ఇంతోటి దానికి అంత రాద్ధాంతం అవసరమా.. జోకరైన పాకిస్థాన్!

నిజంగా తమకు ఏమి కావాలో తమకైనా తెలుసో లేదో తెలియదు కానీ..;

Update: 2026-02-10 04:01 GMT

నిజంగా తమకు ఏమి కావాలో తమకైనా తెలుసో లేదో తెలియదు కానీ.. ప్రపంచవ్యాప్తంగా తాము ఫేమస్ అవ్వాలని, తమ గురించి ప్రపంచం చర్చించుకోవాలని, బలవంతంగా గౌరవాలు పొందాలని భావిస్తుందో ఏమో కానీ.. పాకిస్థాన్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముందు చేసిన హడావిడి, ఇచ్చిన మొండి పట్టుదల బిల్డప్ లు, బంగ్లాదేశ్ కోసం తాము ఎంతకైనా సిద్ధమనే వ్యాఖ్యలు చల్లారిపోయాయి! ఐసీసీ కాస్త గట్టిగా నిలబడి డెడ్ లైన్ విధించే సరికి పాక్ తగ్గక తప్పలేదు.. భారత్ తో మ్యాచ్ కు సిద్ధమైంది!

అవును... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత.. పాకిస్థాన్ ప్రభుతం తన ప్రతిపాదిత బహిష్కరణ విషయం నాటకీయంగా మలుపు తిరిగింది. పీసీబీ, బీసీబీ అధికారులతో ఐసీసీ సమావేశం అనంతరం క్లారిటీ వచ్చింది. దీంతో... ఫిబ్రవరి 15న భారత్ తో జరగనున్న మ్యాచ్ లో తాము పాల్గొంటామని పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో... టీ20 ప్రపంచ కప్ - 2026లో భారత్ – పాక్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. దీంతో.. అటు శ్రీలంక బోర్డు హ్యాపీ ఫీలవుతుంది.

ఈ సందర్భంగా పాకిస్థాన్ సర్కార్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. ఈ సందర్భంగా... బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈతో సహా స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలు.. ఈ బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసమ్హరించుకోవాలనే తమ ప్రభుత్వ నిర్ణయంపై ప్రభావం చూపిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇదే క్రమంలో.. క్రికెట్ క్రీడా స్పూర్తిని కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం అని ప్రకటించడం గమనార్హం.

మరోవైపు... ప్రపంచకప్ కు దూరం కావడంతో బంగ్లాదేశ్ కు కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు పాకిస్థాన్ ఓ కీలక ప్రతిపాదన చేసింది. ఇందులో భాగంగా.. భారత్ - పాక్ - బంగ్లాదేశ్ లతో ముక్కోణపు సీరిస్ ను నిర్వహించాలని డిమాండ్ చేసింది. అయితే.. ఈ డిమాండ్ ను ఐసీసీ తిరస్కరించింది. ఇదే సమయంలో.. భారత్ తో దైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకూ పీసీబీ డిమాండ్ చేయగా... అది తమ పరిధి బయట ఉన్న విషయమని ఐసీసీ తేల్చి చెప్పింది. కాకపోతే.. ఈ టోర్నీలో ఆడేందుకు తిరస్కరించినందుకు బంగ్లాపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని మాత్రం స్పష్టం చేసింది.

దీంతో... ఐసీసీ చర్చలు.. శ్రీలంక బోర్డు విజ్ఞప్తులు.. బంగ్లాదేశ్, యూఏఈ వంటీ దేశాల సలహాల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు, ప్రభుత్వానికి క్రికెట్ క్రీడా స్పూర్తి గుర్తుకువచ్చిందా అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. పైగా ఐసీసీ ముందు పాక్ పెట్టిన డిమాండ్లలో.. బంగ్లాదేశ్ పై ఎలాంటి ఆంక్షలు విధించబోమనే విషయానికి అంగీకరించడం మినహా మరే విషయంలోనూ ఐసీసీ ఆమోదం తెలపలేదని అంటున్నారు. దీంతో.. ఇంతోటి దానికి అంత రాద్ధాంతం అవసరమా, ప్రపంచం ముందు జోకరవ్వడం కాకపోతే అంటూ పీసీబీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు!

Tags:    

Similar News