డాడీస్ ఆర్మీ ఇక పిల్లల జట్టు.. వచ్చే సీజన్ లో దుమ్మురేపుడే
ఒకప్పుడు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్.. 35 ఏళ్లు పైబడిన వయసులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఆడారు. దీంతో ఈ జట్టుకు డాడీస్ ఆర్మీ (పెద్దోళ్ల జట్టు)గా పేరొచ్చింది.;
ఒకప్పుడు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్.. 35 ఏళ్లు పైబడిన వయసులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఆడారు. దీంతో ఈ జట్టుకు డాడీస్ ఆర్మీ (పెద్దోళ్ల జట్టు)గా పేరొచ్చింది. అయినా, ఇలాంటివారితోనే టైటిల్ కొట్టింది చెన్నై. అయితే, రెండేళ్లుగా సీఎస్కే జట్టు పరిస్థితి బాగోలేదు. రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ ను కెప్టెన్ చేసినా అతడు గాయంతో వైదొలగడంతో నిరుడు మళ్లీ పాత కాపు మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు...
ఆయుష్ మాత్రే 18 ఏళ్లు, కార్తీక్ శర్మ 19 ఏళ్లు, ప్రశాంత వీర్, నూర్ అహ్మద్ 20 ఏళ్లు, డివాల్డ్ బ్రేవిస్ 22 ఏళ్లు..! వీళ్లంతా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆటగాళ్లు. ఒకప్పుడు డాడీస్ ఆర్మీగా పేరున్న ఫ్రాంచైజీయేనా ఇది? అనేంతగా మారిపోతోంది ఈ జట్టు. పైగా 29 ఏళ్ల సంజూ శాంసన్ కూడా వచ్చే సీజన్ నుంచి చెన్నైకే ఆడబోతున్నారు. 37 ఏళ్లు రవీంద్ర జడేజాను సంజూ కోసం వదులుకుంది చెన్నై. దీంతో ఈ మాజీ చాంపియన్ ప్రస్తుతం యువ రక్తంతో కళకళలాడుతోంది.
కెప్టెన్ ఎవరో..?
గత సీజన్ ప్రారంభంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ మధ్యలో ధోనీకి పగ్గాలు అప్పగించింది చెన్నై యాజమాన్యం. మరి రుతురాజ్ ఇప్పుడు కోలుకుని వచ్చాడు. పైగా సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు? అనేది చర్చనీయంగా మారింది. రుతురాజ్ సారథ్యం పట్ల ఆసక్తి చూపకుంటే సంజూను కెప్టెన్ చేసే చాన్సుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ ను విజయవంతంగా నడిపించడం సంజూకు ప్లస్ పాయింట్.
ఈ కుర్రాళ్లు ప్రత్యేకం..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్నది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). అలాంటి జట్టు ఇప్పుడు పునర్ నిర్మాణ దశలో ఉంది. దిగ్గజం ధోనీ ఈ ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటాడు. సీనియర్ మోస్ట్ రవీంద్ర జడేజా ఫ్రాంచైజీ మారిపోయాడు. కొత్త కెప్టెన్ కూడా రానున్నాడు. వీరికి ఇప్పుడు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ వంటి కుర్రాళ్లు తోడవనున్నారు. విధ్వంసక బ్యాటింగ్, స్పిన్, అద్బుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలతోప్రశాంత్ వీర్ లోయర్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆశిస్తున్నారు. ఆయుష్ మాత్రే ఈ ఏడాది చెన్నైకి మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. వీరికితోడు దూకుడుకు మారుపేరైన 27 ఏళ్ల ఉర్విల్ పటేల్ ఉండనే ఉన్నాడు.
బౌలింగ్ సంగతేమిటో..?
చెన్నైకు వచ్చే సీజన్ లో పేసర్ పతిరన అందుబాటులో లేడు. స్పిన్ లో జడేజా కూడా లేడు. బ్యాటింగ్ బలపడినా బౌలింగ్ పరిస్థితి ఏమిటో? అన్నది చూడాలి. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, గుర్జన్ ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్ లు చెన్నైని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.