ఒలింపిక్స్ ముంగిట అమెరికా క్రికెట్ కు షాక్..సభ్యత్వంపై ఐసీసీ వేటు
దాదాపు 80 శాతం భారత సంతతి ఆటగాళ్లతో ఇప్పుడిప్పుడే మంచి జట్టుగా ఎదుగుతున్న అమెరికా కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఊహించని షాక్ ఇచ్చింది.;
దాదాపు 80 శాతం భారత సంతతి ఆటగాళ్లతో ఇప్పుడిప్పుడే మంచి జట్టుగా ఎదుగుతున్న అమెరికా కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఊహించని షాక్ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది...గత ఏడాది ఏకంగా టి20 ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చిన (కరీబియన్ దీవులతో కలిపి) అమెరికా ఆ టోర్నీలో సూపర్ 8 దశకు కూడా చేరి సంచలనం రేపింది. ఈ గ్రూప్ లో ఉన్న టీమ్ ఇండియాతో కలిపి సూపర్ 8కు వెళ్లింది. ఈ క్రమంలో ఇదే గ్రూప్ లో ఉన్న మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను కూడా ఓడించింది. కెనడాపైన కూడా గెలిచింది. టీమ్ ఇండియాను కూడా కాస్త ఇబ్బంది పెట్టింది. మొత్తం 15 మంది జట్టుకు భారతీయుడైన మోనక్ పటేల్ కెప్టెన్ కావడం విశేషం. సౌరభ్ నేత్రవాల్కర్ వంటి భారత దేశవాళీ క్రికెట్ ఆడిన ఆటగాడు కూడా జట్టులో సభ్యుడుగా ఉన్నాడు.
2028 ప్రపంచ కప్ లో క్రికెట్
2028లో ఒలింపిక్స్ కు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ దేశంలో లాస్ ఏంజెలిస్ నగరంలో జరిగే ఒలింపిక్స్ లో టి20 ఫార్మాట్ లో క్రికెట్ ను మళ్లీ ప్రవేశపెట్టారు. 1900 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ ఇదే తొలిసారి. అంటే 128 ఏళ్ల అనంతరం అన్నమాట. పురుషులు, మహిళల క్రికెట్ జట్లు కూడా పాల్గొననున్న ఈ ఒలింపిక్స్ కు అమెరికా ఆతిథ్య దేశం హోదాలో నేరుగా అర్హత పొందుతుంది. అయితే, ఇలాంటి సమయంలో యూఎస్ఏ క్రికెట్ కు ఐసీసీ సభ్యత్వం సస్పెండ్ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చే నిర్ణయంగా ప్రకటించింది.
కారణం ఏమిటబ్బా..?
ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలకు ఉన్న సంఘమే ఐసీసీ. దీంట్లో కొన్ని సభ్య దేశాలు, కొన్ని అనుబంధ సభ్య దేశాలు ఉంటాయి. అయితే, ఇవన్నీ ఐసీసీ రూల్స్ అమలు చేయాలి. కానీ, అందులో యూఎస్ఏ క్రికెట్ విఫలం కావడంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ లో రాజకీయ జోక్యాలను ఐసీసీ సహించదు. కానీ, అమెరికాపై వేటు వెనుక యూఎస్ఏ ఒలింపిక్, పారాలింపిక్స్ కమిటీ గుర్తింపు కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ఫలితాలు ఆశించిన మేర లేవని.. దీంతో అమెరికా క్రికెట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ప్రభావం తీవ్రంగా ఉంటుందా..
ఐసీసీ సస్పెన్షన్ తాత్కాలికమే అనుకోవాలి. గతంలో శ్రీలంక బోర్డులో రాజకీయాల కారణంగా ఆ దేశానికి సభ్యత్వం నిలిపివేసినా పునరుద్ధరించింది. ఇప్పుడు అమెరికా కాబట్టి ఇంకా కఠినంగా వ్యవహరించకపోవచ్చు. పైగా 2028లో ఒలింపిక్స్ ఉన్నాయి. వీటితో పాటు ఐసీసీ టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ తాజా సస్పెన్షన్ లో చిన్న ఊరట ఇచ్చింది. అంటే మ్యాటర్ అంత సీరియస్ కాదని తెలుస్తోంది. ఏది ఏమైనా వివాదాన్ని సరిదిద్దుకుంటే అమెరికా క్రికెట్ కు మంచి భవిష్యత్ ఉంటుంది.