అంతా హెచ్‌సీఏ పెత్తనమేనా? ‘తెలంగాణ క్రికెట్ సంఘం’ ఉండొద్దా?
ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడూ తెలంగాణ వచ్చాక కూడా మొదటినుంచి ఒక్కటంటే ఒక్కటే క్రికెట్ అసోసియేషన్. అది కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) పేరిటనే కొనసాగుతోంది.;
తెలంగాణ రాష్ట్రం కంటే కాస్త పెద్దదైన గుజరాత్ లో మూడు క్రికెట్ సంఘాలు (బరోడా, సౌరాష్ట్ర, గుజరాత్) ఉన్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ మూడు సంఘాలు (ముంబై, మహారాష్ట్ర, విదర్భ) ఉన్నాయి. ఆఖరికి పంజాబ్-హరియాణల ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ కూ (పంజాబ్, హరియాణ సంఘలు కాకుండా) క్రికెట్ అసోసియేషన్ ఉంది. కానీ, ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడూ తెలంగాణ వచ్చాక కూడా మొదటినుంచి ఒక్కటంటే ఒక్కటే క్రికెట్ అసోసియేషన్. అది కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) పేరిటనే కొనసాగుతోంది. అంటే.. తెలంగాణలో క్రికెట్ అంటే కేవలం హెచ్ సీఏదేనా? రాష్ట్రంలోని మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి? ఈ విధంగా క్రికెట్ సెంట్రలైజ్ కావడంతోనే ఒక్క అండర్ -14 సెలక్షన్ కోసం వేలమంది పిల్లలు హైదరాబాద్ వచ్చే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ లో, బయట వేచి ఉండాల్సి వచ్చింది. అసలు తెలంగాణ గ్రామీణ క్రికెట్ పటిష్ఠంగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అంతా హైదరాబాద్ లోనే..
హైదరాబాద్ నగరలో 200 క్రికెట్ క్లబ్ లు ఉన్నాయి. వందలాది స్కూల్స్ ఉన్నందున ఇక్కడ చదివినవారికే క్రికెట్ లో ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. హెచ్ సీఏ లీగ్ లు ఆడేందుకు వీరే ఎక్కువ అర్హత సాధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్ సీఏ కేవలం హైదరాబాద్ కే పరిమితం. దీంతో జిల్లాల్లో రెగ్యులర్గా ఏజ్ గ్రూప్ పోటీలు నిర్వహించడం లేదు. మొత్తంగా చూస్తే సిస్టమాటిక్ ప్లాన్ లేదు. పాత పది జిల్లాల్లోనే లేదు.. ఇప్పుడున్న 33 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతోనే ఏ పోటీలైనా హైదరాబాద్ లోనే నిర్వహించాల్సి వస్తోంది.
ఎక్కడెక్కడివారు ఎక్కడకు...
దేశంలో కాదు తెలంగాణలోనే ఎంతోమంది వైభవ్ సూర్యవంశీలు ఉన్నా వెలుగులోకి రావడం లేదు.. అనేది తెలంగాణ క్రీడా నిపుణులు చెప్పే మాట. తెలంగాణ గ్రామీణ క్రికెట్ పూర్తిగా వివక్షకు గురవుతోందని వారు వాపోతున్నారు. అయితే, ఇక్కడ హెచ్ సీఏను పూర్తిగా తప్పుబట్టడం కూడా సరికాదు. పేరులోనే ఉన్నట్లుగా దాని పరిధి హైదరాబాద్ కే పరిమితం అనుకోవాలి. ఇప్పుడు చేయాల్సింది తెలంగాణ ప్రభుత్వమే పూనుకుని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) ఏర్పాటు చేయాలి.
హెచ్ సీఏలోనే అవినీతి కంపు..
అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ వంటి గొప్ప ఆటగాళ్లను దేశానికి అందించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఇందులోనూ బీభత్సమైన రాజకీయాలు. ఒక వర్గంపై మరొక వర్గం ఎత్తులు. పైఎత్తులు. ముందుగా హెచ్ సీఏను ప్రక్షాళన చేసి.. జిల్లాల క్రికెట్ సంఘాలను సంస్కరించాల్సి ఉంది.
అల్లీపురం.. పోరాడినా...
తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ (శాట్) చైర్మన్ గా ఉన్న సమయంలో అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కోసం బలంగా గళం వినిపించారు. స్వతహాగా క్రికెటర్ అయిన అల్లీపురం ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందినవారు. ఆ జిల్లా క్రికెట్ కార్యదర్శిగానూ పనిచేశారు. శాట్ చైర్మన్ గా ఉన్నప్పుడు తెలంగాణ గ్రామీణ క్రికెట్ బాగు కోసం ఆయన ప్రయత్నించారు. ఇప్పటికైనా గ్రామీణ క్రికెట్ ను పట్టించుకుంటే ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లు దొరుకుతారని అంటున్నారు.