మేం గలీజు ఆటే ఆడతామంటున్న ఆసీస్‌

Update: 2015-07-02 11:07 GMT
ఆస్ట్రేలియా జట్టు ఎంత గొప్ప విజయాలైనా సాధించనివ్వండి.. ఎన్ని ప్రపంచకప్పులైనా కొట్టనివ్వండి.. టెస్టుల్లో, వన్డేల్లో నెంబర్‌వన్‌ ర్యాంకులు సాధించనవివ్వండి.. కానీ మైదానంలో వాళ్ల ప్రవర్తన మాత్రం జుగుప్స కలిగించేలా ఉంటుందన్నది వాస్తవం. ప్రత్యర్థి ఆటగాళ్లను బూతులు తిట్టడం.. వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించి.. ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించడం.. ఇదీ వాళ్ల స్టయిల్‌. ప్రత్యర్థి ఆటగాళ్ల పెళ్లాల గురించి.. గర్ల్‌ఫ్రెండ్స్‌ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా ఫ్రెండ్లీగా మ్యాచ్‌ ఆడదాం.. స్నేహపూర్వకంగా ఉందాం అన్నా వారికి పట్టదు. ఇలా అంటే తమకింకా పట్టుదల పెరుగుతుందని.. స్లెడ్జింగ్‌ చేయకుంటే తమకు ఆట ఆడినట్లే ఉండదని సిగ్గూ ఎగ్గూ లేకుండా చెప్పుకుంటారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.

అందులోనూ ఆ జట్టు వికెట్‌ కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ అయితే మరీ టూమచ్‌. మొన్న ఆస్ట్రేలియాలో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు ఆతిథ్య జట్టు వికెట్‌ కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ ఏమన్నాడో చాలామందికి గుర్తుండే ఉంటుంది. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ చేతిలో తాము ఓడిపోయినపుడు ఆ జట్టు ఆటగాళ్లు తమను ఓదార్చడం.. షేక్‌ హ్యాండ్‌లు ఇవ్వడం తమకు భలే చికాకు తెప్పించిందన్నాడు హడిన్‌. తమతో అంత మంచిగా మాట్లాడటం నచ్చలేదన్నాడు. మైదానంలో ప్రత్యర్థుల పట్ల ఎప్పుడూ ధ్వేషంతోనే ఉండాలని చెప్పకనే చెప్పాడు హడిన్‌. ఇప్పుడు తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో యాషెస్‌ సిరీస్‌ మొదలవుతున్న నేపథ్యంలో హడిన్‌ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. తమ గలీజు ఆటలో ఏమార్పూ ఉండదని.. అదే తమ విజయ రహస్యమని గొప్పగా చెప్పుకున్నాడు. ''మైదానంలో మంచిగా, మెత్తగా ఉండటానికి మేమేం న్యూజిలాండ్‌ వాళ్లం కాదు. దూకుడుగా ఆడటం, స్లెడ్జింగ్‌ చేయడం మా శైలి. అలా చేస్తేనే మాకు మంచి ఫలితాలొస్తాయి. మా నుంచి మంచితనాన్ని ఆశించకండి. యాషెస్‌లో కూడా ఇలాగే ఆడతాం. కాబట్టి ఇంగ్లాండ్‌ జాగ్రత్త'' అని హెచ్చరించాడు హడిన్‌. ఐసీసీ క్రీడాస్ఫూర్తితో ఆడమంటుంది కానీ.. ఇలా మాట్లాడే వాళ్లను మాత్రం అలాగే విడిచిపెట్టేస్తుంది.. అదేం చిత్రమో!

Tags:    

Similar News