సిరాజ్.. యూసుఫ్‌గూడ పోలీస్ అకాడమీ నుంచి.. ఒక్క రోజులో జట్టులోకి?
టి20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కని సిరాజ్ దేశవాళీలు ఆడుతున్నాడు. హైదరాబాద్ లో గత నెల 29న ప్రారంభమైన ఛత్తీస్ గఢ్‌తో రంజీ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు.;
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంతో ప్రోత్సహిస్తున్న యువ పేస్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా సరిగ్గా ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు గాయంతో దూరకావడం చిన్న కుదుపు..! ఇంతలోనే మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ తో అమెరికాతో తొలి మ్యాచ్ కు అందుబాటులో లేకుండా పోయాడు. మరి.. హర్షిత్ ప్లేస్ లో ఎవరు అనుకుంటూ ఉంటే, సెలక్టర్లు అనూహ్యంగా సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు పిలుపునిచ్చారు. వాస్తవానికి ఈ పిలుపు కాస్త వింతనే అనుకోవాలి. ఎందుకంటే..హర్షిత్ పేస్ ఆల్ రౌండర్. సిరాజ్ మాత్రం కేవలం పేస్ బౌలర్. అతడి స్థానంలో ఇతడిని ఎలా తీసుకున్నారో సెలక్టర్లే చెప్పాలి. దీనిని పక్కనపెడితే, సిరాజ్ తుది జట్టులో ఉంటాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. టీమ్ ఇండియా టెస్టు, వన్డే జట్లలో రెగ్యులర్ అయినప్పటికీ టి20లకు మాత్రం అతడిని పరిగణించడం లేదు. 2024లో జరిగిన టి20 ప్రపంచ కప్ జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ లు ఆడించలేదు. ఇప్పుడేమో హర్షిత్ రాణా ప్లేస్ ను రీప్లేస్ చేశారు. అదే సమయంలో బుమ్రా జ్వరంతో దూరం కావడం సిరాజ్ ను టి20 ప్రపంచ కప్ తుది జట్టులో చోటు దక్కేలా చేసింది. దీనికి సరైన న్యాయమే చేశాడు అతడు.
హైదరాబాద్ నుంచి ముంబైకి..
టి20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కని సిరాజ్ దేశవాళీలు ఆడుతున్నాడు. హైదరాబాద్ లో గత నెల 29న ప్రారంభమైన ఛత్తీస్ గఢ్‌తో రంజీ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు. ఇక ఎలాగూ జట్టులో లేను కదా? అని అతడు ప్రాక్టీస్ చేసుకోసాగాడు. ఇంతలోనే రారమ్మంటూ పిలుపు వచ్చింది. ఇది టీమ్ మేనేజ్మెంట్ ప్లస్ సెలక్టర్లు అతడిపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. చాలాకాలంగా టి20 జట్టులో లేనప్పటికీ సిరాజ్ హార్డ్ వర్క్ పై నమ్మకంతో అతడిని అప్పటికప్పుడు ప్రపంచ కప్ జట్టులో చేర్చడమే దీనికి నిదర్శనం. హర్షిత్ స్థానంలో ఎంపిక చేశారని తెలియగానే హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లి టీమ్ ఇండియాతో కలిశాడు సిరాజ్.
ఒక్క రోజులో గ్రౌండ్ లోకి..
హర్షిత్ కు గాయమైందని ఈ నెల 4న తెలిశాక సిరాజ్ ను ఎంపిక చేశారు. ఇక గత నెల 29న మొదలైన హైదరాబాద్ రంజీ మ్యాచ్ (4 రోజులు).. ఈ నెల 1 వరకు జరిగింది. అందులో ఆడిన సిరాజ్ కు 4న లేదా 5న కబురు అంది ఉంటుంది. అనంతరం గంటల వ్యవధిలో అతడు టీమ్ఇండియాకు చేరకున్నాడు. 7న అమెరికాతో మ్యాచ్ లో బౌలింగ్ దాడిని ప్రారంభించాడు.
పడగొట్టాడు.. నిలిపాడు..
అమెరికాతో మ్యాచ్ లో భారత బ్యాటింగ్ విభాగం విఫలమైంది. 160 పరుగుల మోస్తరు స్కోరు చేసింది. దీనిని కాపాడుకోవాలంటే మొదట్లోనే అమెరికా వికెట్లు పడగొట్టాలి. సరిగ్గా ఇదే పనిచేశాడు సిరాజ్. ప్రత్యర్థి ఓపెనర్లు గౌస్, సాయితేజ ముక్కామలను మొదట్లోనే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నిలదొక్కుకుని ఆడుతున్న శుభమ్ రంజానే (22 బంతుల్లో 37)ను ఔట్ చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి టీమ్ ఇండియా గెలుపులో భాగమయ్యాడు మన హైదరాబాదీ.