌మ‌య్యాడు. యువ అభిషేక్ (20 బంతుల్లో 68 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సులు) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగ‌డంతో టీమ్ఇండియా అతి తేలిగ్గా ల‌క్ష్యాన్ని అందుకుంది. అభిషేక్, ఇషాన్, సూర్య ఏ ద‌శ‌లోనూ ఇబ్బంది లేకుండా ఆడారు. కాక‌పోతే... సంజూ శాంస‌న్ మాత్ర‌మే మ‌ళ్లీ నిరాశ‌ప‌రిచాడు.

ఇక క‌ష్ట‌మేనా?

వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట‌ర్. అత‌డిని ఎంపిక చేయ‌క‌పోతే సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు బాణాల్లా దూసుకొచ్చేవి. ఇక ఈ ఏడాది అత‌డు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్) నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే)కు మారాడు. దీంతో మ‌రింత ఫోక‌స్ అత‌డిపై ఉంది. ఇలాంటి స‌మ‌యంలో సంజూ వ‌రుస‌గా వైఫ‌ల్యాల‌తో ప్చ్ అనిపిస్తున్నాడు. టెస్టు, వ‌న్డే కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ సంజూను టి20ల్లో ఆడిస్తున్నా అత‌డు ఆశించినంత‌గా రాణించ‌డం లేదు.

న్యూజిలాండ్ తో సిరీస్ లో మూడు మ్యాచ్ ల్లో 10, 6, 0 ప‌రుగులే చేశాడు. 2వ టి20లో రెండో బంతికే ఔట‌య్యే ముప్పు త‌ప్పినా, దానిని సొమ్ము చేసుకోలేక‌పోయాడు. దీంతో తుది జ‌ట్టులో అత‌డి స్థానం ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది. మొన్న‌టివ‌ర‌కు రిష‌భ్ పంత్, జితేశ్ శ‌ర్మ‌, ధ్రువ్ జురెల్ నుంచి పోటీ ఎదుర్కొన్న సంజూకు ఇప్పుడు ఇషాన్ కిష‌న్ రూపంలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ పోటీకి వ‌చ్చాడు.

ఇప్పుడు న్యూజిలాండ్ తో మిగ‌తా రెండు మ్యాచ్ ల‌కు హైద‌రాబాదీ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అందుబాటులోకి వ‌స్తే సంజూను ప‌క్క‌న‌పెట్ట‌డం ఖాయం. అలా జ‌ర‌గ‌కున్నా.. సంజూ బదులు మిగ‌తా మ్యాచ్ ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఆడించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సంజూ టి20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులోనూ ఉన్నాడు. కివీస్ పై మిగ‌తా రెండు టి20ల‌లోనూ చాన్స్ స‌ద్వినియోగం చేసుకోకుంటే ఉద్వాస‌న ఖాయం. టాప్ ఆర్డ‌ర్ లో కుడి-ఎడ‌మ కాంబినేష‌న్ కావాల‌నుకుంటే త‌ప్ప సంజూను కొన‌సాగించ‌డం క‌ష్ట‌మే.

Tags:    

Similar News