నకిలీ బంగారంతో బ్యాంకు లోన్లు.. దొరికిపోయిన కర్ణాటక ముఠా

దొంగ బంగారంతో బ్యాంకర్లను మోసం చేయాలని చూసిన కర్ణాటక వాసులు అడ్డంగా బుక్కయ్యారు.;

Update: 2025-12-11 13:08 GMT

దొంగ బంగారంతో బ్యాంకర్లను మోసం చేయాలని చూసిన కర్ణాటక వాసులు అడ్డంగా బుక్కయ్యారు. బ్యాంకర్ల అప్రమత్తతో నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన నలుగురు సభ్యుల ముఠా రెండుగా వీడిపోయి శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల, ఓబుళదేవరచెరువులో ఉన్న రెండు బ్యాంకుల్లో దోపిడీకి ప్లాన్ చేశారు. నకిలీ బంగారాన్ని ఆయా బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకోవాలని చూశారు. ఇందుకోసం కమీషన్ ఆశచూపి ఇద్దరు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకుని బ్యాంకులకు వచ్చారు.

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బెంగళూరు యలహంక ప్రాంతానికి చెందిన శంకర్, నంజుండప్ప, నగేశ్, రఘు ముఠాగా ఏర్పడ్డారు. వీరు నలుగురు ఓ కారులో గోరంట్ల పట్టణానికి తొలుత వచ్చారు. వీరిలో ఇద్దరు గోరంట్ల మండలానికి చెందిన ఓ రైతు శంకరప్పను తీసుకుని స్టేట్ బ్యాంకుకు వెళ్లారు. రైతు శంకరప్పకు చెందిన పాసుపుస్తకాలపై 16 తులాల బంగారం కుదవపెట్టి రుణం తీసుకోవాలని ప్లాన్ చేశారు. అయితే బంగారం బరువుగా ఉండటంతో అనుమానం వచ్చిన బ్యాంకరు బెంగళూరుకు చెందిన ఇద్దరిని బయట కూర్చొమని చెప్పి, రైతును గట్టిగా ప్రశ్నించారు. దీంతో కమీషన్ కోసం తాను వారితో వచ్చానని, తనకేమీ తెలియదని రైతు శంకరప్ప అసలు విషయం చెప్పేశాడు.

దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది వెంటనే బ్యాంకు గేట్లను మూసివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైతు శంకరప్పతోపాటు కర్ణాటక వాసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో మరో ముఠా ఓబులదేవరచెరువు వెళ్లిందని తెలిసి.. అక్కడి పోలీసులు, బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. గోరంట్ల పోలీసుల సమాచారంతో ఓబులదేవరచెరువు బ్యాంకుకు వెంటనే తాళాలు వేసి ఖాతాదారులు ఎవరినీ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత గోరంట్ల, ఓబులదేవరచెరువు పోలీసులు సంయుక్తంగా అక్కడ ఉన్న కర్ణాటక వాసులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈ ముఠా గత నెలలో ఓబులదేవర చెరువులో ఇదే తరహాలో మోసం చేసి రూ.30 లక్షల రుణం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పుడు బ్యాంకర్లు మోసపోయినట్లే మరోసారి బురిడీ కొట్టిద్దామని వచ్చి అడ్డంగా బుక్కయ్యారని పోలీసులు చెబుతున్నారు. గిల్టు నగలను బంగారంలా మెరుగు పెట్టించి బరువు కోసం మైనం పెట్టారని పోలీసులు కనుగొన్నారు. డ్రైవరు, ఇద్దరు రైతులతో కలిపి మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితులు అందరినీ పెనుగొండ డీఎస్పీ ఆఫీసులో విచారిస్తున్నారు.

Tags:    

Similar News