టీ20 ప్రపంచకప్.. పాకిస్థాన్ ఏం ట్రై చేస్తోంది?
ఐతే అనూహ్య పరిణామాల మధ్య ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడమంటూ మొండికేసింది పాకిస్థాన్.;
ఏఐసీసీ టోర్నీ జరిగినా.. అందరి దృష్టీ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మీదే ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయిన నేపథ్యంలో ఐసీసీ టోర్నీలు లేదా ఆసియా కప్‌లో రెండు జట్లు తలపడితే అందరూ ఎంతో ఉత్కంఠగా ఆ మ్యాచ్‌లు చూస్తారు. ఐతే అనూహ్య పరిణామాల మధ్య ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడమంటూ మొండికేసింది పాకిస్థాన్. వారం ముందే ఈ ప్రకటన చేయడంతో ఈసారి చిరకాల ప్రత్యర్థుల పోరు ఉండదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.
కానీ గత రెండు మూడు రోజుల్లో పరిణామాలు చూస్తుంటే.. ఈ మ్యాచ్ ఉంటుందేమో అనిపిస్తోంది. ఈ మ్యాచ్ జరగకపోతే తమకు వాటిల్లే నష్టం గురించి భయపడి పాకిస్థానే మెట్టు దిగేలా కనిపిస్తోంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే ఓవరాల్‌గా నష్టం వేల కోట్లలోనే ఉంటుందట. ఐతే ముందుగా బ్రాడ్‌కాస్టర్ రూ.300 కోట్లకు పైగానే నష్టపోతుంది. వాళ్లు లీగల్ యాక్షన్ తీసుకోవడం ఖాయం. ఆ మొత్తం నష్టాన్ని పాకిస్థానే భరించాల్సి ఉంటుందంటున్నారు. అదే జరిగితే పాకిస్థాన్ బోర్డు సంక్షోభంలో పడుతుంది. ఇది కాక వేరే దుష్పరిణామాలను కూడా ఆ దేశ క్రికెట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఆ దేశ క్రికెట్టే కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే పాక్.. ఇండియాతో మ్యాచ్ ఆడాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఒకసారి ఆడము అని చెప్పి, మళ్లీ నిర్ణయాన్ని మార్చుకుంటే పాకిస్థాన్ పరువు పోతుంది. అందుకే ఐసీసీ, బీసీసీఐ తమను అడుక్కుంటే ఆడాము అనిపించుకోవడానికి పాక్ ట్రై చేస్తున్నట్లుంది. ఖ్వాజా అని ఐసీసీలో సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించే ముస్లిం వ్యక్తిని తమ దేశానికి రప్పించుకుని.. ఐసీసీ తమతో రాయబారాలు చేస్తున్నట్లుగా మీడియాకు కలరింగ్ ఇస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ ఆడండి, మేం నష్టపోతాం అంటూ శ్రీలంక బోర్డు పాకిస్థాన్‌కు లేఖ రాయగా.. ఇది కూడా పాక్ బోర్డు పనే అని ప్రచారం జరుగుతోంది. నిర్ణయాన్ని మార్చుకుంటే శ్రీలంక కోసం తాము వెనక్కి తగ్గినట్లు చెప్పుకోవడానికి కూడా ఈ అస్త్రాన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది.
ఐతే ఈ వ్యవహారంలో బీసీసీఐ ఏమీ పట్టనట్లు లైట్ తీసుకుని ఉండిపోయింది. ఐసీసీ మాత్రం పాక్‌ను ఈ మ్యాచ్ ఆడమంటోంది కానీ.. ఆ దేశాన్నేమీ బతిమాలట్లేదు. ఐతే ఈ మ్యాచ్ ఆడాలంటే ఇలా చేయాలి అలా చేయాలి అని ఐసీసీ ప్రతినిధికి పాక్ కండిషన్లు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ ప్రతినిధి ఏమంటాడో కానీ.. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా వాటికి ఆమోద ముద్ర వేయడం కష్టమే. ఐతే ఎవరి షరతులకు ఎవరు ఒప్పుకుంటారో కానీ.. చివరికి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ మాత్రం జరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి.