డేంజర్ లో సచిన్ ఆల్ టైమ్ రికార్డు..13 వేలు దాటేశాడు..మరో రెండేళ్లే?
15,921... టెస్టుల్లో క్రికెట్ దేవుడు, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పరుగులు ఇవి.;

15,921... టెస్టుల్లో క్రికెట్ దేవుడు, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పరుగులు ఇవి. 24 ఏళ్ల కెరీర్ లో సచిన్ 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో ఈ మార్క్ ను చేరుకున్నాడు. కనీసం ఎవరూ ఊహించని రికార్డు ఇది. కొండను మించిన ఈ రికార్డును చేరుకునే సత్తా ఉందని చాలామంది పేర్లు గతంలో బయటకు వచ్చాయి. సచిన్ తరం వారు కాకుండా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్, టీమ్ ఇండియా గ్రేట్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో దశలో సచిన్ రికార్డు సాధించగల సత్తా ఉన్నవారిగా పేరు తెచ్చుకున్నారు.
కేవలం 33 ఏళ్లకే 162 టెస్టులు ఆడిన కుక్ (12,472) అయితే సచిన్ రికార్డు అందుకోవడమే మిగిలింది అనుకున్నారు. కానీ, అతడు అనూహ్యంగా 2018లోనే రిటైర్ అయిపోయాడు.
స్టీవ్ స్మిత్ కూడా ఓ దశలో దూసుకొచ్చాడు. కానీ, 2018 నాటి శాండ్ పేపర్ కుంభకోణంతో వెనుకబడిపోయాడు. గత ఏడాదే 10 వేల పరుగుల మైలురాయి దాటాడు. 10,271 పరుగుల వద్ద ఉన్నాడు. 35 ఏళ్ల స్మిత్ మరొక రెండేళ్లు ఆడతాడేమో?
123 టెస్టులు ఆడిన కోహ్లి కనీసం పదివేల మార్క్ ను కూడా చేరలేదు. 9230 వద్దనే ఉండిపోయాడు. చివరకు ఇటీవల రిటైర్మెంట్ ఇచ్చేశాడు.
105 టెస్టులు ఆడిన విలియమ్సన్ 9,276 పరుగుల వద్ద ఉన్నాడు. విలియమన్స్ 34 ఏళ్ల వాడే అయినా.. ఇటీవల తరచూ గాయాల బారినపడుతున్నాడు. ఫామ్ లో ఉన్నప్పటికీ గాయాలు అతడిని వెనక్కులాగుతున్నాయి.
ఇక మిగిలింది ఎవరు?
కోహ్లి, స్మిత్, విలియమ్సన్.. వీరి సమకాలికుడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్. ఫ్యాబ్ 4గా ముద్రపడిన వీరిలో కోహ్లి టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. 2008 అండర్ 19 ప్రపంచ కప్ జట్ల సభ్యులైన ఈ నలుగురూ అటుఇటుగా ఒకేసారి జాతీయ జట్లలోకి వచ్చారు.
ఇప్పుడు అసలు విషయం ఏమంటే రూట్.. సచిన్ రికార్డుకు గురిపెట్టేశాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న అతడు జింబాబ్వేతో జరుగుతున్న టెస్టులో 13 వేల మార్క్ ను దాటేశాడు. అంటే సచిన్ కు కేవలం 2915 పరుగులు మాత్రమే దూరం.
34 ఏళ్ల రూట్ వన్డేలు పరిమితంగానే ఆడుతున్నాడు. మరో మూడేళ్లు టెస్టుల్లో కొనసాగుతున్నాడు. గత ఏడాది ఏకంగా 1,556 పరుగులు చేశాడు. ఈ జో’రూట్’కు ఇండియాతో వచ్చే నెల నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఇంకా మంచి అవకాశం. ఈ నేపథ్యంలో అతడు రెండేళ్లలో సచిన్ రికార్డును దాటేసినా ఆశ్చర్యం లేదు.
సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. రూట్ 153వ టెస్టు ఆడుతున్నాడు. ఫామ్ ను కొనసాగిస్తే అతడు 174 టెస్టులకే 16 వేల పరుగులకు చేరొచ్చేమో? అదే జరిగితే 16 వేల టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ గా చరిత్రలో నిలుస్తాడు. మన సచిన్ ను మించినవాడు అనిపించుకుంటాడు.
కొసమెరుపు: క్రికెట్ దేవుడు సచిన్ తో పోలిక ఎవరికీ మేలు చేయలేదు అనే సంప్రదాయం ఉంది. కుక్, కోహ్లి, స్మిత్ ఇలా వీరంతా సచిన్ రికార్డుకు పోటీ వచ్చి వెనక్కువెళ్లినవారే. మరి రూట్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.