ధోనీ.. ఇంపాక్ట్ ప్లేయర్? చెన్నై కీపర్ గా తెలుగు కుర్రాడు

2004 మధ్యలో టీమిండియాకు ఎంపికయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు

Update: 2024-03-22 11:02 GMT

సరిగ్గా 20 ఏళ్ల కిందటి మాట.. ఆస్ట్రేలియాకు గిల్ క్రిస్ట్, దక్షిణాఫ్రికాకు మార్క్ బుచర్, ఇంగ్లండ్ కు స్టివార్ట్, శ్రీలంకకు కుమార సంగక్కర, పాకిస్థాన్ కు కమ్రాన్ అక్మల్.. ప్రపంచంలో ఏ జట్టుకు చూసినా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించగల వికెట్ కీపర్లు ఉన్నారు. మరి మేటి జట్టయిన భారత్ కు..?? వన్డేల్లో రాహుల్ ద్రవిడ్ ను వికెట్ల వెనుక నిలపాల్సిన పరిస్థితి.. టెస్టులకు వచ్చేసరికి గతంలో భారత వికెట్ కీపర్ అంటే 20 పరుగులు చేస్తే గొప్ప.. ఇక మన దేశానికి ఓ గిల్ క్రిస్ట్ లాంటి కీపర్ దొరకడా..? ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల మొనగాడు దొరకడా? అంటూ అభిమానులు తీవ్రంగా వేదన చెందేవారు. అలాంటి సమయంలో వచ్చాడో కెరటం..

20 ఏళ్లుగా తనదైన ముద్ర

2004 మధ్యలో టీమిండియాకు ఎంపికయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. బహుశా సచిన్ టెండూల్కర్ తర్వాత టీమిండియాలోకి ఒకసారి వచ్చాక వేటు పడని క్రికెటర్ ధోనీనే ఏమో? అతడు మన దేశానికి రెండు ప్రపంచ కప్ లు (2007 టి20, 2011 వన్డే) అందించాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. టెస్టుల్లోనూ నంబర్ వన్ గా నిలిపాడు. అలాంటి ధోనీ ఇప్పడు కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. గురువారం ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదులుకున్నాడు. ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Read more!

ఇదే చివరి సీజన్..? కీపర్ గా తెలుగోడు

ధోనీ క్రికెట్ మైదానంలో కనపడడం ఇదే చివరిసారేమో? అందుకే చెన్నై కెప్టెన్సీని వదులుకున్నాడని అనిపిస్తోంది. కాగా, ఐపీఎల్ లో అతడు ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా ఆడతాడనే కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే.. చెన్నై వికెట్ కీపర్ ఎవరు? దీని సమాధానం తెలంగాణకు చెందిన యువ ఆటగాడు అవనీశ్ ఆరవల్లి. మినీ వేలంలో ఇతడిని సీఎస్కే తీసుకుంది. ధోనీ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బ్యాటింగ్‌ చేసి.. కీపింగ్‌ ను అవనీశ్ కు అప్పగించే చాన్సుంది. యువ టాలెంట్‌ ను ప్రోత్సహించడంలో ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ఈ లెక్కన అవనీశ్ కు మంచి చాన్స్ దొరికింది. ఎడమచేతివాటం బ్యాటర్ అయిన అవనీశ్ ఇటీవలి అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ కు ఆడాడు. కాగా, ధోనీ, అవనీశ్ కాకుండా చెన్నైకి ఉన్న మరో కీపర్ కాన్వే. అయితే, ఇతడు గాయపడడంతో కొన్ని మ్యాచ్ లు ఆడడం లేదు.

Tags:    

Similar News