IPL 2025: డ్రగ్ వాడి పట్టుబడ్డ ప్లేయర్.. ఐపీఎల్ నుంచి ఔట్

దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్బౌలర్ కగిసో రబాడా డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. నిషేధిత డ్రగ్స్ వాడినట్లు వెల్లడైన నేపథ్యంలో అతను ప్రస్తుతం తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నాడు.;

Update: 2025-05-04 05:30 GMT

దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్బౌలర్ కగిసో రబాడా డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. నిషేధిత డ్రగ్స్ వాడినట్లు వెల్లడైన నేపథ్యంలో అతను ప్రస్తుతం తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ (SACA) ద్వారా శనివారం విడుదల చేసిన ప్రకటనలో రబాడా స్వయంగా వెల్లడించాడు. నిషేధిత డ్రగ్ వాడినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్న రబాడా, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.

ఈ పరిణామం ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి అతని నిష్క్రమణతో ముడిపడి ఉంది. గుజరాత్ టైటాన్స్ తరఫున రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ రబాడా లీగ్ను వీడాడు. గుజరాత్ టైటాన్స్ అతన్ని ఏకంగా రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

-డోపింగ్ ఉల్లంఘన ఎప్పుడు జరిగింది?

దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి-ఫిబ్రవరిలో జరిగిన SA20 లీగ్ సందర్భంగా రబాడాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతను నిషేధిత డ్రగ్ వాడినట్లు పాజిటివ్గా తేలింది. దీంతో అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. అయితే, రబాడా వాడిన డ్రగ్ ఏది అనే విషయాన్ని అసోసియేషన్ గానీ, రబాడా గానీ స్పష్టంగా వెల్లడించలేదు. ఈ పరిణామంతో జూన్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో రబాడా పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.

- ఎంత శిక్ష పడవచ్చు?

ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (WADA) నిబంధనల ప్రకారం, నిషేధిత మాదక ద్రవ్యాలు వాడిన క్రీడాకారులపై 3 నెలలు నుంచి 4 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ, గంజాయి వంటివి WADA నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే, రబాడా దక్షిణాఫ్రికా యాంటీ-డోపింగ్ బాడీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమంలో చేరడానికి అంగీకరిస్తే, అతని శిక్షను 2 నెలలకు తగ్గించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

రబాడా తన కెరీర్‌లో ఇప్పటివరకు దాదాపు 70 టెస్టులతో సహా మొత్తం 241 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సంక్షోభ సమయంలో తనకు అండగా నిలిచిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ (CSA), ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు రబాడా కృతజ్ఞతలు తెలిపాడు. "నేను చాలా చింతిస్తున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని నేను ఎప్పుడూ తక్కువగా చూడను. ఈ అవకాశం నా కన్నా పెద్దది. ఇది నా వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతమైనది. నాకు మద్దతుగా నిలిచిన నా ఏజెంట్, గుజరాత్ టైటాన్స్, అలాగే మార్గదర్శకత్వం చేస్తున్న SACA, న్యాయ బృందానికి ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు. నేను కష్టపడి నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాను." అని రబాడా తన ప్రకటనలో పేర్కొన్నాడు.

రబాడా గుజరాత్ టైటాన్స్ తరఫున కేవలం 2 మ్యాచ్‌లే ఆడాడు. అయితే, అతను జట్టులో లేకపోయినా ప్రస్తుతం గుజరాత్కు పెద్దగా ఇబ్బంది లేదు. వారు ఆడిన 10 మ్యాచుల్లో ఏడింటిని గెలుచుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నారు. మిగిలిన 3 మ్యాచుల్లో 2 గెలిచినా వారు ప్లేఆఫ్స్‌కు సులభంగా అర్హత సాధిస్తారు.

Tags:    

Similar News