చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయం.. సత్యసాయి జిల్లా దశ మార్చేయనుందా?
చంద్రబాబు గత ప్రభుత్వంలో కియా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల సత్యసాయి జిల్లాలో యువతకు ఉపాధితోపాటు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం వచ్చిందని చెబుతున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం, సత్యసాయి జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బెంగళూరు, చెన్నై మహానగరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈ పార్కు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో లేపాక్షి నాలెడ్జి హబ్ కు కేటాయించిన భూములను కేటాయించనున్నారు. ప్రస్తుతం లేపాక్షికి 8,844 ఎకరాల భూమి ఉండగా, అదనంగా మరో 15 వేల ఎకరాలను కేటాయించి మొత్తం 23 వేల ఎకరాల్లో పరిశ్రమలు స్థాపించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల వెనుకబడిన రాయలసీమలో భారీ ఉద్యోగవకాశాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
చంద్రబాబు గత ప్రభుత్వంలో కియా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల సత్యసాయి జిల్లాలో యువతకు ఉపాధితోపాటు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అదేవిధంగా ఈ జిల్లాకు అత్యంత సమీపంలో బెంగళూరు మహానగరం ఉంది. అదేవిధంగా చెన్నై కూడా 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు నగరాలకు సమీపంలో పరిశ్రమలు స్థాపించడం పారిశ్రామిక సంస్థలకు భారంగా మారింది. అయితే ఈ అవకాశాన్ని వినిగించుకుని పరిశ్రమలను తీసుకురావాలని, అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.
బెంగళూరు హైవేకి రెండు వైపుల లేపాక్ష నాలెడ్జి హబ్ ఉంది. దీనికి ఆనుకుని మిగిలిన భూమిని సేకరించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఎకరాకు రూ.7 నుంచి 14 లక్షలు చెల్లించేలా నిర్ణయం తీసుకుని అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఇందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణకు దాదాపు రూ.800 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రుణ సేకరణకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏపీఐఐసీ రూ.2 వేల కోట్ల రుణ సేకరణకు అవసరమైన వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
ఇక బెంగళూరు నగరానికి 75 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. మొత్తం 16 రకాల పరిశ్రమలు ఏర్పాటుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం వైజాగ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిన లీ అండ్ అసోసియేట్స్ కు బాధ్యతలు అప్పగించింది. ఇక ప్రభుత్వ సూచనలతో భూ సేకరణ ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
బెంగళూరు విమానాశ్రయానికి గంటన్నరలో చేరుకునే వెసులుబాటు ఉండటంతో లేపాక్షి ఇండస్ట్రియల్ పార్కులో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బెంగళూరులో భూములు లభించకపోవడం, అక్కడ వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల లేపాక్షి భూములు అన్నిరకాలుగా ఉపయోగపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తక్కువ వ్యయం, రవాణా సౌలభ్యం, రెండు మెగా సిటీలకు అందుబాటులో ఉండటం వల్ల ఊహించినదానికంటే ఎక్కువగా స్పందన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.