నాపై ఆరోపణలు చేస్తోంది.. ఆ ఇద్దరు కురువృద్ధులే: వైసీపీ ఎమ్మెల్యే!

తమ పార్టీలో వాళ్లే తనపై తప్పుడు ప్రచారం

Update: 2023-07-22 06:37 GMT

భూములు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రూ.908 కోట్ల రుణాలు తీసుకుని వాటిని ముంచేశారని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్‌ రెడ్డిపై మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు రుణాలను తిరిగి తీర్చకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. బ్యాంకు రుణాల ఎగవేత ఘటన, కెనరా బ్యాంక్‌ ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీలో వాళ్లే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి మండిపడ్డారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తమ పార్టీలో ఉన్న కురువృద్ధుడు ఒకరు, టీడీపీలోని మరో కురువృద్ధుడు ఏకమై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రజల మనిషినని తెలిపారు. తాను తీసుకున్న రుణాలను ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.

ఈ వ్యవహారంలో తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు. తాను అప్పులు తీర్చకుండా పారిపోయే వ్యక్తిని కాదని వెల్లడించారు. తాను బ్యాంకు రుణాలు తీర్చడం లేదని, ఐపీ పెడుతున్నానంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనకు రావాల్సిన నగదు ఆరు నెలలుగా రాలేదన్నారు. దీంతో రుణాలు చెల్లించడంలో ఆలస్యం జరిగిందన్నారు.

Read more!

తాను ఎలాంటి వాడినో నియోజకవర్గంలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారని శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు సహజమేనని వ్యాఖ్యానించారు. బ్యాంకర్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసినా తాను హాజరవుతానని వెల్లడించారు. వీలైనంత త్వరలో బ్యాంకులకు రుణాలన్నీ చెల్లిస్తానని స్పష్టం చేశారు. అందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.

అనంతపురంలోని రుద్రంపేట వద్ద ఎస్సీ, మైనార్టీల భూములు కాజేసింది టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి అని శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు. పార్టీ లీడర్లకు చెక్కులు ఇచ్చి మోసం చేసింది కూడా ఆయనేనని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేయడం పల్లె రఘునాథ్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.

పుట్టపర్తిలో తాను ఉన్నంతకాలం గెలవలేనని పల్లె రఘునాథ్‌ రెడ్డి భయపడుతున్నాడని శ్రీధర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కాకుండా మరెవరు పోటీ చేసినా డబ్బులు ఇస్తే అమ్ముడుపోతారని ఆయనకు తెలుసని హాట్‌ కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో నిలబడేది తానేనని, గెలిచేది కూడా తానేనని స్పష్టం చేశారు. ఇందులో అపోహలేమీ వద్దని కోరారు.

కాగా 2014లో హిందూపురం ఎంపీ స్థానం వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీధర్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2019లో పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. తనపై తాజా ఆరోపణల నేపథ్యంలో శ్రీధర్‌ రెడ్డి విమర్శించిన ఆ ఇద్దరు కురువృద్ధులు ఎవరనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.

Tags:    

Similar News