ఫైన్ లేదు.. అంతా ఫైనే.. బంగ్లాదేశ్ కు ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ చాన్స్

భార‌త్ లో జ‌రుగ‌తున్న టి20 ప్ర‌పంచ క‌ప్ నుంచి సాధార‌ణ సాకుల‌తో త‌ప్పుకొన్న బంగ్లాదేశ్ కు చివ‌ర‌కు వ్ర‌తం చెడినా ఫ‌లితం ద‌క్కిన‌ట్ల‌యింది.;

Update: 2026-02-10 09:41 GMT

భార‌త్ లో జ‌రుగ‌తున్న టి20 ప్ర‌పంచ క‌ప్ నుంచి సాధార‌ణ సాకుల‌తో త‌ప్పుకొన్న బంగ్లాదేశ్ కు చివ‌ర‌కు వ్ర‌తం చెడినా ఫ‌లితం ద‌క్కిన‌ట్ల‌యింది. ప‌నికిరాని వాద‌న‌తో ప్ర‌పంచ క‌ప్ వంటి పెద్ద టోర్నీని బ‌హిష్క‌రించి.. క్రికెట్ ప్ర‌పంచంలో బంగ్లా చెడ్డ పేరు తెచ్చ‌కుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జ‌ట్లు భార‌త్ లో ఆడేందుకు ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌క‌పోగా.. ప‌క్క‌నున్న‌ బంగ్లా మాత్రం త‌మ ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌కు ఏదో ప్ర‌మాదం ఉంద‌న్న బిల్డ‌ప్ ఇచ్చింది. మెగా టోర్నీ అయిన ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకొని నెత్తిన చేయి పెట్టుకుంది. స‌హ‌జంగానే ఈ ప‌రిణామం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఆగ్ర‌హం తెప్పిస్తుంది. ఫ‌లితంగా భారీ జ‌రిమానా త‌ప్ప‌ద‌ని భావించారు. దీనికి భిన్నంగా ఐసీసీ... బంగ్లాదేశ్ కు న‌జ‌రానా (గిఫ్ట్) ఇచ్చింది.

ఆంక్ష‌ల్లేవ్..ఆ టోర్నీ హ‌క్కులున్నాయి

భార‌త్ తో టి20 ప్ర‌పంచ‌క‌ప్ ను బాయ్ కాట్ చేసిన‌ప్ప‌టికీ.. బంగ్లాకు టి20 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ చాన్స్ ద‌క్కింది. అదెప్పుడంటే.. 2028లో టి20 ప్ర‌పంచ క‌ప్ హోస్ట్ చేసేందుకు బంగ్లాకు హ‌క్కులు ఇవ్వ‌డం అనే ప్ర‌తిపాద‌న తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. బంగ్లాపై ఆంక్ష‌లు లేకుండా చూడ‌డంతో పాటు అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ‌ను ఇవ్వ‌డం అంటే ఆ జ‌ట్టుకు మేలు చేసిన‌ట్లే. తాజాగా జ‌రిగిన అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ ను జింబాబ్వే-న‌మీబియా సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఇందులో టీమ్ ఇండియా విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల‌కోసారి జ‌రిగే ఈ టోర్నీ మ‌ళ్లీ 2028లో ఉండ‌నుంది. దీనిని బంగ్లాదేశ్ లో నిర్వ‌హించేందుకు అనుమ‌తివ్వ‌డం అనే ప్ర‌తిపాద‌న ఇప్పుడు ముందుకొచ్చింది. మ‌రోవైఉ బంగ్లాదేశ్ లో అప్ప‌టికి ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఆ దేశంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుంది.

తెర‌వెనుక పాక్..

భార‌త్ లో జ‌రిగే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ ల వేదిక‌ల‌ను మార్చ‌నందుకు బంగ్లా త‌ప్పుకోగా, దానికి మ‌ద్ద‌తుగా భార‌త్ తో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేసింది. కానీ, మ‌న‌సు మార్చుకుని వ‌చ్చే ఆదివారం భార‌త్ తో కొలంబోలో ఆడేందుకు ఒప్పుకొంది. దీనికి ముందు ఐసీసీ స‌మ‌క్షంలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ స‌మ‌యంలో భార‌త్-పాక్-బంగ్లా ముక్కోణ‌పు సిరీస్ ను ప్ర‌తిపాదించినా అది జ‌రిగే ప‌ని కాద‌ని ఐసీసీ తేల్చి చెప్పింది. బంగ్లాకు జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చేందుకు పాక్ ఈ ఆఫ‌ర్ పెట్టింది. అంతేకాదు.. తాము భార‌త్ తో సిరీస్ లు (ద్వైపాక్షిక‌) ఆడేలా కూడా చూడాల‌ని కోరింది. కానీ, దీనికి ఐసీసీ త‌మ చేతుల్లో ఏమీ లేద‌ని చెప్పింది. ఈ క్ర‌మంలోనే టి20 ప్ర‌పంచ‌క‌ప్ బాయ్ కాట్ తో బంగ్లాకు త‌లెత్తిన ఇబ్బందిని పూడ్చేందుకు అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ అవ‌కాశం ఇచ్చేందుకు ఆలోచ‌న చేయ‌నుంది.

భార‌త్ డిఫెండింగ్ చాంపియ‌న్ గా..

బంగ్లాకు ఒక దేశంగానే కాదు.. ఒక క్రికెట్ జ‌ట్టుగానూ బ‌తుకినిచ్చింది భార‌త్. ఆ దేశ తొలి టెస్టు మ్యాచ్ భార‌త్ తోనే ఆడింది. కానీ, అకార‌ణంగా భార‌త్ పైన ద్వేషం పెంచుకుని టి20 ప్ర‌పంచ క‌ప్ బాయ్ కాట్ వ‌ర‌కు వెళ్లింది. అయితే, ఆ దేశం ఏం చేసినా.. భార‌త్ నీడ నుంచి బ‌య‌ట‌ప‌డ‌దు. అదెలాగంటే.. ఒక‌వేళ 2028 అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఆతిథ్య హ‌క్కులు బంగ్లాకు ద‌క్కాయే అనుకుందాం..! అప్పుడు డిఫెండింగ్ చాంపియ‌న్ గా భార‌త్ ఆ టోర్నీలో అడుగు పెట్ట‌నుంది.

Tags:    

Similar News