అండ‌ర్-19 ప్ర‌పంచక‌ప్ జ‌ట్టులో వైభ‌వ్ సూర్య‌వంశీ..2030లోనూ చాన్స్!

భార‌త క్రికెట్ కుర్ర సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ..! జ‌న‌వ‌రి 15 నుంచి న‌మీబియా, జింబాబ్వేల్లో జ‌రిగే అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో చోటు సంపాదించాడు.;

Update: 2025-12-28 07:30 GMT

భార‌త క్రికెట్ కుర్ర సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ..! జ‌న‌వ‌రి 15 నుంచి న‌మీబియా, జింబాబ్వేల్లో జ‌రిగే అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో చోటు సంపాదించాడు. శ‌నివారం ప్ర‌క‌టించిన ఈ జ‌ట్టుకు ముంబై బ్యాట్స్ మ‌న్ ఆయుష్ మాత్రే సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. 15 మంది స‌భ్యుల జ‌ట్టులో తెలుగు కుర్రాళ్లు ఎవ‌రూ లేర‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌పంచ‌కప్ లో భాగంగా వ‌చ్చే నెల 15న అమెరికాతో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. దీనికిముందు వ‌చ్చే నెల 3 నుంచి 7వ తేదీ మ‌ధ్య ద‌క్షిణాఫ్రికా అండ‌ర్ 19 జ‌ట్టుతో భార‌త కుర్రాళ్లు మూడు వ‌న్డేల సిరీస్ లో పాల్గొంటారు. ఈ సిరీస్ కు మాత్రేతో పాటు వైస్ కెప్టెన్ విహాన్ మ‌ల్హోత్రాలు గాయాల‌తో అందుబాటులో లేనందున వైభ‌వ్ కు కెప్టెన్సీ అప్ప‌గించ‌డం విశేషం. ప్ర‌పంచ క‌ప్ నాటికి ఆయుష్‌, విహాన్ కోలుకుని తిరిగి జ‌ట్టుతో చేర‌నున్నారు. కాగా, ఏజ్ గ్రూప్ టోర్నీ కాబ‌ట్టి నాలుగేళ్లకోసారి కాకుండా అండ‌ర్19 ప్ర‌పంచ క‌ప్ ను రెండేళ్లకోసారి నిర్వ‌హిస్తారు. ఈ లెక్క‌న 2026 త‌ర్వాత‌ 2028లో, 2030లో టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి. విశేషం ఏమంటే.. వైభ‌వ్ సూర్యవంశీకి 2028తో పాటు 2030లోనూ అండ‌ర్ 19 మెగా టోర్నీలో పాల్గొనే చాన్సుంది.

అమ్మాయిల్లో షెఫాలీలా...!

టీమ్ ఇండియా మ‌హిళ‌ల జ‌ట్టు స‌భ్యురాలు షెఫాలీ వ‌ర్మ‌. ఇటీవ‌లి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టైటిల్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ఈ అమ్మాయికి సంబంధించిన ఓ విశేషం ఉంది. అదేమంటే.. షెఫాలీ జాతీయ జ‌ట్టుకు ఆడి మ‌ళ్లీ వెన‌క్కు తిరిగివ‌చ్చి అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ ఆడింది. ఇది చెప్పుకోవ‌డానికి వింత‌గా అనిపించినా నిజం. షెఫాలీ కేవ‌లం 15-16 ఏళ్ల వ‌య‌సుకే మ‌హిళ‌ల జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చేసింది. దీంతో ఆమె వెన‌క్కువ‌చ్చి అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఆడింది.

ఇప్పుడు వైభ‌వ్ కూ అదే చాన్స్..

14 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ ఏడాది ఐపీఎల్ లో దుమ్మ‌రేపాడు. ఆడుతున్న మూడో మ్యాచ్ లోనే 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఆ త‌ర్వాత అంతా అత‌డి ప్ర‌భంజ‌న‌మే. తాజాగా విజ‌య్ హ‌జారే ట్రోఫీలో 190 ప‌రుగులు భారీ సెంచ‌రీ సాధించాడు. దీంతో అత‌డిని టీమ్ ఇండియా సీనియ‌ర్ జ‌ట్టులోకి తీసుకోవాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. వైభ‌వ్ కు వ‌చ్చే మార్చి 27తో 15 ఏళ్లు నిండుతాయి. దీంతో సీనియ‌ర్ జ‌ట్టులోకి ఎంపిక చేసేందుకు నిబంధ‌న‌లు అనుమ‌తిస్తాయి. ఇప్పుడు కాక‌పోయినా మ‌రో ఏడాదికైనా అత‌డిని సీనియ‌ర్ జ‌ట్టులోకి తీసుకుంటార‌ని భావించ‌వ‌చ్చు. అంటే.. స‌చిన్ త‌ర‌హాలో 16 ఏళ్ల‌కే దేశానికి ఆడే అరుదైన చాన్స్ రానుంది. అయితే, వైభ‌వ్ 2028లో జ‌రిగే అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ న‌కూ అర్హుడే. అప్ప‌టికి అత‌డికి కేవ‌లం 17 ఏళ్లు మాత్ర‌మే. ఒక‌వేళ జాతీయ జ‌ట్టుకు ఎంపికైనా వెన‌క్కువ‌చ్చి అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ ఆడొచ్చు.

2030లోనూ చాన్సుందా?

2028 త‌రువాత అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ 2030లో ఉంది. దీనికి కూడా వైభ‌వ్ కు చాన్సుందా? అంటే అనుమాన‌మే. కానీ, అవ‌కాశం లేద‌ని చెప్ప‌లేం. 2030 మార్చి 27తో అత‌డికి 19 ఏళ్లు నిండుతాయి. కాస్త ముందుగా ప్ర‌పంచ క‌ప్ జ‌రిగితే మాత్రం వైభ‌వ్ ను ఆ ప్ర‌పంచ క‌ప్ లోనూ చూడొచ్చు.

-సీనియ‌ర్ జ‌ట్టుకు ఆడి మ‌ళ్లీ ఏజ్ గ్రూప్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డం మ‌హిళ‌ల క్రికెట్లో సాధ్య‌మైంది. కానీ, పురుషుల క్రికెట్లో మాత్రం వీలుకాద‌నే చెప్పాలి. ఒక‌వేళ వైభ‌వ్ 2026లోనే టీమ్ ఇండియాలోకి వ‌చ్చేస్తే.. తిరిగి వెన‌క్కు చూసుకునే అవ‌కాశం లేనంత‌గా రాణిస్తే జాతీయ జ‌ట్టుకే ప్రాధాన్యం ఇస్తాడ‌నడంలో సందేహం లేదు.

Tags:    

Similar News