పాక్ మూకలను హతమార్చి వీర మరణం పొందాడు
ఆపరేషన్ సింధూర్ నేపద్యంలో తెలుగు జవాన్ అయిన మురళీ నాయక్ ధైర్య సాహసాలను చూపించి తాను పుట్టిన ప్రాంతానికి దేశానికి పేరు తెచ్చాడు;
పాక్ కుత్సిత బుద్ధితో భారత్ మీద కయ్యానికి కాలు దువ్వుతూ తెచ్చిన యుద్ధంలో తెలుగు వీరుడైన మురళీ నాయక్ వీర మరణం పొందాడు. అయితే మురళీ నాయక్ తాను చనిపోతూ పాక్ మూకలను చెండాడి మరీ దేశం రుణం తీర్చుకున్నాడు. ఆఖరి శతృవుని కూడా వదలకుండా పోరాడే క్రమంలో పాక్ మూకలలో కొందరిని మట్టుబెట్టి మరీ దేశానికి రుణం తీర్చాడు.
ఆపరేషన్ సింధూర్ నేపద్యంలో తెలుగు జవాన్ అయిన మురళీ నాయక్ ధైర్య సాహసాలను చూపించి తాను పుట్టిన ప్రాంతానికి దేశానికి పేరు తెచ్చాడు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ భారత్ పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద యుద్ధం చేస్తూ అసువులు బాశాడు.
ఈ విధంగా వీర మరణం పొందిన మురళీ నాయక్ ఆ కుటుంబానికి ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డను దేశ మాత కోసం అంకితం ఇచ్చిన ఆ కుటుంబం త్యాగం ఎన్నతగినది అని అంతా కొనియాడుతున్నారు ఇక చూస్తే మురళీ నాయక్ 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో ఎంపిక అయ్యాడు.
నాలుగేళ్ళ అగ్రిమెంట్ తో చేరిన మురళీ నాయక్ 2026 నవంబర్‌లో తన కాంట్రాక్టుని పూర్తి చేసుకుని తిరిగి రావాల్సి ఉంది. ఇంతలోనే పాక్ తో యుద్ధం రావడంతో అమర వీరుడు అయి విశేష కీర్తిని గడించాడు. పట్టుమని పాతికేళ్ళు నిండని ఈ వీరుడు దేశం కోసం తెగించిన తీరు అందరి ప్రశంసలు చూరగొంటోంది.
ఇక మురళీనాయక్‌ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు తీసుకెళ్లిందని ఆయన తండ్రి శ్రీరాం నాయక్ మీడియాకు వివరించారు. తన కుమారుడు పాక్ మూకలను చెల్లాచెదురు చేస్తూ కొందరిని హతమారుస్తూ దేశాన్ని రక్షించే క్రమంలో పాక్ నుంచి ఎదురుదాడి జరిగి ప్రాణాలు వదిలాడు అని ఆయన చెప్పారు.
ఎంతో ధైర్యంగా పాక్ మూకలను ఎటాక్ చేస్తూ తనకు అప్పగించిన పనిని పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వస్తుండగా పాక్ వైపు నుంచి వచ్చిన తూటాలతో ప్రాణాలు విడిచాడు అని ఆయన చెప్పారు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లితాండ గ్రామం. ఇపుడు ఆ గ్రామం ఒక వైపు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన యువకుడు తమ వాడే అని ఉప్పంగిపోతూనే చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించాడని మరో వైపు తల్లడిల్లుతోంది.
మురళీనాయక్ కుటుంబానికి మంత్రి సవిత 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. చంద్రబాబు ఆ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించారు మాజీ సీఎం జగన్ సైతం ఫోన్ ద్వారా ఓదార్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నీ త్యాగాన్ని దేశం ఎపుడూ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.