రోమాలు నిక్కబొడుచుకునే టెన్నిస్‌ సమరం

Update: 2015-07-12 03:40 GMT
అసలే గ్రాండ్‌స్లామ్‌.. ఆపై వింబుల్డన్‌.. ఆపై స్విస్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెదరర్‌, ప్రస్తుత ప్రపంచ నెంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ మధ్య ఫైనల్‌ పోరు.. టెన్నిస్‌ అభిమానులకు ఇంతకంటే వినోదం ఏముంటుంది? అందుకే ఈ రోజు సాయంత్రం జరగబోయే మహా సమరం ఎంతో ప్రత్యేకం. మూణ్నాలుగేళ్లుగా ఈ ఇద్దరు ఆటగాళ్ల ఫామ్‌.. ముఖాముకి రికార్డు ప్రకారం చూస్తే.. ఈ మ్యాచ్‌లో జకోవిచే పైచేయి సాధించాలి. కానీ ఫెదరర్‌ గత కొన్ని రోజులుగా.. ముఖ్యంగా ఈ వింబుల్డన్‌లో ఆడుతున్న తీరు చూస్తుంటే మాత్రం పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

మొన్నటి సెమీఫైనల్లో ముర్రేతో ఫెదరర్‌ తలపడిన తీరు చూస్తే అందరికీ ఆశ్చరమే. గత మూడేళ్లలో ఫెదరర్‌ ఎన్నడూ ఇంత గొప్పగా ఆడింది లేదు. కెరీర్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన రోజుల్లో ఎలా ఆడేవాడో అలాగే కనిపించాడు రోజర్‌. ఆదివారం నాటి పోరులో ఫెదరర్‌ అదే స్థాయిలో చెలరేగిపోతే.. అతడి ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ జత కావచ్చు. టెన్నిస్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా 17 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడు రోజర్‌. ఐతే చివరి గ్రాండ్‌స్లామ్‌ గెలిచి మూడేళ్లవుతోంది. ఆ తర్వాత అతడి ఆటలో పదును తగ్గిపోవడంతో ఇక రిటైర్మెంటే తరువాయి అనుకున్నారు. కానీ ఇంకొక్క గ్రాండ్‌స్లామ్‌ గెలిచి రిటైరవుదామనుకున్నాడో ఏంటో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. తనకిష్టమైన వింబుల్డన్‌లో గత ఏడాది ఫైనల్‌ చేరాడు కూడా. కానీ జకోవిచే అతడికి అడ్డం పడ్డాడు. టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ఐతే ఈసారి మాత్రం ఫెదరర్‌ అంత తేలిగ్గా లొంగేలా లేడు. ఫెదరర్‌ పదోసారి వింబుల్డన్‌ ఫైనల్‌ ఆడుతుండటం విశేషం. అతడి ఖాతాలో ఏడు వింబుల్డన్‌ టైటిళ్లున్నాయి. తనకిష్టమైన మైదానంలో మరో టైటిల్‌ గెలవాలనుకుంటున్నాడు రోజర్‌.

ఐతే ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ టెన్నిస్‌ ప్లేయర్‌ జకోవిచే కాబట్టి.. అతణ్ని అంత తక్కువగా అంచనా వేయలేం. గత మూడేళ్లలో అందరికంటే అతనే అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ ఓడిన జకోవిచ్‌.. వింబుల్డన్‌ మాత్రం వదలొద్దని పట్టుదలతో ఉన్నాడు. ఫెదరర్‌తో ముఖాముఖి రికార్డులోనూ సమవుజ్జీగా ఉన్న జకోవిచ్‌.. తనకంటే ఐదేళ్లు పెద్దవాడైన రోజర్‌ను ఓడించగలననే విశ్వాసంతో ఉన్నాడు. ఎవరు గెలిచినా మ్యాచ్‌ మాత్రం హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి టెన్నిస్‌ ప్రియులెవ్వరూ ఈ మ్యాచ్‌ను మిస్సయ్యే ప్రసక్తే లేదు.
Tags:    

Similar News