టీమ్ ఇండియాకు కొత్త వన్డే కెప్టెన్.. తప్పు దిద్దుకొంటున్న బీసీసీఐ!
టెస్టులకు ఒకరు, వన్డేలకు మరొకరు, టి20లకు ఇంకొకరు...! కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు కెప్టెన్సీ విషయంలో పాటిస్తున్న నిబంధన ఇది.;
టెస్టులకు ఒకరు, వన్డేలకు మరొకరు, టి20లకు ఇంకొకరు...! కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు కెప్టెన్సీ విషయంలో పాటిస్తున్న నిబంధన ఇది. ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా ఇదే పద్ధతిలో వెళ్లనుందా..! టి20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు శుబ్ మన్ గిల్ సారథులుగా ఉండగా.. వన్డే కెప్టెన్ గా మరో ఆటగాడికి చాన్స్ ఇవ్వనుందా..? ఊహాగానాలను బట్టి చూస్తే వీటికి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవలి పరిణామాల రీత్యా బీసీసీఐ ట్రోలింగ్ కు గురవుతోంది. తప్పు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.
ఆ ఆటగాడికి పగ్గాలు...
టి20లు రాకముందు అంతా వన్డేల యుగం. టెస్టులను కూడా ఎవరూ చూసేవారు కాదు ఓ దశలో. టి20లు వచ్చాక టెస్టులు కనుమరుగు అవుతాయని అనుకుంటే.. అనూహ్యంగా వన్డేలు వెనుకబడ్డాయి. ఒకప్పుడు ఏడాది 20-30 వన్డేలు ఆడిన ఆటగాళ్లుండేవారు. కానీ, ఐదారు మ్యాచ్ లకు మించి జరగడం లేదు. ఇలాగే ఉంటే కొన్నేళ్లలో వన్డేలు కనుమరుగు అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీని సంగతి అలా ఉంచితే భారత వన్డే కెప్టెన్ గా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ ను నియమిస్తారనే చర్చ నడుస్తోంది.
ప్రతిభకు లోటు లేదు.. జట్టులో చోటు లేదు
అయ్యర్ విషయానికి వస్తే అతడి కెరీర్ అంతా దోబూచులాటనే. 2023లో ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించినా.. గాయం అనే అబద్ధం చెప్పి బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి దేశవాళీలకు దూరంగా ఉన్నాడు. చివరకు బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత క్షమించి తీసుకున్నారు. సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇచ్చారు. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. అయ్యర్ అక్కడ రాణించినా.. టెస్టు జట్టులోకి మాత్రం తీసుకోలేదు. తాజాగా ఆసియా కప్ టి20 జట్టులోనూ అయ్యర్ లేడు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. బీసీసీఐని అభిమానులు నిందించడం మొదలుపెట్టారు. దీనికి పరిహారంగానా అన్నట్లు శ్రేయస్ ను వన్డే కెప్టెన్ చేస్తారని అంటున్నారు.
రోహిత్ శర్మ స్థానంలో..
కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను వన్డేలకు సారథిగా నియమిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు అవుతారు. 2027 వరల్డ్ కప్ నకు మరో రెండేళ్లే సమయం ఉంది. రోహిత్ అప్పటివరకు ఆడడం కష్టమే. అక్టోబరులో జరిగే ఆస్ట్రేలియా టూర్ తో రిటైర్ అవుతాడని అంటున్నారు. ఆ టూర్ కే అయ్యర్ ను కెప్టెన్ చేస్తారా.. ? లేక తర్వాత చేస్తారా? అన్నది చూడాలి.
ఇప్పుడెందుకు ఊహాగానాలు..?
రోహిత్ విషయం ఎటూ తేలలేదు. మరోవైపు గిల్ ఉండనే ఉన్నాడు. అక్టోబరులో గానీ ఆస్ట్రేలియా పర్యటన లేదు. అయినా, అయ్యర్ కు వన్డే కెప్టెన్సీ అంటూ ఇప్పుడు ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు. బహుశా బీసీసీఐ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇలా చేస్తోందేమో? లేదంటే ఇదంతా కేవలం గాసిప్ అని అనుకోవాలి.