తుది జ‌ట్టులోనే ఉండ‌డ‌నుకుంటే.. ఏకంగా మ్యాన్ ఆఫ్ ద టోర్నీ

అమెరికాతో మ్యాచ్ అనంత‌రం అస్వ‌స్థ‌త‌కు గురైన అభిషేక్ శ‌ర్మ స్థానంలో న‌మీబియాతో మ్యాచ్ లో చోటు ద‌క్కింది సంజూకు.;

Update: 2026-03-09 04:06 GMT

హ‌మ్మ‌య్య‌.. ఒక అంకం ముగిసింది..! టి20 ప్ర‌పంచ క‌ప్ టీమ్ఇండియాకే సొంత‌మైంది..! కానీ, ఈ ప్ర‌యాణంలో ఎన్నో అనుమానాలు..! తొలి మ్యాచ్ లో ప‌సికూన అమెరికా చేతిలో క‌ష్టంగా గెలుపు.. లీగ్ ద‌శ‌లో ఓట‌మి లేకున్నా.. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న మాత్రం అంతంతే..! సూప‌ర్ 8లో ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాజ‌యం..! జింబాబ్వే మీద గెలిచినా, సెమీఫైన‌ల్స్ చేరాలంటే స‌మీక‌ర‌ణాలు అడ్డు..! కానీ, వెస్టిండీస్ ను క్వార్ట‌ర్స్ కాని క్వార్ట‌ర్స్ లో మ‌ట్టిక‌రిపించి భార‌త్ ఆపై సెమీస్ లో ఇంగ్లండ్ ను చిత‌క్కొట్టింది. ఫైన‌ల్లో న్యూజిలాండ్ కు స‌మాధాన‌మే లేకుండా చేసింది. అయితే, ఈ మొత్తం ప్ర‌యాణంలో ఒక ఆట‌గాడి గురించి చెప్పుకోవాలి. అత‌డే సంజూ శాంస‌న్. మెగా టోర్నీకి ముందు వ‌రుస వైఫ‌ల్యాల‌తో తుది జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అత‌డి స్థానాన్ని అనూహ్యంగా టీమ్ఇండియాలోకి వ‌చ్చిన మ‌రో వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ ఇషాన్ కిష‌న్ సొంతం చేసుకున్నాడు. దీంతో సంజూ ప‌ని అయిపోన‌ట్లేన‌నే విశ్లేష‌ణ‌లు. అవ‌కాశాలు వ‌చ్చినా స‌ద్వినియోగం చేసుకోలేద‌ని విమ‌ర్శ‌లు. తీరా ప్ర‌పంచ క‌ప్ ముగిశాక చూస్తే.. అత‌డే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ. ఇదంతా క‌ల‌లా క‌నిపించినా నిజం. కేవ‌లం 25 రోజుల్లోనే జీరో నుంచి హీరోగా ఎదిగాడు సంజూ.

అవి హాఫ్ సెంచ‌రీలు కావు.. సెంచ‌రీలు

అమెరికాతో మ్యాచ్ అనంత‌రం అస్వ‌స్థ‌త‌కు గురైన అభిషేక్ శ‌ర్మ స్థానంలో న‌మీబియాతో మ్యాచ్ లో చోటు ద‌క్కింది సంజూకు. అయితే, 22 ప‌రుగులే చేసి ఔట‌య్యాడు. మంచి ప్రారంభాన్ని భారీ స్కోరుగా మ‌ల‌చ‌లేక‌పోయాడు. అయితే, ఆ త‌ర్వాత అభిషేక్ కోలుకోవ‌డంతో కీల‌క‌మైన పాకిస్థాన్ తో, నెద‌ర్లాండ్స్ తో మ్యాచ్ ల‌కు సంజూ చోటు కోల్పోయాడు. చివ‌ర‌కు రింకూ సింగ్ కు అనుకోని విధంగా తండ్రిని కోల్పోవ‌డం.. సంజూకు క‌లిసొచ్చింది. రింకూ తిరిగొచ్చినా సంజూనే కొన‌సాగించి టీమ్ఇండియా మేనేజ్ మెంట్ మంచి ప‌నిచేసింది. దీని ఫ‌లితంగానే ఒక విధంగా ప్ర‌పంచ‌క‌ప్ ద‌క్కింది అని చెప్ప‌వ‌చ్చు. వెస్టిండీస్ తో సూప‌ర్ 8 మ్యాచ్, సెమీస్ లో ఇంగ్లండ్, ఫైన‌ల్లో న్యూజిలాండ్ పై భారీ హాఫ్ సెంచ‌రీలు (97 నాటౌట్, 89, 89) చేసి శాంస‌న్ శాసించాడు. ఈ మూడు మ్యాచ్ ల‌లో మొద‌టి రెండింటిలోనూ అత‌డే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావ‌డం విశేషం. న‌మీబియాపై 22, జింబాబ్వేపై 24 ప‌ర‌గుల‌తో ట‌చ్ లోకి వ‌చ్చిన ఈ కేర‌ళ కుర్రాడు.. ఆపై మూడు మ్యాచ్ ల‌లో అత్యంత కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రీ ముఖ్యంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ ల‌పై ఇన్నింగ్స్ లు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయి. అందుకే ఇవి హాఫ్ సెంచ‌రీలు కావు సెంచ‌రీలు.

5 మ్యాచ్ లు 321 ప‌రుగులు..

ప్రతి మెగా టోర్నీ ముగిశాక మ్యాన్ ఆఫ్ ద టోర్నీ ఎవ‌రూ? అని అభిమానులు చూస్తారు. ఈసారి వారికి మరింత కిక్ ఇస్తూ సంజూ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఆడింది 5 మ్యాచ్ లే అయినా.. 321 ప‌రుగుల‌తో సూప‌ర్బ్ అనిపించాడు. అస‌లు తుది జ‌ట్టులోనే ఉండ‌డు అనుకున్న బ్యాట్స్ మ‌న్ ఏకంగా ఈ అవార్డు గెలుచుకోవ‌డం అంటే అది మిర‌కిల్ అనుకోవాలి. ఇప్పుడు సంజూను ఎవ‌రైనా టి20 తుది జ‌ట్టు నుంచి తొల‌గించే సాహ‌సం చేస్తారా? అవ‌స‌ర‌మైతే.. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ను అయినా ప‌క్క‌న‌పెడ‌తారు కానీ.. సంజూను మాత్రం తీసేయ‌రు అని చెప్ప‌వ‌చ్చు.

Tags:    

Similar News