వన్డేల్లో అతిభారీ తేడాతో ఓడిన టెస్టు చాంప్.. భారత రికార్డు బ్రేక్
తాజా వన్డేలో దక్షిణాఫ్రికా 342 పరుగుల తేడాతో ఓడింది. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత పెద్ద తేడాతో ఓడిన జట్టు సఫారీలే.;
మొదటి రెండు వన్డేల్లో ప్రత్యర్థిని చిత్తుచేసిన ధీమానో... ఏమో కానీ.. టెస్టు చాంపియన్ జట్టు వన్డేల్లో అత్యంత భారీ తేడాతో ఓడిన జట్టుగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి ఆటగాళ్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో చెలరేగిన పిచ్ పై కనీసం 70 పరుగులు చేయడానికి కూడా కష్టపడింది. ఏకంగా 342 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఒక్కరంటే ఒక్కరు నిలవలే...
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ ను తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడించి మూడు వన్డేల సిరీస్ ముందే గెలిచేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లండ్.. ఓపెనర్ జేమీ స్మిత్ (62), వికెట్ కీపర్ బ్యాటర్ బట్లర్ (62) చెలరేగడం, స్టార్ బ్యాట్స్ మన్ జోరూట్ (100), ఆల్ రౌండర్ జాకబ్ బెతెల్ (110) సెంచరీలతో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 414 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, 7వ నంబరు వరకు అద్భుతమైన బ్యాటర్లు ఉన్న దక్షిణాఫ్రికా ఈ స్కోరును బీట్ చేస్తుందని భావిస్తే కేవలం 72 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కార్బిన్ బాష్ (20) టాప్ స్కోరర్. స్టబ్స్ (16), కేశవ్ మహరాజ్ (17) మాత్రమే డబుల్ డిజిట్ దాటారు. ఇంగ్లండ్ ఏస్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (4/18) ధాటికి సఫారీలు చేతులెత్తేశారు. మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో దక్షిణాఫ్రికానే నెగ్గింది.
శ్రీలంకను మించి...
తాజా వన్డేలో దక్షిణాఫ్రికా 342 పరుగుల తేడాతో ఓడింది. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత పెద్ద తేడాతో ఓడిన జట్టు సఫారీలే. గతంలో భారత్ చేసితో శ్రీలంక 317 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంటే.. వన్డేల్లో భారీ మెజారీటీతో గెలిచన జట్టుగా భారత్ కు ఉన్న రికార్డు ఇంగ్లండ్ ఖాతాలో చేరింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మన్ మార్కరమ్ డకౌట్ కాగా.. ఇటీవల రాణిస్తున్న ముల్డర్ కూడా ఖాతా తెరవలేదు. కెప్టెన్ బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో 9 వికెట్లకే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.
ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానంలో మూడు నెలల కిందట జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో దక్షిణాఫ్రికా.. వన్డే ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.