ఈ ఊళ్లో పాలు ఎవరికైనా ఫ్రీగా పోసేస్తారు.. డబ్బులు తీసుకోరు
నగరాలు.. పట్టణాల్లో మాదిరే గ్రామాల్లోనూ ప్రతి పనికి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అంతకంతకూ ఎక్కవ అవుతోంది.;
కాలం మారింది. మనుషుల మధ్య సంబంధాలు అన్నీ కూడా ఆర్థికంగా మారిపోయిన దుస్థితి. గతంలో గ్రామాల్లో కొన్ని పనులకు డబ్బులు ఆశించేవారు కాదు. తమ మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా డబ్బు కంటే కూడా వారి అవసరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. చేసిన కొన్ని పనులకు డబ్బులు ఆశించేవారు కాదు. గడిచిన నలభై ఏళ్లలో ఈ పరిస్థితుల్లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి.
నగరాలు.. పట్టణాల్లో మాదిరే గ్రామాల్లోనూ ప్రతి పనికి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అంతకంతకూ ఎక్కవ అవుతోంది. ఇలాంటి వేళ.. మిగిలిన గ్రామాలకు భిన్నంగా ఏపీలోని ఒక గ్రామానికి సంబంధించిన ఒక అంశం అందరిని ఆకర్షిస్తోంది. ఈ గ్రామంలోని వారు మాత్రమేకాదు.. కొత్తగా ఆ ఊరికి వచ్చిన వారికి సైతం పాలు ఫ్రీగా పోయటం ఒక సంప్రదాయం. దీని వెనుక ఆసక్తికర కథనాన్ని చెబుతున్నారు.
సాధారణంగా ఊరు ఏదైనా.. పాడిరైతులు పాలు పోస్తూ ఆదాయాన్ని పొందుతుంటారు. కానీ.. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండల పరిధిలో ఉన్న చిల్లవారిపల్లి మాత్రం భిన్నం. ఇక్కడ ఉండే 400 కుటుంబాల్లో పలువురికి ఆవులు.. గేదెలు ఉన్నాయి. మొత్తం వీటి సంఖ్య 315గా చెబుతారు. వీటి నుంచి రోజూ 400 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటుంది. అయితే.. ఈ ఊళ్లో ఒక సంప్రదాయం ఉంది. దీని ప్రకారం ఊళ్లో వారికే కాదు.. బయట ఊళ్ల వారికైనా సరే పాలుపోస్తారు కానీ.. డబ్బులు తీసుకోరు.
ఎందుకిలా? అంటే దానికో ఆసక్తికర కథనాన్ని చెబుతారు. సుమారు 400 ఏళ్ల క్రితం చతమ ఊరికి గ్రామ ఇలవేల్పు అయిన శ్రీకాటి కోటేశ్వరుడు పాలకావిడితో ఊరికి వచ్చారని..ఆయన ప్రతిరూపమే పాలుగా ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అందుకే.. ఈ ఊళ్లో పాలు ఉచితంగా పోయటం పూర్వం నుంచి అనవాయితీగా వస్తోంది. ఇప్పటికి ఆ సంప్రదాయాన్ని వారు పాటిస్తూ ఉండటం విశేషం. ఊళ్లో వారికి మాత్రమేకాదు.. వేరే ఊరి వాళ్లకు సైతం పాలు ఉచితంగా పోయటానికి తాము సిద్ధమని చెబుతారు. ఇప్పుడున్న వాణిజ్య ప్రపంచంలో ఇలాంటి ఊరు.. ఆ ఊళ్లో ప్రజలు ఇస్పెషల్ అని చెప్పక తప్పదు.