ఇప్పుడు చెప్పండి నేను తప్పు చేశానా?

Update: 2015-07-29 10:30 GMT
2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరిగా చప్పగా ముగిసింది. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు లేవంటూ ఢిల్లీ కోర్టు కేసు కొట్టేసింది. బీసీసీఐ మాత్రం నిషేధం తొలగించే ప్రసక్తే లేదంటోంది. కానీ శ్రీశాంత్ మాత్రం తనకు ఈ వ్యవహారంలో ఏ పాపం లేదంటున్నాడు. కోర్టులో ఏ వాదనలతో అయితే బయటపడ్డాడో ఆ వాదనలే బయటా వినిపిస్తున్నాడతను. తనపై వచ్చిన ఆరోపణలపై అతనేమంటున్నాడో చూడండి.

‘‘2013 మే 9న జరిగిన మ్యాచ్ లో నేను ఫిక్సింగ్ కు పాల్పడినట్లు.. బుకీలకు సహకరించినట్లు చెబుతున్నారు. ఐతే ఒక్క విషయం సూటిగా అడగదలుచుకున్నా. బుకీలతో ఒక ఓవర్లో 14 పరుగులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించారు. కానీ నేనిచ్చింది 13 పరుగులే. నాకు నిజంగా 14 పరుగులు ఇవ్వాలనుకుంటే ఓవర్ అంతా చెత్త బంతులు వేసేవాణ్ని కదా. కానీ ఆ ఓవర్లో ఒక్క వైడ్ కూడా పడలేదు. నోబాల్ వేయలేదు. స్లో బాల్ కూడా సంధించలేదు. తొలి నాలుగు బంతుల్లో వచ్చింది కేవలం ఐదే పరుగులు. నిజంగా నాకు బుకీలకు సహకరించే ఉద్దేశం ఉంటే అలా బౌలింగ్ చేస్తానా? అవతల గిల్ క్రిస్ట్ లాంటి విధ్వంసక బ్యాట్స్ మన్ ఉన్నాడు. అతను చివరి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టడం వల్ల 13 పరుగులు వచ్చాయి. లేదంటే అన్ని పరుగులూ సాధ్యమయ్యేవి కావు. నేను టవల్ నడుముకు చెక్కుకుని బుకీలకు సిగ్నల్ ఇచ్చానంటున్నారు. కానీ నేనెందుకు టవల్ పెట్టుకున్నానో ఆ రోజు డ్రెస్సింగ్ రూంలో అందరికీ తెలుసు. నేను కంటికి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నా. నుదుటిపైనుంచి చెమట వచ్చి కళ్లలోకి పోతే ఇబ్బందవుతుంది. అందుకే టవల్ వాడాను. నుదుటన బొట్టు ద్వారా కూడా సిగ్నల్స్ ఇస్తానంటున్నారు. కానీ నాకు మూఢ నమ్మకాలు ఎక్కువని.. తరచుగా బొట్టు పెట్టుకుంటానని జనాలకు తెలియదా?’’ అని ప్రశ్నించాడు శ్రీశాంత్. ఫిక్సింగ్ ఆరోపణలు, అరెస్టు భరించలేక తీహార్ జైల్లో ఉన్నపుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు శ్రీశాంత్ చెప్పాడు. త్వరలోనే తాను క్రికెట్ ఆడగలనని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News