గుంట నఖ్వీ జిత్తులు... రహస్య ప్రాంతానికి ఆసియాకప్
మొదట దుబాయ్ లోని తన హోటల్ రూమ్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో స్థావరం మార్చాడు.;
దుబాయ్ లో సెప్టెంబరు 28న జరిగిన ఫైనల్లో టీమ్ ఇండియా గెలిచిన ఆసియా కప్ ఇప్పుడు ఎక్కడ ఉంది..? పెహల్గాం ఉగ్రదాడి కి నిరసనగా.. పాకిస్థాన్ ఆటగాళ్లతో చేతులు కలపకుండా ఫైనల్ సహా మూడు మ్యాచ్ లు ఆడి అన్నిట్లోనూ గెలిచిన మన జట్టు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ తో పాటు పాకిస్థాన్ జాతీయ ప్రభుత్వంలో మంత్రి కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి కప్ ను తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు ఎత్తుకెళ్లాడు. మొదట దుబాయ్ లోని తన హోటల్ రూమ్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో స్థావరం మార్చాడు.
అతడు గుంట నక్కే..
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయిన నఖ్వీ పెహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. అమాయక పర్యటకులపై పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తుపాకులతో హతమార్చిన ఘటనకు తమకు సంబంధం లేదన్నాడు. కానీ, పాక్ క్రికెటర్లు ఆసియా కప్ లో పెహల్గాం కాల్పులను ప్రతిబింబించేలా సంబరాలు జరుపుకొంటే సమర్థించాడు. పాక్ పేసర్ హారిస్ రవూఫ్ పెహల్గాం ఉగ్ర దాడుల కాల్పులను చూపేలా తుపాకీ కాల్పులతో సంబరం జరుపుకొని 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాకు గురైతే ఆ మొత్తం తాను వ్యక్తిగతంగా చెల్లిస్తానని నఖ్వీ అన్నాడు. అందుకే టీమ్ ఇండియా.. నఖ్వీ నుంచి ఆసియా కప్ అందుకోలేదు. దీంతో మొహంవాచిన నఖ్వీ.. కప్ ను ఎత్తుకెళ్లాడు.
నాలుగు వారాలుగా..
ఈ నెల 28కి ఆసియా కప్ ముగిసి నెల రోజులు అవుతుంది. కానీ, ఇప్పటికీ కప్ భారత జట్టు చెంతకు చేరలేదు. ఆసియా కప్ ముగిశాక సెప్టెంబరు 30న జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నాడు నఖ్వీ. అప్పుడు బీసీసీఐ అతడిని కప్ విషయమై నిలదీసింది. తాజాగా మెయిల్ కూడా పెట్టింది. నవంబరు మొదటివారంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం లేవనెత్తి నఖ్వీ పదవి పోగొట్టాలని భావిస్తోంది. నఖ్వీ ఇటీవల టీమ్ ఇండియా కెప్టెన్, బీసీసీఐ ప్రతినిధి తనవద్దకు వచ్చి కప్ ను తీసుకోవాలని సూచించాడు. కానీ, బీసీసీఐ తీవ్రంగా మండిపడింది. ఇప్పుడు వినవస్తున్న కథనాల ప్రకారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఉన్న కప్ ను నఖ్వీ అబుదాబిలోని గుర్తుతెలియని ప్రదేశానికి మార్చాడు.
ఇది ఎలా బయటపడింది అంటే..?
బీసీసీఐ అధికారి ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యాలయాన్ని సందర్శించగా... సిబ్బంది అక్కడినుంచి కప్ ను వేరేచోటకు మార్చినట్లు తెలిసింది. వాస్తవానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో కప్ ను ఉంచి తన అనుమతి లేకుండా ఎవరికీ ఇవ్వొద్దని అక్కడి సిబ్బందికి నఖ్వీ ఆదేశాలు జారీ చేశాడు. ఇంతలో బీసీసీఐ ఆగ్రహం చూసి అక్కడినుంచి కూడా మార్చినట్లు తెలుస్తోంది.
పరిష్కారం కాకపోగా మరింత వివాదాస్పదం
అసలు నఖ్వీ ఆసియా కప్ ను వేరొకరికి అప్పగించి టీమ్ ఇండియాకు ప్రదానం చేయమంటే సరిపోయేది. కానీ, తనతో పాటు ఎత్తుకెళ్లాడు. ఆపై ఇప్పుడు మళ్లీ ప్రదేశం మార్చాడు. దీంతో వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.