మనోడి చేతిలో ఓటమి తట్టుకోలేక పిడికిలితో చెస్ బోర్డు టేబుల్ కొట్టేశాడు
క్లాసికల్ చెస్ పోటీల్లో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే చెస్ ప్రపంచంలో సంచలనాల్ని క్రియేట్ చేస్తున్న మనోడు గుకేశ్ తాజాగా మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.;
క్లాసికల్ చెస్ పోటీల్లో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే చెస్ ప్రపంచంలో సంచలనాల్ని క్రియేట్ చేస్తున్న మనోడు గుకేశ్ తాజాగా మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతగాడి చేతిలో ప్రపంచ చెస్ దిగ్గజాల్లో ప్రముఖుడు మాగ్నస్ కార్లసన్ ఓటమిపాలయ్యారు. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానికి నిదర్శనంగా ఈ పోటీని చెప్పొచ్చు. తాజా విజయంతో తొలి రౌండ్ లో ఎదురైన ఓటమికి సరైన బదులు తీర్చుకున్నట్లైంది. ఈ పోటీ సందర్భంగా చోటు చేసుకున్న ఒక పరిణామం కార్లసన్ ఓటమికి మించి వైరల్ అవుతోంది.
అదేమంటే.. గుకేశ్ చేతిలో ఓటమిని భరించలేని కార్ల్ సన్ తన పిడికిలితో ఒక్కసారిగా చెస్ బోర్డు టేబుల్ ను గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే తన తప్పును గుర్తించిన అతను.. గుకేశ్ కు రెండుసార్లు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓడిన కార్ల్ సన్ మాత్రమే కాదు.. ఈ పోటీలో గెలిచిన గుకేశ్ సైతం షాక్ లోనే ఉన్నాడు. ప్రపంచ చెస్ చరిత్రలో మేటి ఆటగాడైన కార్ల్ సన్ ను ఓడించిన గుకేశ్ కొన్ని సెకన్ల పాటు ఆ షాక్ లోనే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నార్వే చెస్ టోర్నీలో భాగంగా ఆరో రౌండ్ లో తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేశ్ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా నిలబడ్డాడు. కార్ల్ సన్ చేసిన తప్పిదాన్ని అద్భుతంగా పట్టుకున్న గుకేశ్.. అతడి మీద పట్టు సాధించటమే కాదు.. అనూహ్య రీతిలో ఓటమిపాలు చేశాడు. ప్రపంచ నంబరు మూడో స్థానంలో ఉన్న గుకేశ్.. ప్రపంచ చాంపియన్ ను ఓడించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
సొంతగడ్డ మీద జరిగిన మ్యాచ్ లో మాగ్నస్ పైచేయి సాధించినప్పటికీ.. ఒత్తిడి చిత్తు చేస్తూ గుకేశ్ తన ఆటను డిఫెన్స్ లో ఆడి.. చివర్లో ప్రత్యర్థిని బోల్తా కొట్టించిన వైనం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఇదే టోర్నీలో కార్ల్ సన్ ను భారత్ కు చెందిన చెస్ స్టార్ ప్రజ్ఞానంద ఓడించటం తెలిసిందే. 19 ఏళ్ల గుకేశ్.. 34 ఏళ్ల మాగ్నమ్ కార్ల్ సన్ ను ఓడించిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. నార్వే చెస్ టోర్నమెంట్ లో వినియోగించే టైం కంట్రోల్ కారణంగా కార్ల్ సన్ ఒత్తిడికి గురయ్యాడు. ఆట చివర్లో ఒక తప్పిదం చేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న గుకేశ్ దాన్ని సద్వినియోగం చేసుకొని తిరుగులేని కౌంటర్ అటాక్ తో కార్ల్ సన్ ను కంగుతినిపించాడు.
ఈ టోర్నీలో మొదటి రౌండ్ లో గుకేశ్ ను కార్ల్ సన్ ఓడించగా.. తాజా విజయంతో బదులు తీర్చుకున్నట్లైంది. ఈ టోర్నీలో మొదటి రెండు రౌండ్లలో గుకేశ్ కు ఓటమి ఎదురైంది. మొదటి రౌండ్ లో కార్ల్ సన్.. రెండో రౌండ్ లో అర్జున్ ఎరిగైసీ చేతిలో ఉంటారు. అయితే.. తన 19వ పుట్టిన రోజైన మే29న హికారు నకమురా (అమెరికా) విజయం సాధించటం ద్వారా తన ఫామ్ ను తిరిగి తెచ్చుకున్న గుకేశ్.. తాజా పోటీలో కార్ల్ సన్ ను ఓడించటం ద్వారా అతను మరింత మానసిక బలాన్ని సొంతం చేసుకున్నట్లుగా చెప్పాలి. తాజా గెలుపుతో ఈ టోర్నమెంట్ టైటిల్ రేసు మరింత ఆసక్తికరంగా మారినట్లుగా చెప్పక తప్పదు.
ఇదే టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి.. ప్రపంచ నెంబర్ 2 హికర నకమురపై విజయం సాధించారు. ప్రస్తుత టోర్నీలో కార్ల్ సన్ ఆరు రౌండ్లలో రెండు విజయాలు.. ఒక ఓటమి.. మూడు డ్రాలతో 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఫాబియానో కరువానా ఉండగా.. తాజా విజయంతో గుకేశ్ మూడోస్థానంలోకి వచ్చాడు. మొత్తంగా చెస్ ప్రపంచంలో గుకేశ్ సాధించిన తాజా విజయం సంచలనంగా మారింది.